Tuesday, October 8, 2024

 అమ్మవారు వచ్చేస్తున్నారు..!

1955లో ఓ రిక్షా కార్మికుడు రాత్రి సెకండ్ షో సినిమా వదిలాక దొరికే బేరాలు చూసుకుని రిక్షా తొక్కుకుంటూ తిరిగి ఇంటికి వెళుతోంటే అతడిని ఓ ముత్తైదువ ఆపింది. "బాబూ, నన్ను ఇంద్రకీలాద్రి కొండ వద్దకు తీసుకు వెళతావా?" అని చిరునవ్వుతో అడిగింది. అప్పటికే అలసిపోయి ఉన్న అతను ఆవిడ ముఖంలో కళ, తేజస్సు చూసి కాదనలేక "ఎక్కండమ్మా" అన్నాడు. కొంత సేపటి తరువాత ఆవిడ "ఈ అర్థరాత్రి పూట కూడా కష్టబడుతున్నావ్, నీకు భయం వేయదా?" అని అతడిని అడిగింది. దానికతను చిన్నగా నవ్వి "భయం ఎందుకు అమ్మగారు? మా బెజవాడ కనక దుర్గమ్మ తల్లి మమ్మల్ని ఎల్లప్పుడూ సల్లగా సూత్తుంటది" అని జవాబిచ్చాడు. ఇంతలో ఇంద్రకీలాద్రి వచ్చేసింది. ఆవిడ రిక్షా దిగి ఏం మాట్లాడకుండా కొండ వైపుకు నడవ సాగింది. ఆశ్చర్యపోయిన రిక్షా అతను "అమ్మ గారూ డబ్బులు" అని చిన్నగా అన్నాడు. ఆవిడ ఒక్కక్షణం ఆగి మళ్లీ నడక కొనసాగించి ఆ చీకట్లో మాయమైపోయింది. అతనికేం అర్థం కాక బుర్ర గోక్కున్నాడు. 

"వచ్చినప్పటి నుంచి ద్వారబంధం మీద కూసుని ఏటి ఆలోసిస్తన్నావ్" అని రిక్షా అతని భార్య రెట్టించి అడగ్గానే జరిగింది చెప్పాడు. అంతా విన్నాక ఆమె నిట్టూర్చి "ముందు నువు తిను. నాకు నిద్రొత్తోంది" అని అన్నం వడ్డించింది. అతను మెల్లగా లేచి తలకు చుట్టుకున్న (తలపాగా) గుడ్డను తీసి దులిపాడు. అంతే!! అందులోంచి భారీగా డబ్బుతో పాటూ విలువైన బంగారు గాజు కింద పడ్డాయి. వాటిని చూసిన ఆ పేద దంపతులు తమ కళ్ళను తామే నమ్మలేకపోయారు. సంతోషంతో అతను పెట్టిన కేకకు చుట్టు పక్కల ఉన్న జనాలు మేల్కొన్నారు. జరిగింది విన్న స్థానికులు "ఎంత అదృష్టంరా నీది! సాక్షాత్తూ ఆ అమ్మవారినే ఊరేగించావ్.. కానుకలు పుచ్చుకునే అమ్మ, నీకు కానుకలు కూడా ఇచ్చింది" అని అతన్ని, ఆ రిక్షాని తాకి ఆనందపడ్డారు.

ఈ అద్భుత సంఘటన గురించి 1955లో ఆంధ్ర కేసరి పత్రిక ప్రచురించింది.

No comments:

Post a Comment