Sunday, October 6, 2024

 _*శ్రీశైలంలో కూష్మాండా దుర్గా  అలంకరణ*_


కూష్మాండా దుర్గా , నవదుర్గల్లో నాలుగో అవతారం. నవరాత్రుల్లో నాలుగో రోజైన ఆశ్వీయుజ శుద్ధ చవితి నాడు ఈ అమ్మవారిని పూజిస్తారు. *"కు" అంటే చిన్న , "ఊష్మ" అంటే శక్తి , "అండా" అంటే విశ్వం. తన శక్తితో ఈ విశ్వాన్ని  సృష్టించింది అని అర్ధం.*

ఈ అమ్మవారిని పూజిస్తే ఆరోగ్యం , ఐశ్వర్యం , శక్తీ లభిస్తాయని భక్తుల విశ్వాసం.

*రూపం*

కుష్మాండా దుర్గా దేవి 8 చేతులతో ఉంటుంది. ఆ చేతులలో చక్రం ,  ఖడ్గం , గద , పాశం , ధనువు , బాణాలు , ఒక తేనె భాండం , ఒక రక్త భాండం ఉంటాయి. ఈ అమ్మవారి వాహనం పులి - సింహం.

*విశ్వ ఆవిర్భావం*

ఈ విశ్వం లేనప్పుడు , అంతా చీకటే అలుముకున్నప్పుడు ఈ విశ్వాన్ని సృష్టించి , తన చిరునవ్వుతో వెలుగును ప్రసాదించింది అమ్మవారు. సూర్యునికి వెలుగును ఇచ్చింది కుష్మాండా దుర్గాదేవి అని పురాణోక్తి. సూర్యుని మధ్యభాగంలో ఈ అమ్మవారు నివసిస్తుందని చెప్తుంది దేవీ పురాణం.

*త్రిమూర్తులు , త్రిమాతల సృష్టి*

*మహాకాళీ*

కుష్మాండా దుర్గాదేవి ఎడమ కంటి కాంతి నుంచి నల్లటి రూపంతో ఒక అమ్మవారు జనించింది. ఈమె చాలా ఉగ్ర స్వరూపమైనది. ఈ అమ్మవారికి పది తలలు , పది చేతులు , పది కాళ్ళు , 30 కళ్ళు , 30 చేతి వేళ్ళు , 30 కాలి వేళ్ళు ఉన్నాయి. చిందరవందరగా ఉండే జుట్టుతో , నాలుకలు బయట పెట్టి ఉంటుంది. ఆమె తెల్లటి పళ్ళు , తన 10 నాలుకలను కొరుకుతున్నట్టుగా ఉంటాయి. మండుతున్న చితిపై కూర్చుని ఉంటుంది ఈ అమ్మవారు. ఆయుధం , త్రిశూలం , చక్రం , బాణం , డాలు , తెంచిన రాక్షసుని తల , పుర్రె , నత్త గుల్ల , ధనువు , కర్ర ధరించి ఉంటుంది కాళీ. కూష్మాండా దేవి ఈమెకు మహాకాళీ అని పేరు పెట్టింది.

*మహాలక్ష్మి*

కుష్మాండా దుర్గాదేవి మూడో కంటి నుంచి ఒక ఉగ్రమైన స్త్రీ ఉద్భవించింది. బంగారు వర్ణంలో ఉన్న ఈ అమ్మవారు 18 చేతులతో ఉంది. ఈమె కాషాయ రంగు వస్త్రాలు , కవచం , కిరీటం ధరించింది. ఆ చేతుల్లో గొడ్డలి , త్రిశూలం , చక్రం , గద , పిడుగు , బాణం , ఖడ్గం , కమలం , జపమాల , నత్తగుల్ల , ఘంట , ఉచ్చు , బల్లెం , కొరడా , ధనువు , డాలు , మధుకలశం , నీటిపాత్రలు పట్టుకుని ఉంది. కమలంపై కూర్చున్న ఈ అమ్మవారు మధువును తాగి , గట్టిగా గర్జించిందిట. అలా ఉన్న ఆ అమ్మవారికి కూష్మాండా దేవి మహాలక్ష్మి అని నామకరణం చేసింది.

