*స్మృతి.....*
వేదాలను శృతులన్నప్పుడు సంహితనే కాక బ్రాహ్మణాలు, ఆరణ్యకాలు కూడా సూచింపబడుతాయి. భగవద్గీత శృతికాదు - వేదాలలో భాగం కాదు. దానిని స్మృతి అంటారు. జ్ఞానానికీ, మోక్షానికీ దారి చూపక పోతే కర్మలూ, ఆరాధనలూ నిరర్థక మంటుంది గీత. శృతుల తర్వాత ప్రధానమైనవి పురాణాలు. ఇవి కూడా కొన్ని చోట్ల వైదిక కర్మలను యాగాలను చేయటమే పరమోత్కృష్టమని నమ్మినట్లు, వారి అహంకారాన్ని శివుడు ధ్వంసం చేసినట్టు శైవపురాణ గాధలు చెప్తాయి. శ్రీ మద్భాగవతంలో కూడ బ్రాహ్మణ పండితులకూ, వారి భార్యలకూ సంబంధించినకథ ఒకటి ఉంది.
అంతగా చదువుకోక పోయినా ఆ బ్రాహ్మణ స్త్రీలు శ్రీ మహావిష్ణువే తమ ఎదుట బాలకృష్ణునిగా ప్రత్యక్షమైనాడని నమ్ముతారు. కర్మానుష్ఠానంలో నిమగ్నమైపోయిన వారి భర్తలకు మాత్రం ఆ అవగాహన కల్గ లేదు. ఆ అవగాహన కల్గలేదే అన్న విచారం మిగిలి పోయింది.
శృతులలో కర్మకాండా, జ్ఞానకాండా ఉన్నాయని అనవచ్చు. జ్ఞానమార్గాన్ని ఉపదేశించే ఉపనిషత్తులు జ్ఞానకాండ లోని భాగాలే కదా! ఉపనిషత్తులు కర్మకి అంతప్రాముఖ్యాన్ని యివ్వవు. కాని, కర్మకాండకూడ కర్మాచరణమే పరమావధిగా భావించనక్కరలేదని చెప్తుంది. త్రైత్తిరీయ కాఠక ప్రశ్నలో ఇట్లా ఉంది: ''యజ్ఞాలను చేస్తూ భగవత్సాన్నిధ్యాన్ని అనుభవించని వ్యక్తి ఊరికే మంటని రగిల్చి పొగను లేపుతున్నట్టే. వాడొట్టి మూఢుడు. అతనికి ఆత్మానుభూతి ఎప్పటికీ కాదు''. (త్రైత్తిరీయ కాఠకం - 1వ ప్రశ్న, ఆఖరి అనువాకం - 4వ మంత్రం) నిప్పుని రాజేస్తే ఆ మంటపై అన్నం వండటానికి పాత్రని ఆ నిప్పుపై పెట్టాలి.
కేవలం యజ్ఞాలనే చేసేవాడు నిప్పునే రాజేస్తాడు గాని, పాత్రని దానిపై పెట్టడు (ఇక్కడ సంస్కృతంలో వాడబడిన పదం - పక్వం - అంటే బాగా వండటం. గట్టి బియ్యపు గింజ ఉడికి మెత్తని అన్నపు మెతుకుగా మారటమనమాట).
వైదిక కర్మలని ఈశ్వరార్పణం చేస్తే భవబంధవిమోచన మవుతుంది, ప్రాపంచిక బంధాన్ని వృద్ధి చేయదు. నిష్కామ్యంగా (అంటే ఫలితాల గురించి పట్టించు కోకుండా) కర్మలనాచరిస్తే చిత్తశుద్ధి కలిగి, త్రిగుణాతీతమైన స్థితికి కొనిపోతుంది.
యజ్ఞమంటే ఇదే. ఆంగ్లంలో 'సాక్రిఫైస్' (త్యాగం) అంటారు. యాగమంటే త్యాగం, విడిచిపెట్టటం. అగ్నికి ఉపహారం సమర్పించేప్పుడు ''నమమ'' (నాకు కాదు) అంటారు - యజ్ఞంలో స్వార్థరాహిత్యమెంత ముఖ్యమో తెలుస్తుంది దీని బట్టి. నిప్పులో పడవేసిన దానిని తిరిగి పొందటమసాధ్యం కదా. ఒక్క క్షణంలో దాని రూపమే మారిపోతుంది. ఆ విధంగానే ''నేను'' ''నాది'' అన్న భావం భస్మం కావాలి. యజ్ఞాల ఉద్దేశం అలాంటి ఉత్కృష్టమైన లక్ష్యము. దానిని విడిచి - తాత్కాలికమూ అల్పమూనైన ఫలితాల కోసం చేయటం శోచనీయం.
