Friday, August 30, 2024

 సగుణోపాసన - నిర్గుణోపాసన

సామాన్య భక్త శ్రేణికి చెందినవారు తమ పూజా మందిరంలో ఇష్టమైన దైవ విగ్రహాలను, చిత్ర పటాలను ప్రతిష్ఠించుకొని, వాటిలోనే దైవాన్ని దర్శించుకుంటూ, తోచిన సామాగ్రితో పూజలు, పునస్కారాలు చేస్తుంటారు. ఇది సగుణోపాసన, భగవంతునికి రూపం, నామం, రంగు ఇవేమి లేవని, ఆయన సకలగుణాతీతుడని విశ్వసించేది ఆత్మతత్వం అదే నిర్గుణోపాసన.

ఆత్మదర్శనం అత్యుత్తమైనది ఇది మొదటి శ్రేణి. భగవంతుని గురించిన జ్ఞానం, ధారణ రెండో శ్రేణి. విగ్రహాలు, చిత్రపటాల పూజ మూడో శ్రేణి. తీర్థ యాత్రలు, పుణ్య క్షేత్రాల సందర్శనం నాలుగో శ్రేణి. వీటిలో చివరి రెండు మార్గాలు సామాన్య భక్త కోటికి సులభతరం. నిర్గుణోపాసనకు మొదటి మెట్టు సగుణోపాసనే. మనిషి అంటే శరీరం కాదు, ఆత్మ అని తెలియజేసేదే ఆధ్యాత్మిక జ్ఞానం. మానవత్వం నుంచి దివ్యత్వానికి చేరుకోవడమే ఆధ్యాత్మికమన్నారు విజ్ఞులు. మనిషిని మనీషిగా (జ్ఞానిగా), భోగిని యోగిగా, సామాన్యుడిని మహాత్ముడిగా మార్చి, అలౌకిక ఆనందాన్ని ఇచ్చేదే ఆధ్యాత్మికం. అది మానవ హృదయాన్ని వికసింపజేస్తుంది. సచ్చిదానందాన్ని ప్రసాదిస్తుంది. ఆధ్యాత్మికం అంటే పూజలు, జపాలు, తీర్థయాత్రలు అనే భావన చాలా మందిలో ఉంది. నిజానికి అవన్ని జీవన సోపానాలు మాత్రమే. మనసును నిగ్రహించుకొని, దృష్టిని అంతర్ముఖం చేయాలి. అప్పుడే మనిషి ఆత్మజ్ఞాన సంపన్నుడిగా మారతాడు. ఆత్మ సాక్షాత్కారం పొందుతాడు.

ఇక్కడ మీకు శ్రీరామ, హనుమ సంభాషణ చెప్పాలి. "హనుమా! నీకు నాకు ఉన్న అనుబంధం ఎలాంటిదంటావు ? రాముడి ప్రశ్న. “శ్రీరామా శారీరకంగా నీవు, నేను వేరు. భావనాపరంగా నీవు యజమానివి, నేను బంటుని. ఆధ్యాత్మికంగా నీవూ-నేనూ వేరు కాదు, నీవే నేను - నేనే నీవు" అని హనుమ బదులిచ్చాడు. శరీరధారణ ద్వారా సంక్రమించిన జాగ్రత్, స్వప్న, సుషుప్తి అవస్థలను మనిషి శరీరధారణ తన ప్రమేయం లేకుండా పొందుతూనే ఆత్మస్వరూపం తెలుసుకోవటానికి ప్రయత్నించాలి.. ఆత్మశోధనలేకుండా కేవలం తినటం, నిద్ర, కలలకే పరిమితం కావడం మనిషి చేయవలసిన పనులు కాదు. ఆత్మశోధనలోనే యోగులు తరించారు. మనిషికి, సమస్త ప్రాణికోటికి చివర గమ్యం "ఆత్మ" దర్శనమే.

No comments:

Post a Comment