*మహాసరస్వతి*

కుష్మాండాదేవి కుడి కంటి కాంతి నుంచి శాంతమూర్తి అయి , తెల్లని శరీర ఛాయ కలిగిన ఒక స్త్రీ జనించింది. తెల్లటి బట్టలు కట్టుకుని , తలపై చంద్రవంకతో ఉన్న ఆమెకు 8 చేతులు ఉన్నాయి. వాటిలో త్రిశూలం , చక్రం , చిన్న ఢమరుకం , నత్తగుల్ల , ఘంట , విల్లు , నాగలి ఉన్నాయి. ఆమె ముఖం చంద్రబింబంలా వెలిగిపోతోంది. ముత్యాల నగలు అలంకరించుకున్న ఆమె రత్నాలతో చేసిన సింహాసనంపై కూర్చుని ఉంది. కుష్మాండాదేవి ఆమెను మహా సరస్వతి అని పిలిచింది.

*శక్తి*

కుష్మాండాదేవి దృష్టి మహాకాళిపై పడగానే , ఆమె నుండి ఒక స్త్రీ , పురుషుడు పుట్టారు. పురుషునికి 5 ముఖాలు , 15 కళ్ళు , 10 చేతులు ఉన్నాయి. అతని చర్మం పులి చర్మంలా ఉంది.  అతని మెడ చుట్టూ ఒక పాము ఉంది. తలపై చంద్రవంకను ధరించి ఉన్నాడు. అతని చేతుల్లో గొడ్డలి , జింక , బాణం , ధనువు , త్రిశూలం , పిడుగు , కపాలం , ఢమరుకం , జపమాల , కమండలం ఉన్నాయి. కూష్మాండా దుర్గా అతనికి శివుడు అని పేరు పెట్టింది. మహాకాళీ శరీరం నుంచి పుట్టిన స్త్రీ తెల్లగా ఉండి , నాలుగు చేతుల్లో పాశం , జపమాల పుస్తకం , కమలం ఉన్నాయి. ఆమెకు శక్తి అని పేరు పెట్టింది కుష్మాండా దేవి. ఇలా కలసి పుట్టిన  శివుడు ,  శక్తి(సరస్వతీదేవి)లు అన్నాచెల్లెళ్ళు అని అంటారు.

*బ్రహ్మ , లక్ష్మీ*

కుష్మాండా దేవి మహాలక్ష్మిని చూడగానే ఆమె శరీరం నుండి ఒక స్త్రీ , ఒక పురుషుడు వచ్చారు. నాలుగు ముఖాలతో , నాలుగు చేతులతో ఎరుపు రంగు శరీరంతో కాషాయ వస్త్రాలతో ఉన్నాడు. ఖరీదైన నగలు ధరించిన అతను తామరపువ్వు , పుస్తకం , జపమాల , కలశం పట్టుకుని ఉన్నాడు. అతనికి బ్రహ్మ అని పేరు పెట్టింది కుష్మాండా దేవి. స్త్రీకి నాలుగు చేతులు ఉన్నాయి. అందంగా , లేత ఎరుపు వర్ణంలో ఉన్న ఆమె పై రెండు చేతుల్లో తామరమొగ్గలు , కింద రెండు చేతులూ అభయ ముద్రలోనూ ఉన్నాయి. లెక్కలేనన్ని ఆభరణాలు ధరించి ఉంది అమె. కుష్మాండా దేవి ఆమెకు లక్ష్మి అని పేరు పెట్టి పిలిచింది. ఇలా కలసి పుట్టిన బ్రహ్మ, లక్ష్మీదేవిలు కూడా అన్నాచెల్లెళ్ళే.

*ధ్యాన శ్లోకం*

*"సురాసంపూర్ణ కలశం రుధిరప్లుత మేవ చ దధాన హస్త పద్మాభ్యాం కూష్మాండా శుభమస్తు మే"*

No comments:

Post a Comment