Vedantha panchadasi:
పంచమము:
మహావాక్య వివేక ప్రకరణము
౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼౼
యేనేక్షతే శృణోతీదం జిఘ్రతి వ్యాకరోతి చ ౹
స్వాద్వస్వాదూ విజానాతి తత్ర్పజ్ఞాన ముదీరితమ్ ౹౹1౹౹
1. ఏ చైతన్యము ద్వారా చూచునో,ఏ చైతన్యము ద్వారా వినునో,ఏ చైతన్యము ద్వారా గంధము నాఘ్రాణించునో వాక్కుతో వ్యవహరించునో దేనీ ద్వారా రుచి అరుచి తెలిసికొనునో ఆ చైతన్యమే ప్రజ్ఞానమని చెప్పబడినది.
చతుర్ముఖేంద్రదే ఏషుమనుష్యాశ్వ గవాదిషు ౹
చైతన్యమేకం బ్రహ్మాతః ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి ౹౹2౹౹
2. చతుర్ముఖబ్రహ్మ ఇంద్రుడు దేవతలు మొదలగు ఉత్తమములైన ఉపాధులందు గల చైతన్యము,మధ్యమోపాధులగు మానవ శరీరములందూ అధమోపాధులగు గుర్రములు పశువులు మొదలగు వాని యందూ గల చైతన్యం అంతా ఒక్కటే.అదే బ్రహ్మము.కనుక నా యందుగల ప్రజ్ఞానము కూడా బ్రహ్మమే.
వాఖ్య:- నాలుగు వేదములలోని నాలుగు మహా వాక్యములను వివరించుచు,మొదట
"'ప్రజ్ఞానం బ్రహ్మ'" అనే ఋగ్వేదీయ ఐతరేయోపనిషద్వాక్యము లోని
"ప్రజ్ఞాన" శబ్దమును వివరించుచున్నాడు.శుద్ధ చైతన్యము అంతఃకరణము ఇంద్రియములచే పరిమితమై వాని ద్వారా ఇంద్రియ విషయములను గ్రహించు చున్నది.ఈ చైతన్యమే ప్రజ్ఞానము.ఈ ఉపాధులను తొలగించినచో అదే సచ్చిదానంద బ్రహ్మము.
"ఋగ్వేదాంతర్గతమైన శాంతి మంత్రము":-
ఓం వాజ్మే మనసి ప్రతిష్ఠితా-మనో మే వాచి ప్రతిష్ఠితం,ఆవీ రావీ ర్మ ఏధి,వేదస్య మ ఆణీ స్థః-శ్రుతం మే మా ప్రహాసీః అనేనాధీతేన అహో రాత్రాన్ సందధామి-ఋతం వదిష్యామి-సత్యం వదిష్యామి-తన్మా మవతు-తద్వక్తార మవతు-అవతుమాం అవతువక్తారం.
ఓం శాన్తిః శాంన్తిః శాన్తిః.
తా: నా యొక్క వాక్కు నిరంతరము మనస్సునందు స్థిరమగునుగాక!నా యొక్క మనస్సు వాక్కునందు నెలకొని యుండుగాక!ఓ జ్యోతి స్వరూపమైన పరమాత్మా!
నా అజ్ఞానమును పోగొట్టి(జ్ఞాన)ప్రకాశము కలుగునట్లనుగ్రహింపుము.
ఓ మనోవాక్కులారా!
నాకు విజ్ఞానము నొసంగుటకు సమర్థులగుదురుగాక!నాచే వినబడిన గ్రంథమును దాని అర్థమును మరువక యుందునుగాక!అధ్యయనము చేసి మరువకయుండు గ్రంథమును నేను రాత్రింబవళ్ళు అనుసంధానము చేయుదునుగాక!యథార్థవస్తువగు పరమాత్మను గూర్చి తెలిసికొందును.వాచిక సత్యమును,మానసిక సత్యమును వచించెదను.ఆ పరమాత్మ నన్ను రక్షించుగాక!నా గురువును రక్షించుగాక!త్రివిధతాపములును శాంతింపబడుగాక!
"ప్రజ్ఞానం బ్రహ్మ"
సర్వము తెలియు ప్రఙ్ఞయే
బ్రహ్మము - లక్షణవాక్యము.
ఈ వాక్యమునందు
"ప్రజ్ఞానం-బ్రహ్మ" అను రెండు పదములు గలవు.ఇందులో ప్రజ్ఞాన మనగా,
ఏ చైతన్యము(ఆత్మ)నేత్రముద్వారా చూచుచున్నదో,శ్రవణద్వారా వినుచున్నదో,ఘ్రాణేంద్రియము ద్వారావివిధ గంధముల నెఱుగునో,వాగిన్ద్రియము ద్వారా వ్యాఖ్యానమును జేయు చున్నదో రసనేన్ద్రియము ద్వారా రుచి అరుచులను దెలియుచున్నదో మరియును నోరు, చేయి మొదలైన సర్వేంద్రియముల నుండి బయలుదేరిన అంతఃకరణ వృత్తితో గూడికొని సర్వవిషయములను యే జ్ఞానంబు వలన గ్రహించుచున్నాడో
"ఆ జ్ఞానమే ప్రజ్ఞానమై" యున్నది.ఇదియే అంతఃకరణ యొక్క సర్వ వృత్తులను తెలియుచున్నది.
ఆ చైతన్యమే ప్రజ్ఞాన శబ్దముచే చెప్పబడినది.
ఆ చైతన్యమే ప్రజ్ఞానమని అర్థము.
చతుర్ముఖ బ్రహ్మ మొదలైన దేవతల యందును,ఉత్తమమగు మనుష్యులందును,అధమమగు అశ్వగవాది మృగముల యందును కలిసి యే చైతన్యమున్నదో ఆ చైతన్యమే బ్రహ్మమను పదమునకు లక్ష్యార్థమై యున్నది.కనుక తన యందుండు ప్రజ్ఞానము బ్రహ్మమే అగును.కనుక తన నిజస్వరూపమైన ప్రజ్ఞానమే బ్రహ్మమని నిశ్చయించు కొనవలయును.
No comments:
Post a Comment