కర్మకాండకీ, జ్ఞానకాండకీ భేదం లేదని విశదమవుతుంది. కర్మకాండ తన పరిమితుల నెరిగి జ్ఞానకాండ యొక్క ఉత్కృష్టతను కొని యాడుతుంది. అవి ఒండొంటికి పూరకాలు. మహోన్నతమైన సత్యాలు, జ్ఞానప్రదాతలూ ఆయిన ''పురుషసూక్తం'' ''త్ర్యంబక మంత్రం'' సంహితలోనివే కాని ఉపనిషత్తలులలోనివి కావు. ఆ విధంగానే, ఉపనిషత్తులు కూడ ''నాచికేతాగ్ని'' వంటి కర్మలను వివరిస్తాయి. వైదికర్మలను చేసేప్పుడు పఠించే మంత్రాలు ఎన్నో తైత్తిరీయ ఉపనిషత్తులో ఉన్నాయి.
భగవద్గీత ఒక స్మృతి - అందులో జ్ఞానలబ్ధికి కర్మఫలాన్ని ఈశ్వరార్పితం చేయాలని ఉంది. ఇది శృతిలో భాగమైన ఉపనిషత్తులలో ఉంది. ఉపనిషత్తులలో ప్రధానమైన ''ఈశావాస్య'' ఉపనిషత్తులో ఆదిలోనే ఈ వాక్యముంది..
''కుర్వన్నేహ కర్మాణి జిజీవిషేచ్ఛతగ్‌ం సమాః |
ఏవంత్వయి నాన్యథేతో`òస్తి
నకర్మవిల్యితేనరీ ||
''వైదిక కర్మలని వందసంవత్సరాలైనా ఆచరించు, కాని అవన్నీ ఈశ్వరుని కొరకేనని, స్వలాభం కొరకు కాదని భావిస్తూ ఆచరించు. అప్పుడు కర్మఫలాలు నిన్ను బంధించవు''. అంటుంది ఉపనిషత్తు. కాబట్టి ఉపనిషత్తులు కార్యాచరణకి ప్రతికూలమనీ, కర్మ విరుద్ధమనీ భావించటం తప్పు.
కర్మనే లక్ష్యంగా భావించకూడదు. దేవతల నారాధించటం వల్ల పరిశుద్ధమైన చిత్తమూ, లోకకల్యాణమూ లభిస్తాయి. కాని అంతటితో ఆగిపోకూడదు. జ్ఞానోదయం కావాలి. అప్పుడు పరమాత్మను విడిచి జగత్తంటూ ఏదీ లేదనీ తెలియాలి. ఆ దశలో ఆత్మ సాక్షాత్కారం పొందిన జీవికి వేదాలు కూడా అప్రధానములే అవుతాయి. వేదమంటే ఏమిటి? భగవంతుని శాసనం. దేశంలోని పౌరులు ప్రభుత్వ శాసనాన్ని ఎట్లా పాటిస్తారో అదే విధంగా ఆ శాసనాన్ని కూడా పాటించాలి. కాని జ్ఞానియై 'పరమసత్యం'లో నిమగ్నమైన వానికీ కర్మానుష్ఠానమనవసరం.
పరమాత్మునితో తాదాత్మ్యం చెందిన జ్ఞానికి, పరమాత్మనుండే జన్మించిన దేవతలు వేరువేరుగా తోచరు. పరతత్త్వంలో లీనమైనప్పుడు దేవతలలో కూడ లీనమైనట్టే. దేవతారాధన చేసే దశలో తాను ఆరాధ్య దైవతము కంటె భిన్నమనే భావముతో ఉన్నప్పటికినీ, ఆరాధ్యదైవతము పరమాత్మకు అభిన్నమనే భావనలో యుండాలి.
నిత్యవ్యవహారంలో భేదభావంతో ఎన్నో పనులు చేస్తూంటాం, అప్పుడు కూడా ఈ భేదాలన్నీ పోతాయనీ అన్నీ ప్రాథమిక సత్యంలో లీనమై పోతాయనీ భావించుకోవాలి. దేవతలు తన కంటే భిన్నమన్న భావంతోనే ఆరాధించేవాడు, సత్యాన్ని గ్రహించడు.
|| ఓం నమః శివాయ ||
No comments:
Post a Comment