Sunday, October 27, 2024

****ఆప్తవాక్యాలు

 ☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️


1. ఆ నో భద్రాః క్రతవో యాంతు విశ్వతః॥

అన్ని వైపుల నుండి మంచి ఆలోచనలు మాకు వచ్చుగాక(ఋగ్వేదం)

వేదవాక్యములే మనకు ఆప్తవాక్యాలు. ఇవే మనకు ప్రమాణాలు. స్ఫూర్తికలిగించడానికి, జీవన గమనాన్ని నిర్దేశించడానికి ఇవే కరదీపికలు. మన
శ్రేయోభిలాషులైన ఋషులు దర్శించి చెప్పినవి కనుక వీటిని 'ఆప్తవాక్యాలు' అన్నారు.
ఒకొక్క వాక్యం చాలు - చింతన చేస్తే ఎన్నో అర్థాలతో వెలిగిపోతూమార్గదర్శకమవుతాయి.

అనంతవిశ్వంలో ఎటువైపు నుండి ఏ మంచి ఆలోచన వచ్చినా స్వీకరించాలని
చెప్తోందీ మాట. ఇంత విశాలమైన దృక్పథం వేదానిది.

జ్ఞానసముపార్జనే ఈ దేశానికి పరమార్థం. అందుకే 'అన్నివిధాల' అనేది మన లక్షణం కావాలి. ఏ ఆలోచనలైనా, ప్రపంచ పరిశీలనతో మనకు స్ఫూర్తినిస్తాయి.

మనకు బాహ్యంగానే కాక, అంతరంగంలో కూడా ఉత్తమత్వాన్ని వదలకూడదు.

ఆలోచన అంతరంగం విషయం. 'తప-ఆలోచనే' అన్నారు. ఆలోచనే తపస్సు.

తపించే ఆలోచన వల్ల ఆవిష్కరింపబడ్డ విషయం - శ్రేయస్కర ఆలోచనలే మన బుద్ధిలో చేరాలి. పతనం చేసే ఆలోచనకు తావీయకూడదు.

వేదం కోరిన శుభాకాంక్ష ఇది. మన బుద్ధి మంచి ఆలోచనకి స్పందించాలి. అది విశ్వంలో ఏ మూలనుండైనా రావచ్చు. కాబట్టి అన్ని ద్వారాలూ తెరిచిన హృదయంతో భద్రమైన భావాలు స్వీకరిద్దాం.

2. మిత్రస్య చక్షుషా సమీక్షామహే

మనమంతా మిత్రదృష్టితో చూసుకుందాం(యజుర్వేదం)

మంచిని కోరుకోవడం కోసం వేదం అనేక గొప్ప వాక్యాల నందిస్తోంది సత్సంకల్పం,
సదుద్దేశం - ఇవి ఉంటే సత్కర్మ, సత్ఫలం సహజంగా సిద్ధిస్తాయి. ప్రపంచమంతా ఒకరినొకరు స్నేహపూర్వకమైన చూపుతో చూసుకోవాలని పై వాక్యం చెప్తోంది.

'స్నేహం' అనగానే శ్రేయోభిలాషతో పాటు, అవతలివారి మేలుకోరడం, ఆనందాలలో
కలసి జీవించడం, ఆపత్సమయంలో ఆదుకోవడం.. అనే గుణాలు స్ఫురిస్తాయి. ఆమిత్రతా గుణాలతో జగమంతా ఉండాలనే విశ్వజనీనమైన ఆకాంక్ష.
-
ఇలాంటి అనేకానేక వాక్యాల ద్వారా
వేదం విశ్వానిదంతటిదీ అనీ,
విశ్వశ్రేయోదృష్టితో అందించిన మహావిజ్ఞానమని సుస్పష్టమౌతోంది. 'సమీక్షామహే'
అంటే - 'సమగ్రంగా దర్శిద్దాం' అని భావం. పరిపూర్ణంగా మిత్రతా దృష్టితో చూడాలి.

అంతేకాక పై వాక్యానికి మరో అర్థం కూడా చెప్పవచ్చు.

'మిత్రుడు' అంటే సూర్యుడు. మన కంటికి ఆయనే అధిష్టాన దైవం. చూపుకి అనుగ్రహం లభించాలని కూడా దీని భావం. సూర్యుని చూపుతో మనం బాగా దర్శింతుము గాక...సూర్యుడు జగత్తుకంతటికీ మిత్రుడు. అలా మనం జగమంతా క్షేమంగా ఉండాలని కోరుకోవాలి. సర్వసముడు. నియమపాలకుడు. నిజమైన స్నేహితుడు. ఈ లక్షణాలు మన చూపులో ఉండాలి.

చూపు అనేది కంటికే కాక మనోభావానికి కూడా సంకేతం.మన 'దృష్టితో' - అంటే మనలోని భావన. అది కూడా మిత్రగుణంతో భాసించాలి.      

No comments:

Post a Comment