Thursday, October 10, 2024

 *హిందూమతం యొక్క మూల సిద్ధాంతాలు.....*

*అతి ప్రాచీనమైన మన హిందూమతం ఎన్నో మహోన్నతమైన అంశాలు కల్గివుంది. కాని చాలమందికి దాని ప్రధానగుణ గణాలను గురించి సరియైన అవగాహన లేకపోవటం దురదృష్టకరం.* చాలమంది అవగాహన ఏనుగును గురించిన గ్రుడ్డివారి అభిప్రాయం వంటిది. ఒకడు ఏనుగు చెవిని స్పృశించి అది యొక చదునైన వస్తువని సూచిస్తాడు. మరొకడు దాని తొండాన్ని తాకి అది యొక పెద్దతాడంటాడు. ఇంకొకడు ఆ జంతువు యొక్క కాళ్ళను తడిమి ఏనుగు ఒక పెద్ద స్తంభమని చెప్తాడు. హిందూమతం సరిగా తెలియనివారి స్థితి ఇలాగే ఉంటుంది. చాలకొద్దిమందికే హిందూమతం యొక్క మూలసిద్ధాంతాలు, వాటి నిజస్వరూపంలో సరియైన అవగాహన ఉంది.

ప్రధానంగా, హిందూమతంలో మూడు, నాల్గు విశేషమైన లక్షణాలున్నాయి.
ప్రధమంగా హిందూమతం ప్రకారం ఈశ్వరుణ్ణి రెండు పద్ధతుల్లో ఆరాధించగలం. మరొకమతం ఏదీ అలాంటి దానికి అవకాశమివ్వదు. ఇతరమతాల్లో సర్వాంతర్యామి ఒక్కడే సూచింపబడుతాడు. కాని హిందూ మతానుసారం అతడు సర్వాంతర్యామియే గాక విశేషరూపాల్లో కూడ దర్శనమిస్తాడు. మన దేవుడు నిర్గుణుడు, నిరాకారుడు; ఐనా మరొకవిధంగా సాకారుడు, సగుణుడు. ఆ విధంగా మన భగవానుని రెండు రకాలుగా ఆరాధించగలం. దేవుడు నిజానికి రాముడు, కృష్ణుని రూపాల్లో అవతరిస్తాడు; మామూలు మానవుల్లోనూ ఉంటాడు. ఆయన మహాపురుషులుగాను, దివ్యరూపులు లేక పరమాత్ములుగాను కూడ అవతరిస్తాడు. భగవానుడు మనకు శుభాలను కల్గచేయటానికి తన కరుణను మనమీద ప్రసరింపచేయటానికి అనేక రూపాల్లో భూలోకానికి వేంచేస్తాడు. మరే ఇతర మతం కూడ ఇలాంటి భావనకు తావివ్వదు. ఇతర మతాలు సర్వాంతర్యామి యగువాని నొకనిని గురించే మాట్లాడుతాయి. మనం నియమిత రూపాల్లో భగవంతుని ఆరాధించగలం అనే అంశం మన హిందూమతం యొక్క ప్రత్యేక లక్షణం. అలా మనకు విగ్రహారాధన లేక మూర్తి పూజ అనే విధానమున్నది. విగ్రహారాధన లేక మూర్తి పూజ దీని వెనుక ఒక ప్రత్యేక ప్రాముఖ్యాన్ని, ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని కల్గివుంది. మన మనస్సుల్లో భగవంతునికొక రూపకల్పన చేసికొని ఆరాధిస్తాం. అదేవిధంగా దేవాలయాల్లో విగ్రహ ప్రతిష్ఠ చేస్తాం. వాటిలో దైవసాన్నిధ్యాన్ని, దైవశక్తిని సృష్టించుకొని ఆరాధించి ఆ దేవతలయొక్క ఆశీస్సులను పొందుతాం.

