*ఆస్తి :*
( ఈ మంగళవారం స్పెషల్ స్టోరీ)
వాళ్లిద్దరూ మంచి స్నేహితులు..
పెద్దయ్యారు. పెళ్ళిళ్ళు అయ్యాయి వాళ్లకు. ఒకరు గోవింద్, ఇంకొకరు శ్రీనాథ్.
ఇద్దరి పుట్టిన ఊరు బాసర. అక్కడే చదువు, సంస్కారం నేర్చుకున్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ లో ఉద్యోగం ఇద్దరికీ. గోవింద్ స్కూల్ టీచర్.
శ్రీనాథ్ కి సెక్రటేరియట్ లో ఉద్యోగం. ‘ఏరా అంటే ఏరా’ అనే సాన్నిహిత్యం వాళ్ళది.
జీవితం మాత్రం శ్రీనాథ్ ని కొంచెం డబ్బున్న వాడిగా మార్చింది. గోవింద్ పిల్లలకు చదువు చెప్పుకుంటూ టీచర్ గా ఉండి పోయాడు. అద్దె ఇల్లు, సిటీ బస్ ప్రయాణం మామూలు విషయం గోవింద్ కి. కానీ ఎప్పుడూ తన స్థితి కి బాధ పడలేదు.
పెళ్లయిన తరువాత చాలా మార్పులు వచ్చాయి వాళ్ళ జీవితాల్లో.
గోవింద్ భార్య సరళ పేదింటి అమ్మాయి. గోవింద్ మేనమామ కూతురే. అందలం ఎక్కాలని ఆశ సరళ కు. కానీ తీరేదెలా ?
ఎప్పుడయినా సరళ హంగులు, ఆర్భాటాలు కావాలని అడిగితే నవ్వి ఊరుకునే వాడు గోవింద్. మన దేశం లో నూటికి 40 మందికి ప్రతి రోజూ తిండి లేదు. వాళ్ళతో పోలిస్తే మనం నయమే కదా అంటాడు.
ఆడవాళ్లు తమ పక్కన వాళ్ళతో పోల్చుకుని తమ జీవితాలలో లేనివి ఏమిటో ఇట్టే తెలుసుకుంటారు. వాళ్లకు ఉన్న గొప్ప విషయాలను మాత్రం అంతగా పట్టించు కోరు.. ఇక్కడ కూడా అదే జరిగింది.. సొంత ఇల్లు, సొంత కారు లేవని బాధ సరళకు.!
శ్రీనాథ్ భార్య లక్ష్మి.. మంచి కుటుంబం నుండి వచ్చింది. దాన ధర్మాలు చేయటం అలవాటు. దైవ భక్తి మెండుగా ఉంది. ఉన్న సంపదను చూసి మిడిసి పాటు లేదు లక్ష్మికి. లక్ష్మి, సరళ కూడా స్నేహితులయ్యారు.
ఇళ్లకు రాక పోకలు కూడా బాగానే ఉన్నాయి. లక్ష్మికి సరళ అమాయకత్వం బాగా నచ్చుతుంది. పిచ్చి పిల్ల.. సంపదలు ఉన్నా, సఖ్యం మరియు సౌఖ్యం ఉండాలి జీవితం లో ..అదే చెప్పింది చాలా సార్లు.. నువ్వెన్నయినా చెప్పు లక్ష్మీ... డబ్బులున్న దారే వేరు. చిన్న చిన్న అవసరాలు కూడా తీర్చుకోలేని జీవితాలు ఎందుకు ? ఎవరికి ఉపయోగ పడినట్లు..??
రోజులు, నెలలు, సంవత్సరాలు గడిచాయి.. నలుగురూ పెద్దవాళ్ళయ్యారు...
అది ఆగస్ట్ నెల.. ఆ నెలలో శ్రీనాథ్ రిటైర్ అవుతున్నాడు. మరుసటి నెల సెప్టెంబర్ లో గోవింద్ రిటైర్మెంట్ .
