Wednesday, September 18, 2024

 ఏకఛత్రపురంలో పాండవులు బ్రాహ్మణరూపంలో భిక్షాటన చేసి జీవించారు కదా. క్షత్రియులై ఉండి బ్రాహ్మణ ధర్మమైన భిక్షాటన ఎలా చేశారు? ఇది అధర్మం కాదా?
ఏక చక్ర పురంలో లాక్షా గృహ దహనం నుండి తప్పించుకొని ప్రాణాలు గుప్పిట బెట్టుకొని ,ఆపద్ధర్మంగా బ్రాహ్మణ రూపాలలో సుమారు ఒక సంవత్సరం కాలం గడిపారు పాండవులు.

వాళ్ళు లక్క ఇంట మరణించారని విని , ధృతరాష్ట్రుడు ఆవరచి నట్లు అరచాడట ! మొత్తం మీద "ఆన్ రికార్డ్ "వాళ్ల పేర్లు మరణాల.రిజిస్టరు లో చేరిపోయి ఉంటాయి గదా! ఇక వాళ్లను ఎత్తివేయడం —నల్లేరు మీద బండి నడకే గదా!

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రహస్యంగా రక్షణ చేస్తూన్నవాడు విదురుడొక్కడే. ఆయన చాలా నిపుణంగా వీళ్ళ ఆరా తీస్తూ ఉన్నాడు గానీ , ప్రత్యక్షంగా ఏ నాడూ కలుసుకోలేదు.. ఆయన మనుషులు గూడా కలుసుకోలేదు.

దుర్యోధనుడికి మాత్రం వాడి అనుమానాలు వాడికుంటాయి గదా ! పాండవుల శవాలు స్పష్టం గా దొరకలేదు. పురోచనుడి తాలూకు శవాలు— అవి పాండవులవి అని లోకంలో ప్రకటించి ఇక వాళ్లు లేరు, మేమే మీ ఏలికలం (పేలికలం) అని అఫిషియల్ గా ప్రకటించుకో డానికి మాత్రమే ఆ శవాలు పనికొస్తాయి గానీ వాళ్ల కడుపులో ఉన్న అనుమానం పారద్రోలడానికి అవేమి చాలుతాయి.? అవి పాండవులవైతే పురోచనుడు, వాడి తాలూకు శవాలు దొరకలేదే!!

పాండవులు బతికే ఉండవచ్చు అనే అనుమానం వాడికి ఉండనే ఉంది. ఈ విషయానికి ఒకే ఆధారం ఉంది. .

ధృతరాష్ట్రుడు ఎట్లయినా ఒక పేద్ద రాజ్యానికి అధిపతి. ఆయనను ఎప్పుడు బడితే అపుడు కొడుకులైనా ఎట్ల కలుసుకుంటారు? దేనికైనా ఒక సమయం అని కేటాయించుకోవాలి గదా!

విదురుడు ఉపాయంతో ఏవేవో సమావేశాలు..ఎవరెవరితోనో ముందుగానే ఏర్పాటు చేసి పెట్టేస్తూ ఈ అబ్బా కొడుకులు రహస్యంగా కలుసుకొనే వెసులుబాటు లేకుండా చేశాడు — ఒక సంవత్సరకాలం.

దుర్యోధనుడు ఏది చేయాలన్నా ఆధికారికంగా చేయాలి. అన్నిటికీ ధృతరాష్ట్రుడి రబ్బర్ స్టాంప్ ఉండాలి. అందుకు భీష్ముడి అంగీకారం కుదరాలి ( ఇవేవీ లేకుండా ఒక సారి ఘోషయాత్ర చేసి — పూర్తి అధికారం దొరికిన 13 ఏండ్ల లోనే అనుకోండి— చావుదప్పి కన్ను లొట్టబోయిన పరిస్థితి తెచ్చుకొన్నాడు గదా! ఈ పుత్రులను కాపాడడం ఇంకో పెద్ద పని ఆ భీష్ముడికి.)

పాండవులు ద్రౌపదిని వివాహమాడి క్షేమంగా స్థిరపడిన పిదపనే, వాళ్ల ఉనికి కౌరవ సామ్రాజ్యానికి తెలిసేట్టు రహస్యరక్షణ చేశాడు విదురుడు.

పాండవుల ఉనికి స్పష్ట పరుపబడింది.

అపుడు కర్ణుడూ, దుర్యోధనుడు వచ్చారు ధృతరాష్ట్రుడి దగ్గరకు..

" రేయును బగలును విదురుడు

నీ యొద్దన యునికి జేసి నేరము పలుకన్

మాయిష్టం బెరిగింపగ

ధీయుత! యెడగంటిమిన్ని దివసంబులకున్"…

అని నెత్తి కొట్టుకున్నాడు దుర్యోధనుడు.

ఇంత క్లిష్ట స్థితి గాబట్టే పర ధర్మంలో జీవించారు వాళ్లు.

భీష్ముడు అంపశయ్య మీద అనేక ధర్మాలు బోధిస్తాడు. ఆపద్ధర్మంగా పరధర్మం కొంత కాలం అనుసరించవచ్చును గానీ, ఇదే బాగున్నదని ఆ పర ధర్మంలోనే ఉండి పోకూడదు. ఆ ధర్మంలో ఉన్నపుడు జీవిక సంపాదించుకోవచ్చును గానీ, ఆ ధర్మాన్ని అగౌరవపరచగూడదు అని చెప్పాడు.

పాండవులు భిక్షాటన చేసుకోవచ్చును గానీ, బ్రాహ్మణులే చేసే వైదిక కర్మలు చేయగూడదు.

No comments:

Post a Comment