Thursday, September 26, 2024

 *రావిచెట్టు ముందు దీపం ఎందుకు వెలిగిస్తారు ? దాని ప్రాముఖ్యత ఏమిటి ?*

రావి చెట్టును హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం అత్యంత పవిత్రమైన చెట్లలో ఒక్కటిగా చెబుతుంటారు. హిందువులతో పాటు బౌద్ధులు, జైనులతో సహా చాలా మంది ఈ పవిత్ర వృక్షాన్ని పూజిస్తూ ఉంటారు.

దైవ వృక్షంగా కూడా రావి చెట్టును భావిస్తారు. అందుకే ఈ చెట్టును పూజిస్తారు. రావి చెట్టు విష్ణువు, లక్ష్మీ దేవి నివాసమని పురాణాలు చెబుతున్నాయి. రావి చెట్టును అశ్వత్థ వృక్షం అని కూడా పిలుస్తుంటారు. పురాణాల్లో దీని గురించి ప్రస్తావన ఉంది. అలాగే రావి చెట్టు కింద పూర్వీకులు నివసిస్తారని దాని చుట్టూ ప్రదక్షిణ చేయడం వల్ల అన్ని రకాల పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు.

రావిచెట్టుకింద దీపం వెలిగించడం వల్ల మేలు జరుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. రావి చెట్టు కింద దీపాలు వెలిగించడం వల్ల దేవతల ఆరాధన జరిగినట్లు భావిస్తుంటారు. రావి చెట్టు క్రింద దీపం వెలిగిస్తే లక్ష్మీ దేవి కటాక్షం లభిస్తుందని నమ్ముతారు. అంతే కాకుండా రావి చెట్టు కింద నిత్యం దీపం వెలిగించడం వల్ల జీవితంలో డబ్బు, ఆహారానికి కొదవ ఉండదని భావిస్తారు, ముఖ్యంగా సాయంత్రం పూట రావిచెట్టుకింద దీపం వెలిగించడం వల్ల పితృదేవతలు కుటుంబంలో ప్రశాంతత కలిగిస్తారని విశ్వసిస్తారు.
శనివారం ఎందుకు దీపం వెలిగిస్తారు..
శనివారం రావి చెట్టు కింద ఆవ నూనెతో దీపం వెలిగించడం చాలా శుభదాయకం అని చెబుతారు. ఆవ నూనెతో దీపం వెలిగించడం ద్వారా శనిదోషం పోతుంది. నిజానికి రావి చెట్టు శనిదేవుడికి చిహ్నంగా భావిస్తారు. జాతకంలో శని దోషం ఉన్నవారు ప్రతి శనివారం రావిచెట్టు కింద ఆవ నూనె దీపం వెలిగించడం మంచిది. ఏలినాటి శని ప్రభావంతో బాధపడేవారు శనివారం రావిచెట్టును పూజించడంతో పాటు దీపం వెలిగించడం మంచిది.
రావి చెట్టును పూజించడం వల్ల కలిగే ప్రయోజనాలు..
రావి చెట్టుకు శనివారాల్లో నీరు సమర్పించడం వల్ల లక్ష్మీ దేవి ఆశీస్సులు లభిస్తాయి. కానీ పొరపాటున కూడా ఆదివారం రావి చెట్టుకు నీరు సమర్పించకూడదు. తాగకూడదు కూడా. బ్రహ్మ పురాణం ప్రకారం రావి చెట్టును పూజిస్తే త్రిమూర్తులను పూజించిన ఫలితం లభిస్తుందని చెబుతుంటారు. రావి చెట్టుకు పూజ చేస్తే శుభం కలుగుతుంది. శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది. అంటువ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. భగవద్గీత ప్రకారం శ్రీకృష్ణుడు రావి చెట్టులో నివసిస్తూ ఉంటాడని చెబుతుంటారు. అందుకే రావి చెట్టును ఆరాధించడం వల్ల కృష్ణుడి కరుణా కటాక్షాలు పొందుతారని నమ్ముతారు.

ఈ చెట్టు నీడన కూర్చుని గాయత్రి మంత్రం జపించడం వల్ల నాలుగు వేదాలు చదివిన పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతుంటారు.సంతానప్రాప్తి కోసం రావి చెట్టుకు మహిళలు పూజలు చేస్తూ ఉంటారు. అంతే కాకుండా భర్త దీర్ఘాయు ఇవ్వాలని కోరుకుంటూ పెళ్లయిన స్త్రీలు రావి చెట్టు చుట్టూ రక్షా సూత్రాన్ని కడతారు. ఇలా చేయడం వల్ల అవివాహితుల సౌభాగ్యం కలకాలం ఉంటుంది. రావి చెట్టును పూజించడం వల్ల వైవాహిక జీవితంలోని సమస్యలు కూడా తొలగిపోతాయి. రావి చెట్టును ఆరాధించే వారి జీవితంలో అదృష్టం కలసివస్తుంది.    

No comments:

Post a Comment