ఆగస్ట్ 31 వ తారీకు రానే వచ్చింది. శ్రీనాథ్, లక్ష్మి ఇంటికి వచ్చి మరీ పిలిచారు. రిటైర్మెంట్ ఫంక్షన్ కి రావాలని... పిలవక పోయినా గోవింద్ వెళ్ళేవాడే.. ఇప్పుడు సరళ కూడా వెంట వెళ్ళింది... శ్రీనాథ్ యూడీసీ గా రిటైర్ అయ్యాడు. ఫంక్షన్ బాగా జరిగింది. సెక్రటేరియట్ లో వాళ్ళ డిపార్ట్మెంట్ లో.. చాలా మంది శ్రీనాథ్ ని మెచ్చుకున్నారు.. మంచి వాడు.. పని లో చురుకుదనం చూపించే వాడని.. అతను రిటైర్ అవటం డిపార్ట్మెంట్ కి తీరని లోటుగా గుర్తు చేసుకున్నారు..
స్నేహితుడి తరపున గోవింద్ మాట్లాడాడు... మరో జన్మంటూ ఉంటే శ్రీనాథ్ కి మళ్ళీ స్నేహితుడుగా పుట్టాలని..స్నేహానికి ప్రాణం ఇచ్చే శ్రీనాథ్ తనకు తన కుటుంబం లో మనిషని చెప్పాడు.. అందరూ ఆనందించారు...
ఆ రాత్రి దగ్గర్లో ఉన్న కామత్ హోటల్ లో భోజనం చేశారు శ్రీనాథ్, గోవింద్ కుటుంబాలు... చాలా రోజుల తరువాత సరళ బయట భోజనం చేసింది.. ఆమెకు నిజంగా అసూయగా ఉంది.. శ్రీనాధ్ ది మంచి ఉద్యోగం.. రిటైర్మెంట్ ఫంక్షన్ బాగా చేసారు..అందరూ పొగిడారు ఆయనను..
వచ్చే నెల లో తన భర్త గోవింద్ రిటైర్మెంట్ వుంది.. మామూలు స్కూలు టీచర్ గా చేరి ఇప్పుడు ఒక స్కూల్ హెడ్మాస్టర్ గా రిటైర్ అవుతున్నాడు.. అప్పుడు ఫంక్షన్ యెలా జరుగుతుందో ఏమో ?? శ్రీనాథ్ రిటైర్మెంట్ ఫంక్షన్ లా ఆర్భాటంగా ఎలాగూ జరగదు. కనీసం లో కనీసం తల దించు కోకుండా జరిగితే చాలు... అలా చాలా మంది దేవుళ్ళకు మొక్కింది..
రిటైర్మెంట్ రోజు దగ్గర పడుతున్న కొద్దీ సరళ లో ఆందోళన పెరిగి పోతూ వచ్చింది... ఇద్దరూ వెళ్లి శ్రీనాథ్ ని, లక్ష్మి నీ పిలిచారు ఫంక్షన్ కి. మనసులో మాత్రం, న్యూనతా భావం నిండి ఉండటం వలన , సరళ వాళ్లు రాక పోతే బాగుండునని చాలా సార్లు అనుకుంది.. గోవింద్ మాత్రం మామూలుగానే ఉన్నాడు.. మామూలు రోజుల్లాగే రిటైర్మెంట్ రోజు వచ్చింది..
ఆ రోజు మామూలు గా స్కూల్ కి వెళ్లి కొన్ని క్లాసులు కూడా తీసుకున్నాడు పిల్లలకు.... అదే తన ఆఖరి క్లాసు కావటం తో రుద్ధమైంది ఆయన గొంతు.. కష్టం మీద క్లాసు కానిచ్చి స్టాఫ్ రూమ్ కి వచ్చాడు గోవింద్..
సాయంత్రం నాలుగు గంటలయ్యింది.. ఆ పాటికే సరళ ను , పిల్లలను తీసుకుని శ్రీనాథ్ వాళ్లు కూడా స్కూల్ కి వచ్చారు.
శ్రీనాథ్ కి చాలా సంతోషంగా ఉంది..గోవింద్ రిటైర్ అవుతున్నాడు.. వాడూ ,తను కలిసి ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ కాలం గడపాలి..ప్లాన్ వేసుకున్నాడు.
సరళ కు బెంగగా ఉంది..ముళ్ళ మీద కూర్చున్నట్లు ఉంది తనకు.. ఫంక్షన్ త్వరగా అయిపోతే బాగుండును..అనుకుంది.
