Saturday, October 19, 2024

 తెలుగు ఆధ్యాత్మిక పుస్తకాలు:
☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️

9. క్రతో స్మర క్లిబే స్మర కృతం స్మర

శుభకర్మలను గుర్తుంచుకో. నీ సామర్థ్యాన్ని గుర్తుంచుకో. ఇతరులు చేసిన
మంచిని (కృతజ్ఞత) గుర్తుంచుకో(యజుర్వేదం)


లోకశ్రేయస్సుకై చేసే శుభకర్మను 'క్రతువు' అంటారు. వాటిని ఏనాడూ విడువకూడదు.

అదేవిధంగా స్వశక్తినీ, స్వసామర్థ్యాన్నీ విస్మరించరాదు. మనమేమిటో, మన శక్తి
ఏమిటో గుర్తించాలి. ప్రతివ్యక్తీ ఈ విశ్వశ్రేయస్సు అనే మహాయజ్ఞ నిర్వహణకి
సాధనగా మారాలి. అందుకు తన సామర్థ్యాన్ని వినియోగించుకోవాలి.

ఈ శరీరమనే శక్తిమంతమైన సాధన భగవంతుడు మనకిచ్చిన గొప్ప వరం. దీనికి
ఉన్న సమర్థతని నిరంతరం తెలుసుకొని, దానిని వినియోగించాలి.

శరీరశక్తి, బుద్ధిశక్తి - రెండిటినీ వినియోగించమని మన వేదమతం చెప్తోంది.
ఆలోచన, మేధస్సు, ప్రణాళికాబద్ధమైన కార్యనిర్వహణ - ఇవన్నీ 'శ్రేయస్సు' అనే
లక్ష్యంతో సమర్థవంతంగా సాగాలి. మనం అసమర్థులమనే భావనే రాకూడదు.
సమర్థులుగా మనల్ని మనం మలచుకోవాలి.

ఈ విశ్వచక్రంలో ప్రత్యణువూ ప్రధానమే. ప్రతిదీ సమర్థవంతమే. కనుక
ఆత్మన్యూనతాభావం పనికిరాదు. సోమరితనం, బద్ధకం విడిచిపెట్టాలి. ఈ భావమే 'క్లిబే స్మర' - అనే చిన్న వాక్యాల్లో ఇమిడి ఉంది.

దైవాన్ని విశ్వసిస్తూనే, స్వశక్తిని వినియోగించడం అనేది భారతీయమతంలోని ప్రత్యేకత.

అయితే మన కార్యనిర్వహణకి ఎందరి సహాయమో అనివార్యంగా తీసుకుంటాం.
అంతేకాదు... మన అవసరాలకీ, జీవనగమనానికీ ఇతరుల చేయూత, సహకారం లేకుండా బ్రతకలేం. కానీ అలా మనకు సహాయపడ్డ వారిని మరువరాదు.
కృతజ్ఞతాభావంతో ఉండాలి. ఈ "కృతజ్ఞత” అనేదానికివేదమతంవిశేషప్రాధాన్యమిచ్చిందిచేసిన దానిని మరచిపోవడం 'కృతఘ్నత' అనే మహాపాపమనీ, దీనికి నిష్కృతే లేదని
వైదిక శాస్త్రాలు వివిధ ఉపాఖ్యానాల ద్వారా కూడా చెప్పాయి.

‘మనిషి’కి ఉండే వైయుక్తికమైన, సామాజికమైన బాధ్యతలు ఎన్నో... అవి సక్రమంగా నడవాలంటే ఈ మూడు వాక్యాలూ ప్రధానం.

మొదటిది - మంచి పనులు చేయడం, 

రెండవది - మనపై మనం విశ్వాసంతో
మన సామర్థ్యాన్ని వినియోగించుకోవడం,

 మూడవది - ఇతరులు చేసిన మేలుని
మరువకపోవడం. ఈ మూడింటికన్నా జీవిత సార్థక్యం ఇంకేముంటుంది!

‘కృతజ్ఞత’ అనేది సాటిమనిషి పట్లే కాదు. మన చుట్టూ ఉన్న ప్రకృతి కూడా మన
జీవితానికి అపారమైన ఆధారమవుతోంది, పోషిస్తోంది. ఆ ప్రకృతిని 'జడం'గా
భావించరాదు. ప్రతిదీ భగవత్ చైతన్యంతో దీపిస్తున్నదే. కాబట్టి ఆ ప్రకృతిని కూడా
క్షోభ పెట్టకూడదు. అలాగే మననీ, మన చుట్టూ విశ్వాన్నీ నడిపే దైవీశక్తులను
కూడా విస్మరించరాదు.

