శ్రీమద్భాగవతం - 94 వ భాగం
శ్రీకృష్ణుని మహిమ నారదుండరయుట :
నారదమహర్షి అన్ని లోకములు తిరుగుతున్నప్పుడు ఆయనతో ఎవరో ‘నారదా, కృష్ణుడు 16వేలమందిని పెళ్లి చేసుకున్నప్పుడు నీవు వెళ్ళావా?” అని అడిగారు. అప్పుడు ఆయన 16వేలమందిని ఎన్ని రోజులు పెళ్ళి చేసుకున్నాడు?” అని అడిగాడు. ఆయన నరకాసురుడి మీదికి యుద్ధమునకు వెళ్ళినపుడు నరకాసురుడు తీసుకువచ్చి కారాగారంలో బంధించి దాచిన 16వేలమంది రాజ కుమార్తెలను తన రాజధానికి తీసుకువచ్చి 16వేలమందికి 16వేల సౌధములు నిర్మించి 16వేలమందిని ఒకే ముహూర్తంలో ఒకే కృష్ణుడు 16వేలమంది కృష్ణులై తాళి కట్టారట’ అన్నారు. ఈ మాటలు విని నారదుడు ఆశ్చర్యపోయి ఇది ఎలా జరుగుతుంది? అన్నాడు. అనగా అంతటి జ్ఞాని ఎటువంటి మోహమునాకు గురి అయ్యారో చూడండి. తాళి అయితే కట్టాడు. మరి సంసారం ఎలా చేస్తూ ఉంటాడు? అనుకుని చూసి వద్దామని కృష్ణుని దగ్గరకు బయల్దేరి భూలోకమునకు వచ్చాడు. ద్వారకానగరంలోకి ప్రవేశించాడు. ద్వారకా నగరం పరమ రమణీయంగా ఉంది. ఆ నగరంలోని ఒక యింట్లోకి వెళ్ళాడు. అది కృష్ణ పరమాత్మ వివాహం చేసుకున్న 16వేలమంది స్త్రీలలో ఒకస్త్రీ గృహం. ఆవిడ తామర పూవువంటి తన చేతితో వింజామర చేత పట్టి కృష్ణ భగవానునికి విసురుతోంది. భార్యచేత సేవలు పొందుతున్నాడు అని వెళ్ళిపోదా మని వెనక్కి వెళ్ళిపోబోతుండగా అటు తిరిగి కూర్చుని సేవలందుకుంటున్నవాడు వెనక కన్ను లేకుండానే ఇతనిని గమనించి తాను కూర్చున్న ఆసనం దిగి నారదునికి ఎదురు వచ్చి అలా వెళ్ళిపోతున్నారే నారదా! లోపలికి రండి. మీరు నాతొ ఏదయినా పని ఉండి వచ్చారా? మీరు ఏ పని చెప్పినా ఆ పనిని ఔదల దాల్చి చేయడానికి ఈ సేవకుడు మీ దగ్గర సిద్ధంగా ఉంటాడు ఎప్పుడూ ’ అన్నాడు. అపుడు నారదుడు ‘కృష్ణా! మహానుభావా! దామోదరా నీవు భక్తులపాలిట సర్వ కాలముల యందు కల్పవృక్షము వంటి వాడివి. దుష్ట జనులను నిగ్రహించడానికి నీవు యిటువంటి అవతారములను స్వీకరిస్తావు. ఏ నీ పద సేవ చేయాలని బ్రహ్మాది దేవతలు కోరుకుంటారో అటువంటి నీ పాదపద్మముల యందు నిరంతరమూ నా మనస్సు వశించి ఉండే వరమును నాకు యీయవలసినది’ అని నారదుడు కృష్ణుని అడిగాడు. తరువాత బయటికి వచ్చి ఈ యింట్లో ఉన్నాడు కాబట్టి పక్క యింట్లో ఎలా ఉండగలడు అనుకుని ఆ యింట్లోకి తొంగి చూశాడు. ఒక్కొక్క యింట్లోకి వెళ్లి యిలా తలుపు తీసి చూశాడు. ఎక్కడికి వెళ్ళినా సంసారిలాగే కనపడుతున్నాడు. ఎక్కడా పరబ్రహ్మలా లేడు. ఎక్కడికి వెడితే అక్కడే ఉన్నాడు. అన్నీ చూసి బయటకు వచ్చి అంతఃపురమునందు నిలబడిన నారదుడు అన్నాడు – ఏమి నా ఆశ్చర్యము! ఏమి నా ఆనందము! ఏమి కృష్ణ పరమాత్మ! మహానుభావుడు యింతమందితో రమిస్తున్నాడు. ఎలా? ఏకకాలమునందు అగ్నిహోత్రము ఎన్ని వస్తువులను కాల్చినా వాటి పవిత్రత కాని, అపవిత్రత కాని తనకి అంటనట్లు సూర్యకిరణములు బురదమీద పడినా, సజ్జనుడి మీద పడినా, దుర్జనుడి మీద పడినా సూర్యునికి అపవిత్రత లేనట్లు యిన్ని ఇళ్ళల్లో సంసారం చేస్తున్నవాడు సంసారాతీతుడై ఉన్నాడు’ అని పొంగిపోయి ఆనందంతో వైకుంఠమునకు వెళ్ళిపోయాడు.
