Vedantha panchadasi:
తమేవైకం విజానీథ హ్యన్యా వాచో విముంచథ ౹
యచ్ఛేద్వఙ్మనసీ ప్రాజ్ఞ ఇత్యాద్యాః శ్రుతయః స్ఫుటాః ౹౹48౹౹
48.ఆత్మను ఒక దానిని మాత్రమే తెలిసికొనుము.ఇతర వాక్కులను పరిత్యజింపుము అని ముండకోపనిషత్తు 2.2.5,వాక్కును మనస్సునందు లయము చేయుము మొదలైనది కఠోపనిషత్తు 3.13,మొదలగు శ్రుతులు స్పష్టముగ ఉద్ఘోషిఃచుచున్నవి.ఇతర వాక్కులనగా అపరావిద్యయని
శ్రీ శంకరులు అభిప్రాయము.
శరీరము పడిపోక పూర్వమే ఈ ఆత్మను తెలిసికొనువాడు సంసార బంధమునుండి విముక్తుడగుచున్నాడు.అట్లు తెలిసికొనలేనిచో అతడు మరల శరీరమును ధరింపవలసివచ్చును.
పునర్జన్మను పొందవలసివచ్చును.
పరమేశ్వరుడైన బ్రహ్మ,బయటకు పోవు స్వభావముగల యింద్రియములను సృష్టించెను అందువలననే మానవుడు అంతరాత్మను చూడక,బైటి విషయములనే చూచుచున్నాడు.
కాని కొంతమంది ధీమంతులు ఆత్మాభిముఖముగా దృష్టిని లోనికి మరలించి యా ప్రత్యగాత్మను దర్శించుచున్నారు.
ఆత్మను ఒక దానిని మాత్రమే తెలిసికొనుము.ఇతరములను
(అపరావిద్య)మనస్సు నందు లయము చేయుము.
ఏ ఆత్మ చేత మనుష్యుడు శబ్ద స్పర్శ రూప రస గంధములను కామాదులను మున్నగు వానిని తేలిసికొను చున్నాడో అట్టి ఆత్మకు ఈ జగత్తులో తెలియనిదేమున్నది?
"ఇదియే అది".
సద్గురువును సమీపించి ఆత్మజ్ఞానము సంపాదించవలెను.ఆ మార్గము పదును గల కత్తి అంచులవలె చాలా నిశితమైనది.
ఆత్మ శబ్ద స్పర్శరూప రసగంధములు లేనిదియు అవ్యయమైనదియు,ఆద్యంతములు లేనిదియు,నిత్యమైనదియు, మహత్తుకు పరమైనదియు అయివున్నది.
అట్టి ఆత్మను తెలిసికొనినవాడు మృత్యుముఖము నుండి పూర్తిగ విడువడును.
No comments:
Post a Comment