Wednesday, October 16, 2024

****ఆత్రేయగీత* మొదటి భాగం అధ్యాయము - 11 “వైరాగ్యము”

 *ఆత్రేయగీత*

మొదటి భాగం

అధ్యాయము - 11

“వైరాగ్యము”

వైరాగ్యం అంటే - ఏది అసత్యమో దానిని విడిచిపెట్టడం!

ఏది శాశ్వతం కాదో దానియందు విరక్తి కలిగివుండటం! అశాశ్వతమైనదేదో గ్రహించే జ్ఞానంతో వైరాగ్యం సిద్ధిస్తుంది!

వైరాగ్యం అనేది వాస్తవంగా ఒక యోగము (కలయిక). ఒకదానితో కలిస్తే గానీ ఇంకొక దానినుండీ విడిపోవడం కుదరదు! ఆత్మతో సంబంధం పెట్టుకుంటేనే వైరాగ్యం సిద్ధిస్తుంది! అది లేకపొతే వైరాగ్యం కుదరదు!

వైరాగ్యము మనోవైఫల్యంతోనూ, మనోద్వేగంతోనూ పుడితే ఆ వైరాగ్యభావం శాశ్వతం కాదు. కర్తృత్వమును విడిచిపెట్టి పనిచేస్తే వైరాగ్యం అలవడుతుంది!

భక్తి, జ్ఞానము, వైరాగ్యము ఒకదానితో ఒకటి
ముడిపడివుంటాయి!

భక్తిలో తప్పకుండా జ్ఞానం వుండాలి. ఎక్కడ జ్ఞానము వుంటుందో అక్కడే వైరాగ్యం వుంటుంది. ఎక్కడ వైరాగ్యం వుంటుందో అక్కడ పరమాత్మ వుంటాడు!

భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు ఆత్మజ్ఞానానికి సోపానాలు -

భక్తి - ఏది సత్యమో దానియందు గాఢమైన విశ్వాసం!

జ్ఞానం - ఏది శాశ్వతమో దాన్ని తెలుసుకోవడం!

వైరాగ్యం - ఏది అసత్యమో దానిని విడిచిపెట్టడం!

బాహ్య వస్తువులపై ఆసక్తి వున్నంతసేపు, ఆత్మ వస్తువు గోచరించదు! దృష్టిని బాహ్యం నుండి అంతర్ముఖం చెయ్యాలి!

కర్మ-జ్ఞాన యోగములతో వైరాగ్యం అలబడుతుంది! అందుకే జ్ఞానులు తాముచేయు కర్మలన్నీ భగవంతునిపై ఆరోపించి, ఏమి ఆశింపక, మనోబుద్ధుల ప్రమేయంలేక కేవలం ఇంద్రియాలతో కర్మలు ఆచరిస్తారు. అది వైరాగ్యానికి మొదటిమెట్టు.

“నా ఆత్మయే నీవు”, “నాచే చేయిస్తున్నది నీవు” అన్న సంకల్పంతో కర్మలాచరిండమే వైరాగ్యం! 

No comments:

Post a Comment