ఇది కృష్ణ పరమాత్మ ఆశ్చర్యకరమయిన సంసార రీతి. దీనివలన మనకు ఏమి తెలుస్తున్నది? కృష్ణ పరమాత్మ 16వేలమంది కన్యలను మదము చేత చేసుకున్న వాడు కాదు. వారిని ఉద్ధరించాలని చేసుకున్నాడు. ఇది కృష్ణ పరమాత్మ వ్యాపకత్వమును, విష్ణు తత్త్వమును ఆవిష్కరిస్తుంది. కాబట్టి కృష్ణుడు చేష్టితములను మీరు వేలెత్తి చూపించే ప్రయత్నం చేయకూడదు. నారదుడంతటి వాడు నమస్కరించి వెనుదిరిగాడు. మనం ఎంతటి వారము! ఈ లీల విన్న తరువాత పొంగిపోయి ఎవరు కృష్ణ పరమాత్మకి నమస్కరించి వ్యాప కత్వము ఉన్న స్వామి అంతటా ఉన్నాడని గ్రహించి ఆనందిస్తారో వారికి స్వామి ఒక వరం యిచ్చారు. ఎవరయితే పరమభక్తితో కృష్ణ భగవానుని సంసారమును నారదుడు చూసే ప్రయత్నము చేసి తాను ఆనందించిన కథా వృత్తాంతమును విని పరమాత్మకు నమస్కరిస్తున్నారో, వారియందు కృష్ణ భక్తి ద్విగుణీకృతమై వారు భగవంతుడిని తొందరగా చేరుకుంటారు. దానితో పాటు ఇహమునందు అపారమయిన ధనమును పొంది పశు, పుత్ర మిత్ర వనితాముఖ సౌఖ్యములన్నిటిని అనుభవించగల స్థితిని కృష్ణ పరమాత్మ వారికి కల్పిస్తాడు అని ఆ ఆఖ్యానమును పూర్తిచేశారు.
భీముడు జరాసంధుని వధించుట:
ఒకనాడు కృష్ణ పరమాత్మ నిండు పేరోలగంలో సభ తీర్చి ఉన్నాడు. అపుడు ఒక బ్రాహ్మణుడు సభలోకి వచ్చి ఒక మాట చెప్పాడు. ‘అయ్యా, జరాసంధుడు అనే రాజు అనేకమంది రాజులను ఓడించి కారాగారంలో బంధించాడు. వారందరూ కూడా అనేకమయిన హింసలు పొందుతున్నారు. కాబట్టి మీరు త్వరలో విచ్చేసి జరాసంధుడిని వధించి ఆ రాజులందరికీ స్వేచ్ఛ కలిగేటట్లుగా అనుగ్రహించ వలసినది’ అని కోరాడు. ఆమాటలు విన్న కృష్ణ పరమాత్మ సంతోషించి ‘తప్పకుండా మేము తొందరలో వచ్చి జరాసంధుడిని వధిస్తాము’ అని మాట యిచ్చి, ఈ సందర్భంలో ఎం చేస్తే బాగుంటుందో ఆలోచనను చెప్పమని ఉద్ధవుడిని అడిగారు. పరమాత్మ అన్నీ తెలిసు ఉన్న వాడయి ఉంది ఉద్ధవుడిని అడగడం ఎందుకు? కానీ ఈశ్వరుడికి సహకరించిన పుణ్యమును పదిమందికి కట్టబెడతారు. అపుడు ఉద్ధవుడు అన్నారు “ఇటువంటి కార్యం చేసేముందు ఒకపని చేస్తే బాగుంటుంది. ధర్మ
రాజు గారి చేత రాజసూయయాగం చేయించి ఆ యాగం చేసేటప్పుడు నాలుగు దిక్కులా ఉండే రాజుల పీచమణచడానికి నలుగురిని పంపవలెను కనుక ఆ సందర్భంలో జరాసంధుడిని కూడా వధించి రాజసూయ యాగం చేస్తే బాగుంటుంది మీరు అలా ఆలోచించండి’ అన్నాడు. ‘చాలామంచి ఆలోచన చెప్పావు’ అని కృష్ణ పరమాత్మ ఇంద్రప్రస్థమునకు చేరుకున్నారు.
