Tuesday, October 29, 2024

 *ఆప్త వాక్యాలు*

3) తన్మే మనః శివసంకల్పమస్తు

నా మనస్సు శివ (శుభ) సంకల్పములతో నుండుగాక (యజుర్వేదం)

దేనికైనా మనస్సే కారణం. ఇంద్రియాల చైతన్యమంతా మనోమూలకం.

 మనస్సు చేసే సంకల్పాలే మన జీవితాన్ని నిర్మిస్తాయి. మన ఏవ మనుష్యాణాం కారణం
బంధమోక్షయోః - బంధానికి, మోక్షానికీ, సుఖానికి, దుఃఖానికీ మనస్సే కారణం.

కాబట్టి సంకల్పం శుద్ధంగా ఉండాలి. సంకల్పశుద్ధి ఉంటే కార్యం సక్రమంగా నడుస్తుంది. ఫలితం చక్కనిది లభిస్తుంది. ఆ సంకల్ప శుద్ధినిచ్చే వేదమంత్రం ఇది.

శుక్ల యజుర్వేదంలో ఈ 'శివసంకల్పం' ఒక సూక్తంగా అనేక మంత్రాలతో అనుసంధానించబడి ఉంది. 

పైగా 'శివ' అనేది శాశ్వత శుభాన్ని తెలియజేసేది. ఈ 'శివ' శబ్దం గొప్ప దివ్యార్థాలతో కూడినది. దీనికి శ్రేయస్సు, మంగళం, మోక్షం -
అనే మూడు అర్థాలూ ఉన్నాయి.

స్వార్థపూరితమైన అర్థసంపాదన 'శివం' కాదు. తాత్కాలిక సుఖమూ 'శివం' కాదు.పరిణామంలో కూడా శుభంగా ఉండేదే 'శివం'. అటువంటి 'శివం' మన సంకల్పమైతే
అంతా సత్యమూ... సుందరమే.

ఇంకో విశేషం - 'శివం' శబ్దం పరమేశ్వరుని తెలియజేసే నామం. శాశ్వత మంగళ స్వరూపుడు - శివుడు. ఈ జగత్తంతటికీ ఆయన సంకల్పమే ప్రధాన ప్రేరణ. కాబట్టి మన సంకల్పం మహాదేవుని సంకల్పానికి అనుగుణమైనది కావాలని కూడా ఈ మంత్రానికి అర్థాన్ని భావించవచ్చు.


మన సంకల్పం ఈశ్వరసంకల్పం కావాలి అంటే ఈశ్వర సంకల్పంతో అనుసంధానమవ్వాలి. అప్పుడు శాశ్వతమై, అనివార్యమైన భగవత్ సంకల్పానికి మనసంకల్పం విరుద్ధంగా ఉండదు. తద్వారా అనుకొన్నదొకటి, అయ్యేదొకటీ జరగదు. అంతేకాక - 'శివ' స్ఫురణ వల్ల మన సంకల్పం శక్తిమంతమైన కార్యరూపం ధరించి, సాఫల్యాన్నిస్తుంది. ఇన్ని మహార్థాలు, ఇంకా ఎన్నో దివ్య భావాలు ఈ వేదవాక్యంలో దాగి ఉన్నాయి.          

No comments:

Post a Comment