వీటిలో వేటి పట్ల కృతఘ్నత చూపినా మహాపాపమే, స్వసామర్థ్యానికి
ప్రాధాన్యమిచ్చారుగానీ స్వసుఖానికి కాదు. కృతఘ్నతతో సుఖపడితే ఆ సుఖం
దుష్పరిణామాలకే దారితీస్తుంది. కాబట్టి ఈ మంత్రంలో అంతిమ వాక్యంగా "కృతం
స్మర" - అని వాక్యం - 'సత్కర్మాచరణ'..

అంటే సత్కర్మాచరణకీ, కృతజ్ఞతకీ మధ్యనే 'తన సామర్థ్యం'. దీని అర్థం - మన
సామర్థ్యం ఈ రెండిటి కోసమే వినియోగింపబడాలి - అని.

☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️

10. శ్రద్ధయా సత్యమాప్యతే

శ్రద్ధ చేతనే సత్యం లభిస్తుంది(యజుర్వేదం)

'సత్యం' అనేది త్రికాలలోనూ నశించనిది. అదే పరతత్త్వం, ఆత్మతత్త్వం. దానిని
సాధించాలంటే 'శ్రద్ధ' ముఖ్యం. ఏ గొప్ప విషయాన్ని సాధించాలన్నా ఈ శ్రద్ధ
ప్రధానం.

'శ్రద్ధావాన్ లభతే జ్ఞానం' - అని భగవద్గీత (శ్రద్ధావంతునికే జ్ఞానం లభిస్తుంది).

'శ్రద్ధ' అంటే - చేసే పనియందు ఏకాగ్రత, సంపూర్ణ అవగాహన, ఆసక్తి, శక్తివంచన
లేకుండా ఆచరించుట... అని అర్థం.

శ్రద్ధా విశ్వాసాలు రెండూ భక్తిలో ప్రధానమని తులసీదాసు పేర్కొన్నాడు. వాటిని
భవానీశంకరులుగా భావించాడు. అంటే పార్వతీపరమేశ్వరులు ఎంత అవిభాజ్యులో,
అలా శ్రద్ధావిశ్వాసాలు వీడకుండా ప్రధానమై ఉండాలని భావం.

భవానీ శంకరౌ వందే
శ్రద్ధా విశ్వాస రూపిణీ|
యాభ్యాం వినా న పశ్యంతి
సిద్ధాః స్వాతంస్థమీశ్వరమ్||

"శ్రద్ధావిశ్వాస రూపిణులైన భవానీశంకరులకు నమస్సు. వారు లేనిదే సిద్ధులు
హృదయంలోనున్న దైవాన్ని దర్శించలేరు.”

న కర్మణా న తపసా న జపైర్న సమాధిభిః।
న జ్ఞానేన న చాన్యేన వశ్యోహం శ్రద్ధాయా వినా॥

అని 'శివపురాణం'లో శివుడు పార్వతికి చెప్పిన మాటలు. “నేను ఏ కర్మల చేత
గానీ, తపముల చేతగానీ, జపముల చేతగానీ, సమాధుల చేతగానీ, జ్ఞానం చేతగానీ వశ్యుడను కాను. నేను కేవలం శ్రద్ధకే వశ్యుడను.”

శ్రద్ధామయ్యస్తి చేత్పుంసాం
యేన కేనాపి హేతునా।
వశ్యః స్పృశ్యశ్చ దృశ్యశ్చ
పూజ్యస్సంభాష్య ఏవ చ||

“నాపై శ్రద్ధ నుంచిన వారికి వశ్యుడనవుతాను. అంతేకాక - శ్రద్ధావంతుడు నన్ను స్పృశించగలడు, చూడగలడు, పూజించగలడు, సంభాషించగలడు" అని 'సత్య స్వరూపుడైన పరమేశ్వరుని మాట.

సత్యానుభవం కావాలంటే శ్రద్ధ ప్రధానమని శాస్త్రాలన్నీ స్పష్టీకరిస్తున్నాయి.

సాధ్యా తస్మాన్మయి శ్రద్ధా
మాం వశీకర్తుమిచ్ఛతః
శ్రద్ధా హేతుస్స్వధర్మస్య
రక్షణం వర్ణినామిహ||

“కనుక నన్ను వశం చేసుకోవడానికి శ్రద్ధను అవలంబించాలి. శ్రద్ధకు స్వధర్మ
రక్షణమే కారణం.”

కాబట్టి స్వధర్మరక్షణం ప్రధానం.

ధర్మనిర్వహణ లేనిదే దైవం కూడా సాధ్యం కాదు.

ధర్మాన్ని విడిచి ఎన్ని జపతపాలు చేసినా దైవం అనుగ్రహించడు. సత్య సాక్షాత్కారం
జరగదు. 'ధర్మ నిర్వహణమే శ్రద్ధ' అని కూడా భావం.

No comments:

Post a Comment