🌹గుడ్ మార్నింగ్ 🌹నేను శరీరము, మనసు, బుద్ది, ప్రాణశక్తి. శరీరము నా నిత్య అనుభవము. అదే నేనన్న సంపూర్ణ భావన. దానితోనే ప్రయత్నాలు, దానితోనే అనుభవాలు, దాని రాకతో ఉండటం, దాని అంతమే నా అంతమన్న భావన.
మనసు ఉన్నదని తెలుసు. భావరూపములో సుఖదుఖాలు, భయాలు అనుభవిస్తూ వుంటాను. కాని అవి కూడా శరీరానికే ఆపాదించుకుంటాను. ప్రత్యేకముగా ఇలా చెప్పుకున్నప్పుడు గుర్తిస్తాను తప్ప - శరీరానికి భిన్నముగా - భావాల మనసును గుర్తించను.
బుద్ది అంటే విచక్షణా జ్ఞానము - తప్పు, ఒప్పు అన్నీ అది చెబుతూనే ఉంటుంది. లోపల తెలుస్తుంది. కాని శరీరానికి, మనసుకు భిన్నముగా దానిని గుర్తించను. అసలు దానికి ఎటువంటి ప్రత్యేక విలువ ఇవ్వను.
నేను అనుకుంటున్న శరీరము, మనసు, బుద్ది, పని చేయటానికి - అవి ఉండటానికి ఆధారము నా ప్రాణము. ప్రాణ శక్తి గూర్చి ఏదైనా విషయ చర్చ వచ్చినప్పుడు తప్ప దాని ధ్యాస అసలు కలుగదు. దాని ఎరుక లేదు.
అన్నీ కలిపి ఏకముగా శరీర భావనతో జీవిస్తున్నాను.
ఒక్క శరీర భావనే కాదు - ప్రతి దాన్ని విడి విడిగా గుర్తిస్తూ వెళ్ళు - నీ సంపూర్ణ సామర్ధ్యం నీకు తెలుస్తుంది. నేను అని నీవు భావించుకునే నీ అసలు స్వరూపము నీకు అర్ధమవుతుంది అని చెప్పేదే ఆధ్యాత్మికత. నా గూర్చిన సంపూర్ణ చదువు.
శరీరాన్ని వదలి మనసులోకి వెళితే - నేను పదార్ధాన్ని కాదు - భావాన్ని అని తెలుస్తుంది.
మనసును దాటి బుద్దిలోకి వెళితే నేనుపరిమిత భావాన్ని కాదు - భావమూలమైన జ్ఞానాన్ని అని తెలుస్తుంది.
బుద్దిని వదలి ప్రాణశక్తిలోకి వెళితే - నేను - నువ్వు అనే విభేదమే అసలు లేదని,వున్నది ఒక్కటే అది నిశ్చలత్వం - నిర్మలత్వం అని అందులో స్థిరత కలుగుతుంది.
అప్పుడు భావ కదలికలు ఉండని నిశ్చల మనసు ఉంటుంది. విచక్షణతో పనిలేని కేవల శక్తి స్థితి ఉంటుంది. ఇక్కడి వరకు సాగే మనిషి ప్రయాణమే ఆత్మజ్ఞాన, ఆధ్యాత్మిక, స్వీయ అంతరంగ చదువు. నిన్ను నువ్వు ఒక్కొక్క మెట్టు ఎక్కించుకుంటూ శరీర ఇరుకు సందు నుండి అనంత విశాలత్వానికి నువ్వే సాగాలి. అది నీ స్వీయ నిర్ణయం. అందుకే జీవితం ఇవ్వబడింది అన్నది ఆధ్యాత్మిక వాదుల అభిప్రాయము.🌹god bless you 🌹
No comments:
Post a Comment