ధర్మరాజు కృష్ణ పరమాత్మకు ఎదురువచ్చి స్వాగతం పలికాడు. రాజసూయ యాగం చేయడానికి సంకల్పం జరిగింది. వెంటనే ధర్మరాజు గారు తన సోదరులను పిలిచి నలుగురినీ నాలుగు దిక్కులకు పంపారు. నాలుగు దిక్కులకు వెళ్ళిన వారు అన్ని దిక్కుల వాళ్ళని ఓడించి తిరిగి వచ్చారు. ధర్మరాజుగారి పేరు చెప్పగానే ఎవరూ వ్యతిరేకించిన వారు లేరు ఒక్క జరాసంధుడు తప్ప. ఏమి చెయ్యాలా అని ఆలోచిస్తుంటే కృష్ణ పరమాత్మ ‘ధర్మజా, నీవు బెంగ పెట్టుకోవద్దు. జరాసంధుడిని వధించడం కోసమని నేను అర్జునుడు భీమును బ్రాహ్మణ రూపంలో వెళతాము. జరాసంధుడి దగ్గర ఒక మంచి అలవాటు ఉంది. వాడు బ్రాహ్మణులు ఏదయినా అడిగితే లేదనకుండా ఇచ్చేస్తాడు. కాబట్టి బ్రాహ్మణరూపంలో వెళ్లి యుద్ధ భిక్షను అడుగుతాము. ఇస్తాను అనిన తరువాత వాడు తప్పుకోవడానికి వీలులేదు. వాడు యుద్ధం చేస్తాడు. యుద్ధంలో జరాసంధుడు మరణిస్తాడు. తరువాత రాజసూయ యాగం చేద్దాము’ అని ముగ్గురూ బ్రాహ్మణ రూపములు ధరించి మగధ దేశమునకు వెళ్ళారు. జరాసంధుడు బయటకు వచ్చి మీకేమి కావాలి?” అని అడిగాడు. వాళ్ళు మాకు యుద్ధభిక్ష కావాలి అన్నారు. బ్రాహ్మణులయిన వారు యుద్ధ భిక్ష కోరడం ఏమిటి అని జరాసంధుడు వారి ముగ్గురిని తేరిపార చూశాడు. వాడేమీ తెలివి తక్కువ వాడు కాదు. వచ్చినవాళ్ళు కృష్ణ భీమార్జునులని గుర్తించాడు. కృష్ణుడిని చూసి ఒక మాట అన్నాడు. జరాసంధుడు కృష్ణుని చేతిలో 17సార్లు ఓడిపోయాడు. కానీ 18 వ సారి జరాసంధుడిని తప్పించుకుని ద్వారకకు పారిపోయి అక్కడ ఉన్నాడు. 18 వ సారి కృష్ణుడు ఓడిపోయినట్లు నటించాడు. అపుడు ఆయన అలా ఓడిపోయినట్లు నటించడానికి కారణమే ఇప్పుడు జరాసంధుడు చచ్చిపోవడానికి కారణం అవుతుంది. 17 సార్లు తానూ ఓడిపోయానన్నది జరాసంధుడు మరచిపోయాడు. 18 వ సారి కృష్ణుడు పారిపోయాడు అన్నది గుర్తు ఉంది. జరాసంధుడు కృష్ణుడిని ఎంత మాట అన్నాడో చూడండి!
“ఏమి వింతయ్యా! నేను యుద్ధమునకు వస్తే పారిపోయిన వాడివి ఇవాళ వచ్చి యుద్ధ భిక్ష అడుగుతున్నావు. అడగడానికి నీకు సిగ్గు లేకపోవచ్చు. కానీ నీతో యుద్ధం చేయడానికి నేను సిగ్గుపడుతున్నాను. పారిపోయిన వాడితో నాకు యుద్ధం ఏమిటి? నేను నీతో యుద్ధం చేయను” అన్నాడు. ఈశ్వరుని అధిక్షేపించడంలోనే వాని మరణం వచ్చింది.
