*_మనిషి తాను జీవించినంతకాలం సంతోషంగా ఉండాలనుకొంటాడు._*
*_సంతోషం కోసమే అన్నం తింటాడు, సంతోషం కోసమే ఆటలాడుకుంటాడు, నిద్రపోతాడు, సంతోషం కోసమే పెళ్ళి చేసుకొంటాడు, పిల్లలు కావాలను కొంటాడు, చేసే పని, కూసే కూత, రాసే రాత... అంతా సంతోషం కోసమే.!_*
*_ఇంతకూ సంతోషం ఎక్కడ దొరుకుతుంది.?_*
*_అనేది విలువైన ప్రశ్న. సంతోషం చిరునామా కోసం మనిషి వెదకని చోటులేదు. చేయని ప్రయత్నం లేదు. అయినా సంతోషం గగన కుసుమంగా ఎందుకు ఉన్నదో మనిషికి అర్థం కావడం లేదు..._*
*_ప్రపంచాన్ని నడిపేది డబ్బు. డబ్బు లేకుండా ఏ మనిషీ జీవించలేడు. అది ఎంత ఎక్కువగా నిల్వ ఉంటే అంత సౌఖ్యంగా జీవించగలననుకుంటాడు మనిషి..._*
*_కానీ,_*
*_డబ్బు సంతోషాన్ని ప్రసాదిస్తుందా అంటే అనుమానమే._*
*_లోకంలో పుష్కలంగా ధనరాశులు పోగుచేసిన సంపన్నులెందరో ఉన్నారు. కానీ వారందరికీ సౌఖ్యం దొరకవచ్చునేమోగానీ సంతోషం దొరక్కపోవచ్చు. కనుక సంతోషానికి డబ్బు కారణం కాదు..._*
*_అధికారం ఉంటే సంతోషం ఉంటుందా.?_*
*_అంటే, అదీ నమ్మకం లేదు. లోకంలో ఏకచ్ఛత్రాధిపత్యంతో అధికారాన్ని సొంతం చేసుకొని పాలించిన వారెందరో ఉన్నారు. వాళ్లు ఎల్లవేళలా సంతోషంగా ఉన్నారనే దాఖలాలు లేవు..._*
*_అందంగా ఉంటే సంతోషం ఉంటుందా.?_*
*_దానికీ రుజువు లేదు. ఎందరో అందగాళ్లు, సౌందర్యవంతులు మానసిక క్షోభలతో ఆత్మహత్యలు చేసుకొన్న చరిత్రలున్నాయి..._*
*_సకల విద్యలనూ ఆపోశన పడితే సంతోషం కలుగుతుందా.?_*
*_అంటే అదీ సత్యం కాదు. ఎందరో విజ్ఞాన ఖనులైన మహానుభావులు అశాంతితో తనువులు చాలించారు..._*
*_కనుక సంతోషానికి మూలం సంపదలు, అధికారం, చదువు, అందం కావని అనుభవపూర్వకంగా మనిషికి అర్థమైంది._*
*_సంతోషానికి ధనికులు, పేదలు అనే భేదం లేదు. అందం, చదువు అనే బేరీజులు లేవు. వయోభేదం లేదు. ఎప్పుడైనా, ఎక్కడైనా మనిషికి స్వాధీనమై ఉండేది సంతోషం..._*
*_పసిపిల్లలకు బొమ్మలతో ఆడుకోవడంలోనే సంతోషం. ఎదిగే పిల్లలకు ఆటపాటలతో గడపడం సంతోషం._*
*_యువకులకు తమ కలలను సాకారం చేసుకోవడమే సంతోషం. వృద్ధులకు తమ సంతానాన్ని చక్కగా చూసుకొంటూ ఉండటమే సంతోషం._*
*_కొందరికి ప్రకృతి ఆరాధన సంతోషం. కొందరికి తీర్థక్షేత్రాలను సందర్శించడం సంతోషం. కొందరికి సంగీతం వినడం సంతోషం. కొందరికి సృజన చేయడమే పరమానందం._*
*_ఇలా సంతోషానికి ఒక నిర్వచనం లేదు. ఒక ఉనికి లేదు..._*
*_ప్రపంచంలోని అణువణువులోనూ సంతోషం నిండి ఉంది. దాన్ని చూడగలగడమే మనిషి పని..._*
*_పరిమిత సంపాదనతో అన్నవస్త్రాదులను సమకూర్చుకొని సంతోష జీవనం గడుపుతున్నవాళ్లెందరో ఉన్నారు... వాళ్లకు పూరి గుడిసెలైనా, పక్కా భవనాలైనా ఒక్కటే._*
*_రాజప్రసాదాలవంటి విలాస భవనాల్లో హంస తూలికాతల్పాలపైన పడుకున్నా కొందరు ముళ్లపాన్పు మీద పడుకొన్నట్లే నిద్ర కరవై, దుఃఖ జీవితాన్ని కొనసాగిస్తుంటారు..._*
*_ఉన్నంతలో గడుపుకొంటూ, తోటివారికి సహాయపడుతూ, దీనులపట్ల కారుణ్యాన్ని ప్రదర్శించేవారికి ఏ సంపదలతోనూ పని లేదు._*
*_సంపదలు ఎన్ని ఉన్నా ఎవరికీ ఏ విధంగా తోడ్పడని జీవితాలు ఉన్నాయి..._*
*_మనిషి తన జీవితంలో అనుక్షణం సంతోషాన్ని ఆహ్వానించాలి. అసంతృప్తిని తరిమివేయాలి. కష్టాలకు, కడగండ్లకు, బాధలకు కుంగిపోరాదు. ఉన్నంతలో ఆనందాన్ని తోడుకోవాలి._*
*_ఆత్మీయులతో మనోభావాలను పంచుకొని సేదదీరాలి. అనవసరమైన భయాలను దరిజేరనీయరాదు. అనవసర విషయాల్లో తలదూర్చరాదు. కోరి కోరి కష్టాలు తెచ్చుకోరాదు._*
*_నీతిమంతమైన జీవితానికి దారులు వేసుకోవాలి. అనుచిత సంపాదనకోసం అర్రులు చాచకూడదు._*
*_తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు, బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు అందించే స్ఫూర్తితో జీవితాన్ని అమృతమయం చేసుకోవాలి. మానసికోన్నతికి దారులను అన్వేషించాలి..._*
*_అంతర్యామితో అనుసంధానం కావాలి. అదే చిట్టచివరి సంతోషానికి చిరునామా..._*
*_ఆనందం, సంతోషం ఈ చిన్ని జీవితానికి ఆయురారోగ్యాలు అందరమూ సుఖసంతోషాలతో జీవితాన్ని చక్కగా గడుపుదాం. ఇదే జీవిత పరమార్ధం.☝️_*
*_- సదా మీ శ్రేయోభిలాషి...👏_*
🌸🪷🌸 🪷🙇♂️🪷 🌸🪷🌸
No comments:
Post a Comment