🕉️ ఓం నమః శివాయ 🕉️
నమ్మకం పోయింది.........!!
శిష్యుడు-- గురువుగారూ, నేనింక ఈ మంత్రం జపం చేయను.
గురువు-- ఏమైంది నాయనా?
శిష్యుడు-- రోజూ క్రమం తప్పకుండా చేస్తున్నాను. ఇంతవరకూ ఏం ఫలితం దొరకలేదు.
గురువు-- ప్రారంభించి ఎంత కాలమైంది?
శిష్యుడు-- నెల రోజులైంది.
భగవన్నామం ఒక్కసారి చేస్తే చాలు పాపాలన్నీ పోతాయన్నారు..
మరి నాకు రవంత ప్రశాంతతైనా దొరకదేంటి? మంత్రంలో బలం ఉంటే పని చేయాలి కదా!
కనీసం కాస్తైనా నా లోపలి బరువు తగ్గాలి కదా!
గురువు-- ఓర్పు పట్టాలి నాయనా.
తప్పక కలుగుతుంది.
ఇట్టివి నెమ్మదిగా పని చేస్తాయి,
కానీ తప్పక పని చేస్తాయి.
నీకిచ్చినది మహామంత్రం.
శిష్యుడు-- లేదండి. రోజూ శుచిగా ముప్పూటలా స్నానాలు చేస్తాను.
సమస్త నియమాలు పాటిస్తూ, ఏకభుక్తం చేస్తూ, మౌనవ్రతం కూడా అవలంబిస్తూన్నాను.
పగలు పడుకోను.
చాప మీద పడుకుంటాను.
ఎక్కువ మాట్లాడను.
అరిషడ్వర్గాలకు లోనవ్వటం లేదు.
ఇంద్రియాల తృప్తికోసం జీవించటం మానేశాను.
గురువు-- నాకు తెలుసు నాయనా.
నీలో చాలా మార్పు ఉంది.
ఇతరత్రా భూమిక సిద్ధమవుతున్న సూచన స్పష్టంగానే కనిపిస్తున్నది.
ఫలితం గురించి ఇప్పుడే చూడకు.
నీకు కనిపించని స్థితిలో అది పని చేస్తున్నది.
శిష్యుడు--లేదండి.నాకు పూర్తిగా నమ్మకం పోయింది.
నేను వదిలేస్తాను.
వదలాలంటే ఏంచేయాలో చెప్పండి.
గోవు చెవులో ఊదటమో ఏదో పద్ధతులుంటాయి కదా!
గురువు-- సరే- తప్పక చెప్తానవి.
కానీ ముందు నువ్వొక పని చేయి.
ఈ మామిడి టెంక మన ఆశ్రమం పెరట్లో నాటి రా. వచ్చి రేపు కనిపించు.
శిష్యుడు-- అట్లాగేనండి.
(నాటి వెళిపోతాడు. మరునాడు వస్తాడు.)
శిష్యుడు-- మంత్రం విడిచే మార్గం చెప్పండి.
గురువు--నువ్వు నిన్న నాటిన టెంక నాటుకుందా, చూశావా?
శిష్యుడు-- లేదండి, నిన్ననే కదా పెట్టింది.
గురువు-- సరిగ్గా పెట్టావా, లోతుగా తవ్వావా,
మట్టి పూర్తిగా కప్పావా?
శిష్యుడు-- “ఆఁ.. అన్నీ సరిగ్గానే చేశానండి. సూర్యరశ్మి తగిలే చోటే పెట్టాను.
వేరే చెట్టు ఛాయలో కాక విడిచోటే పెట్టాను.
తగినంత నీరూ పోశాను.
ఇవాళ లోపలకు వస్తూ కూడా నీళ్ళు పోశాను.
గురువు-- అయినా పండు రాలేదా?
శిష్యుడు-- అదేంటండి, టెంక నాటుకోవాలంటే సమయం పడుతుంది కదా.
అది మొక్కై, చెట్టై, పూసి కాస్తే కదా పండొచ్చేది?
గురువు-- నిజమే. కానీ టెంకలో బలం లేదేమో..! లేకపోతే ఈ పాటికి కనీసం చిన్న పిలకైనా బయటకు కనిపించాలి కదా.
శిష్యుడు-- లేదండి.అది మట్టిలో మొదలు ఇమడాలి. దానిలో ఉన్న నాటుకునే శక్తి చైతన్యవంతం కావాలి. చాలా సమయం పడుతుంది.
గురువు--అవన్నీ నిజమే.కానీ ఇన్ని గంటలైంది కదయ్యా.
నాకు నమ్మకం పోయింది.
అదింక నాటుకోదేమో.
(శిష్యుడు ఏదో అర్థమైనట్టు తలవంచుకుంటాడు.)
గురువు-- దాన్ని తవ్వి తీసి పెరికి అవతలపారేసేయి.. నేనింక ప్రతీక్షించలేను. పో.
శిష్యుడు-- నాకు మీ సమాధానం అర్థమైందండి. ఇంకెప్పుడూ మంత్రం చేయనని వదిలేస్తానని అనను. క్షమించండి..
🙏 హర హర మహాదేవ శంభో శంకర 🙏
No comments:
Post a Comment