‘కృష్ణా నాతొ యుద్ధ భూమిలో నిలబడడం అంటే అంత తేలికయిన విషయం కాదు. ముందు నువ్వు పక్కకి వెళ్ళు. అర్జునుడు మంచి బలపరాక్రమములు ఉన్నవాడు. గాండీవం పట్టుకుంటే శత్రువులను దునుమాడుతాడు. కానీ అతడు నాకంటే చిన్నవాడు. వీనికన్న పెద్దవాడు భీముడు ఉన్నాడు కదా. అతడు మహా బలవంతుడు. పైగా వాయుపుత్రుడు. నాతో బలమునకు సరిపోతాడు’ అని మిక్కిలి కోపంతో చెయ్యి విసిరి యుద్ధమునకు రమ్మనమని అవతల వాళ్ళని లాగడం మొదలు పెట్టాడు. భీమసేనుడు జరాసందునితో యుద్ధానికి సిద్ధపడ్డాడు.
వెంటనే మల్లయుద్ధం చేయడానికి వీలుగా ఒకచోట భూమిని సమతలంగా తయారుచేశారు. జరాసంధుడు భీమసేనుడు యిద్దరూ మల్లయుద్ధం మొదలుపెట్టారు. భయంకరమయిన యుద్ధం సాగుతోంది. ఇద్దరూ కూడా ఒకరికొకరు తీసిపోని రీతిలో కొట్టుకుంటున్నారు. ముక్కుల్లోంచి కళ్ళల్లోంచి నెత్తురోడి పోయి యిద్దరూ కూడా ఎర్రటి రంగులోకి మారిపోయారు. అలా కొట్టుకుంటున్నారు. బీమునిలో ఉండే తేజస్సు క్షీణించకుండా కృష్ణ పరమాత్మ తనలో ఉన్న తేజస్సును భీమసేనుడియందు ప్రవేశపెట్టారు. కృష్ణుడు తేజస్సు కలియడం వలన భీమసేనుడి తేజస్సు క్షీణించలేదు. జరాసంధుడిది పదివేల ఏనుగుల బలం. యుద్ధంలో వాడేమీ సామాన్యుడు కాదు. యుద్ధం జరగగా జరగగా జరాసంధుడి శక్తి క్షీణించడం మొదలుపెట్టింది. ఎడతెరపి లేని యుద్ధం చేస్తున్న భీమసేనుడి వంక చూసి కృష్ణ పరమాత్మ ఒక్కసారి ఆయన దృష్టిని ఆకర్షించేటట్లుగా పిలిచి చెట్టుకొమ్మ తీసి దానిని రెండుగా చీల్చి చూపించారు. ఆ సంజ్ఞను భీముడు అర్థం చేసుకుని జరాసంధుని ఒకకాలును తన రెండు కాళ్ళతో తొక్కిపట్టి రెండవ కాలును పట్టుకుని ఉత్తరించేస్తే, శరీరంలో సగభాగం తలవరకూ జరాసంధుడి శరీరం రెండు ఖండములుగా విడిపోయింది. ఆ రెండిటిని భీముడు అటూ యిటూ విసిరేశాడు. ఆ రోజున జరాసంధుడు మరణించాడు. అతని మరణానంతరం కృష్ణుడు అక్కడ ఉన్న రాజులందరినీ విడిపించాడు. ‘ధర్మ బద్ధమయిన పాలన చేసే వాడు ఎవడు ఉంటాడో, వానియందు నేను సర్వకాలముల యందు ప్రీతిని కలిగి ఉంటాను. అందుకని మీరు ధర్మ బద్ధంగా పరిపాలించండి’ అని చెప్పి ఆ రాజులకు హితోపదేశం చేసి విడిచి పెట్టేశారు. ఆ రాజులందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోయారు. జరాసంధుని వద్ద ఉన్న ధనకనకవస్తు వాహనములను పట్టుకుని కృష్ణ భీమార్జునులు ఇంద్రప్రస్థమునకు చేరుకున్నారు. అప్పుడు రాజసూయ యాగము చేయడానికి ధర్మరాజు సంకల్పం చేశారు.
No comments:
Post a Comment