తలవొంపులుగా ఫంక్షన్ జరుగుతుంది ..తను తట్టుకోలేదు...మామూలు స్కూల్ టీచర్ రిటైర్ అయితే కొన్ని వేలమంది, లక్షల మంది టీచర్లు ఉన్నారు భర్తీ చేయటానికి... టీచర్ రిటైర్మెంట్ అంత గొప్ప విషయం కాదు.. తొందరగా ముగించి ఇంటికి చేరుకోవాలని ఆరాటం సరళకు.. పిల్లలు కూడా వచ్చారు..తండ్రి రిటైర్మెంట్ చూడడానికి...
సరళ వాళ్ళను స్టాఫ్ రూం లో కూర్చో బెట్టారు..మిగతా టీచర్లు..
అప్పటి వరకూ పెద్దగా జనం లేరు . విద్యార్థులు , టీచర్లు అందరూ కలిసి ఒక వంద మంది ఉంటారు.. వాళ్ళు రోజూ స్కూల్లో ఉండే వాళ్లే కదా.. సరళ కు పెద్దగా సంతోషం కలగ లేదు ... ఇంకో పది నిముషాలకు ఫంక్షన్ మొదలవుతుందనగా ...ఎక్కడినుండి వచ్చారో..దాదాపు ఇంకో వంద మంది పైనే జనం వచ్చారు..వాళ్లు పిల్లల బంధువులని తెలిసింది...
ఫంక్షన్ ఆరుబయట చెయ్యాలని నిర్ణయం చేశారు...అందరూ కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవు..చాలా మంది నుంచునే ఉన్నారు...ఫంక్షన్ అయ్యేంత వరకూ..
ఎక్కడి నుండో పల్లకీ ని తీసుకు వచ్చారు... మాస్టారు గోవింద్ ను పిల్లలు పల్లకీ లో కూర్చుండ బెట్టారు.. కొంత మంది టీచర్లు, పిల్లల బంధువులు పల్లకీ మోయటానికి సిద్ధ పడ్డారు... సరళ కు అంతా కల గా ఉంది... పల్లకీ లో గోవింద్ ని కూర్చో బెట్టి లేప బోతుండగా ఎవరో అరిచారు..
మాస్టారి గారి ధర్మ పత్ని ని కూడా పల్లకీ లో కూర్చో బెట్టాలని.. అందరి బలవంతం మీద పల్లకీ లో కూర్చుంది సరళ.. గోవింద్ తో...పెళ్లి రోజు తరువాత మళ్లీ ఇన్నాళ్ళకు...పల్లకీలో ఎక్కడం.. సరళ కు సంతోషం తో కళ్ల వెంట నీళ్ళు వచ్చాయి..
పల్లకీ లేచింది..చిట్టి చేతులతో పిల్లలు కూడా పల్లకీ మోస్తున్న వాళ్ళకు సాయపడుతున్నారు.. ఆ దృశ్యం మనోహరం గా ఉంది.. కాలం కొన్ని క్షణాలు అలా ఆగిపోతే బాగుండునని అనిపించింది సరళ కు.. గోవింద్ కి భాధ గానూ, సంతోషం గానూ ఉంది..పిల్లలూ జాగ్రత్త .. మీరు ఇబ్బంది పడకండి అంటూ వాళ్ళను వారిస్తున్నాడు..అయినా వాళ్లు వినటం లేదు ...
ఇంతలో పల్లకీ ని దింపారు.. ఎందుకో అర్థం కాలేదు సరళ కు, గోవింద్ కు...
కారు దిగి నెమ్మదిగా వచ్చి నమస్కారం చేశాడు గోవింద్ కి ఆ వచ్చినాయన... గోవింద్ కాళ్ళకు దండం పెట్టాడు.. ఆ వచ్చినాయన జిల్లా ఎస్పీ గారు.. వెంట పది మంది పోలీసులు.. ఈ లోపల ఇంకో కారు వచ్చి ఆగింది.. వచ్చింది జిల్లా
జడ్జ్ గారు..ఆయన కూడా తన వాళ్ళతో వచ్చారు..
జిల్లా ఎస్పీ, జడ్జ్ గారు,
మిగతా వాళ్లు పల్లకీ మోస్తుండగా నిర్ణీత స్థలానికి చేరారు..
