*ఆత్రేయగీత*
మొదటి భాగం
అధ్యాయము - 8
“భక్తి"
సుళువుగా చెప్పాలంటే, ఒక దానియందు గాఢమైన విశ్వాసాన్ని భక్తి అంటారు! జీవునికి భగవంతునికి వున్న సంబంధమే భక్తి!
భక్తితో జీవునికి ఎనలేని ఆనందం కలగాలి! జీవుని శరీరం, మనస్సు ఆనందంతో పులకరించకపోతే అది భక్తి కాదు!
భక్తి వున్నచోట భయం వుండదు! భయం వున్నచోటు భక్తి నటనే అవుతుంది!
భక్తిని మూడు రకాలుగా చెప్పవచ్చు - సకామ భక్తి - దీనివలన కోరికలు నెరవేరవచ్చు కానీ ఆత్మజ్ఞానం సిద్ధించదు!
నిష్కామ భక్తి - ఎటువంటి కోరికలు వుండవు. ఇది అజ్ఞానాన్ని దూరం చేస్తుంది!
అనన్య భక్తి అంటే ఎటువంటి షరతులు లేని గాఢమైన విశ్వాసము!
అనన్య భక్తి ద్వారా అనుభవ జ్ఞానము లభిస్తుంది. తద్వారా పరమాత్మ నేను ఒకటే అనే భావన అనుభూతి కలుగుతుంది.
సాకారోపాసన (ఒక రూపం కలిగిన వస్తువును దేవునిగా భావించి ఆరాధించడము) శ్రద్ధతో ఆచరిస్తూ, దైవముపై పరిపూర్ణ విశ్వాసముతో, భగవంతునికి యిష్టమైన కర్మలు నిష్కామంతో ఆచరిస్తే ఉత్తమ ఫలితములు పొందవచ్చును.
సాకారమైన లేదా నిరాకారమైన, సగుణమైనా లేదా. నిర్గుణమైనా, కావలసింది శ్రద్ధాభక్తులు మాత్రమే.
ఇటువంటి శ్రద్ధాభక్తులతో కూడిన ఉపాసనతో క్రమముగా చిత్తశుద్ధి ఏర్పడి నిర్గుణోపాసనకు కావలసిన వివేకము, విచారణాబలము జీవునికి లభిస్తుంది.
“దాసోహం”తో ప్రారంభమైన ప్రక్రియ “సోహం” అనే ఉన్నతస్థితికి చేరుకుంటుంది.
భగవత్ భక్తికి అందరూ అర్హులే!
రాక్షసులైన ప్రహ్లాదుడు, బలి, విభీషణుడు భక్తులే కదా! జంతువులైన గజేంద్రుడు, జాంబవంతుడు, హనుమంతుడు భక్తులే కదా!
పక్షులైన సంపాతి, జటాయువు భక్తులే కదా!
పరమాత్మ సృష్టిలో అందరూ పాత్రధారులే కదా!
No comments:
Post a Comment