గృహస్తులకు భగవంతుని సర్వాంతర్యామి రూపంలో ఆరాధించటం కష్టసాధ్యమైన విషయం. సర్వాంతర్యామిని ధ్యానించుట కొరకు కళ్ళుమూసుకోటం ఆరంభించగానే వారి చక్షువులు, శ్రోత్రేంద్రియాలు, మనస్సు పరిపరివిషయాలపై సంచరించటం ప్రారంభిస్తాయి. కాన మామూలు గృహస్తులు సాకార సగుణ రూపంలో ఒక ప్రత్యేక దేవతా మూర్తిగా భగవంతుని భావించాలి. ప్రపంచంలో ఎంతమంది మానవులున్నారో అన్ని రూపాలు ఈశ్వరునకున్నాయి. భగవంతుడు ఒక రూపాన్ని ఆకారాన్ని స్వీకరించి మనకు శుభాల్ని ఇచ్చుటకు మన వద్దకు దిగుతాడు. మనం ఆశిస్తున్న ఫలితాల దృష్ట్యా మనం ఆయన యొక్క ఏ రూపాన్ని ఇష్టపడతామో దాన్నే ఆరాధిస్తాం.

గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్లు :

''ఆర్తో జిజ్ఞాసురద్ధార్థీ జ్ఞానీ చభరతర్షభ''

ప్రపంచంలో నాల్గువిధాలైన భక్తులున్నారు. 

1) ఏదో విషయంలో వ్యధ చెందుతున్నవారు, రోగగ్రస్తులైనవారు, 
2) ధనాశాపరులు, 
3) కొన్ని పనులను నిర్వర్తింపచేయ దలచిన వారు 
4) ఆఖరిగా పరమాత్ముని గురించి ఎరుకకై తాపత్రయపడువారు. 

అందరు వారివారి కోర్కెలు సఫలీకృతం చేసికొనుటకై అనుకూలమైన రూపాన్ని ఎన్నుకొని ఆ రూపంలో భగవంతుని ఆరాధిస్తారు. ఉదాహరణకు విఘ్నాలు రాకుండుటకై వినాయకుని ప్రార్థిస్తాను. సంపదకొరకై అగ్నిని, ఆరోగ్యం కొరకు సూర్యుణ్ణి, జ్ఞానసిద్ధి కొరకు శివుని లేక దక్షిణామూర్తిని, మోక్షప్రాప్తి కొరకు విష్ణువును ఆరాధిస్తారు.
వినాయకుడు విఘ్నాల్ని నివృత్తి చేస్తాడు. విద్యార్థులు తమ పరీక్షలకాలంలో పరీక్షల్లో ఉత్తీర్ణులు కాగోరి ఆయన్ని ఆరాధించటం గమనిస్తాం. ఫలితాలు లభిస్తాయనే కోరిక ప్రేరణతో వారు వినాయకుని ఆరాధింప మొదలుపెడ్తారు. ఈ ప్రేరణ ఒక ప్రత్యేకమైన దేవత యందు భక్తిని పెంచుతుంది. అదే విధంగా సంపద మిక్కుటంగా కోరుకునే వారు సత్యనారాయణ స్వామిని లేక లక్ష్మీదేవిని ఆరాధించటానికి ఉద్యుక్తులౌతారు.

కాని యధార్థానికి వీనిలో ప్రతిరూపం పరమాత్మది మాత్రమే. వినాయకునకు విఘ్నాలు తొలగించేశక్తి వుందంటే అది ఆయనకు మాత్రమే వుందనిగాదు. ఆయన కూడ పరమాత్మయే. భక్తుల్ని ఆకర్షించటానికి విఘ్నాల్ని నిర్మూలించే ప్రత్యేక శక్తిని ఆయన ప్రదర్శిస్తాడు. అలాగే లక్ష్మీదేవి కూడ పరమాత్మ స్వరూపిణ. ఆ దేవి ధనాపేక్షగల భక్తుల్ని ఆకర్షించటానిక ధనలక్ష్మియై సంపదలను ప్రసాదించేశక్తిని ప్రదర్శిస్తుంది. కొన్ని పనులను పూర్తిచేసే ప్రభావాన్ని ప్రదర్శించటం ద్వారా ఈ విధమైన రూపాలు భక్తుల్ని ఆకట్టుకుంటాయి.

మన సమాజంలో భగవంతునిపట్ల భక్తి వుంది. కాని దురదృష్టమేమంటే మనమతం పట్ల ధర్మం విషయంలో అదేభక్తి కనిపించదు. ఈశ్వర భక్తితోబాటు మనం మన మతం యొక్క మూలసిద్ధాంతాలలోని విషయాన్ని తెలుసుకోవాలి. మన మతంలో అచంచల విశ్వాసాన్ని స్థిరపరచుకోవాలి. దీనికొరకు మన మతం యొక్క మూలమైన, ప్రధానమైన అంశాల్ని అవగాహన చేసుకోవటం అవసరం.

No comments:

Post a Comment