నీళ్ళు, కాళ్ళు కడిగే ఇత్తడి పళ్ళెం వచ్చాయి...ఎక్కడి నుండో... ఎస్పీ, జడ్జ్ గార్లు గోవింద్ మాస్టారి కాళ్ళు కడిగి తల మీద చల్లుకున్నారు... కొంత మంది ఆడవాళ్ళు హారతి ఇచ్చారు గోవింద్ కి, సరళ కు.. ఆ రోజు పూల వాన కురిపించారు అందరూ వారిద్దరి మీద..
పిల్లలు మాస్టారు గోవింద్ గారి గురించి మాట్లాడుతూ ఏడ్చేసారు.
ఇంచుమించు టీచర్ల పరిస్థితి కూడా అంతే..అందరి కళ్ళు చెమ్మగిల్లాయి.. జిల్లా ఎస్పీ,జడ్జ్ కూడా మాట్లాడారు. తమ జీవితం లో తాము సాధించిన విజయాలు అన్నీ గోవింద్ మాస్టారి వలనే అని గర్వంగా చెప్పారు.. ఆయన పక్కన కూర్చోవటం కూడా వాళ్లకు మనస్కరించక నుంచునే ఉన్నారు..చాలా సేపు...
అప్పటి వాతావరణం చెప్పటం కష్టం.. శ్రీనాథ్ సంతోషం చెప్పనలవి కాదు..తన స్నేహితుడికి జరుగుతున్న గొప్ప గౌరవం..అది.. వాడికి జరిగినా తనకూ జరిగినట్లే...
శ్రీనాథ్ మాట్లాడుతూ చెప్పాడు..ఇక్కడున్న ఇన్ని వందల మంది లో తనొక్కడే గోవింద్ ని ఆప్యాయంగా ఒరేయ్ అని పిలువ గల అర్హత కలవాడవటం సంతోషంగా ఉందని అన్నాడు..
చివరగా గోవింద్ మాట్లాడాడు..
పిల్లలందరికీ నా ఆశీస్సులు... ఒకప్పటి నా విద్యార్థులు ఈ నాడు జిల్లా కు జడ్జ్ గానూ, ఎస్పీ గానూ ఉండటం తనకు ఎంతో సంతోషంగా ఉందని ..ఇలా పిల్లల్ని మంచి ఉన్నత స్థితి లో చూడటం తనకు గర్వ కారణం అనీ, ఈ పిల్లలే తన ఆస్తి ,ఐశ్వర్యం , వీళ్ళే నా సర్వస్వం అంటూ ...మాట్లాడలేక పోయాడు.
నాకు ఇంత గొప్ప వరం ఇచ్చిన భగవంతుడిని కోరేదొకటే అన్నాడు.. నా పిల్లలందరికీ మంచి భవిష్యత్తును, దీర్ఘాయువును ఇమ్మని కోరాడు..
పిల్లలను పట్టుకోవడం ఎవరి తరం కాలేదు..అంతలా అభిమానించారు గోవింద్ మాస్టారును..
ఫంక్షన్ ముగిశాక అందరూ కలిసి వచ్చి గోవింద్ ని ఇంటి వరకూ దిగ బెట్టారు....వెళ్ళలేక వెళ్ళారు పిల్లలందరూ...
ఆ రోజు రాత్రి శ్రీనాథ్ , లక్ష్మి వారి పిల్లలూ గోవింద్ ఇంట్లోనే ఉండి పోయారు...
భోజనాలు అయిన తరువాత గోవింద్ పాతికేళ్ల కొడుకు సుబ్రహ్మణ్యం, తల్లితో అన్నాడు... నాన్న గారికి ఇంత ఆస్తి ఉందని నాకు ఇంత వరకూ తెలియదమ్మా ....
నాకూ ఇంత వరకూ తెలియదురా అన్నది సరళ ఎంతో సంతోషంగా.. .
శ్రీనాథ్ కల్పించుకుని అన్నాడు..
వీడు కుబేరుడికి ఏం తీసిపోడు.. మనః స్ఫూర్తిగా చెపుతున్నాను..
సరళ గోవింద్ వంక చూసింది.. గోవింద్ ...మనకు ఈ సంపద చాలు సరళా ఈ జన్మకు ... అన్నాడు..
ఆకాశం లో ఒక మెరుపు మెరిసింది.. గురువులు పూజ్య నీయులు .. వారు ప్రోగు చేసుకున్న ఆస్తి పిల్లల అభిమానమే... అన్నట్లుగా... ✍️
…కోసూరి లక్ష్మణరావు
No comments:
Post a Comment