Wednesday, October 16, 2024

 Vedantha panchadasi:
సంసారః పరమార్థోఽ యం సఁల్లగ్నః స్వాత్మావస్తుని ౹
ఇతి భ్రాన్తి రవిద్యా స్యా ద్విద్యయైషా నివర్తతే ౹౹10౹౹

10. ఈ సంసారము పరమ సత్యము,పరమాత్మకు చెందినది అనే భ్రాంతియే అవిద్య.విద్యచే ఇది నివారింపబడుచున్నది.

ఆత్మాభాసస్య జీవస్య సంసారో నాత్మవస్తునః ౹
ఇతి బోధో భవేద్విద్యా లభ్యతేఽ సౌ విచారణాత్ ౹౹11౹౹

11. "ఆత్మభాసయగు జీవునిదే సంసారము.పరమాత్మది కాదు" అనే జ్ఞానమే విద్య.విచారణ వలన ఈ జ్ఞానము కలుగును.

సదా విచారయేత్తస్మా జ్జగజ్జీవ పరాత్మనః ౹
జీవ భావ జగద్భావ బాధే స్వాత్వైవ శిష్యతే ౹౹12౹౹

12. కనుక సర్వదా జీవుడు జగత్తు పరమాత్మలను గూర్చి విచారింప వలెను.జీవుడనే భావము జగత్తు అనే భావము బాధ చెందినపుడు ప్రత్యగాత్మ స్వరూపమగు పరమాత్మయే మిగులును.బాధ అనగా అవి సత్యమనే భావము నశించుట.

ఈ సంసారము(ప్రపంచదృశ్యము)
అనునది జీవుని(ప్రథమవ్యక్తి -హిరణ్యగర్భుని)ఆద్యస్వప్నమే.

సృష్టి ప్రారంభమున హిరణ్యగర్భుని సమిష్టి పుర్యష్టకమునకు (సూక్ష్మదేహము) విషయజ్ఞానము ఎట్లు కల్గినదో అట్లే వ్యష్టి పుర్యష్టకములన్నింటికి విషయజ్ఞానము సర్వదా సంభవించును.

జీవుడు
(పుర్యష్టకరూపుడు లేక సూక్ష్మదేహరూపుడు)గర్భమునందున్నప్పుడే దేనిని ఊహించినను దానిని ఉన్నట్లుగా తాను చూచును.

స్థూలప్రపంచమందు విశ్వమూలతత్త్వములు ఎట్లు రూపొందునో,అట్లే సూక్ష్మప్రపంచమందు గూడ ఆ తత్త్వమునకు సరియగు ఇంద్రియములు రూపొందుచున్నవి.

సహజముగా యథార్థముగా సృజింపబడలేదు.ఈ పదములు వర్ణనలు కేవలము ఉపదేశము కోసమే ఉపయోగింపబడును. ఉపదేశార్థము ఉపయోగింపబడిన ఈ భావములు విచారముతో తొలగును.

ఆత్మ(పరమాత్మ) సత్యము. జీవుడు,
పుర్యష్టకమ(సూక్ష్మశరీరము),
సంసారమనే ప్రపంచ దృశ్యము దానికి సంబంధించిన మిగిలినదంతయు అసత్యము,వాని స్వభావ విచారణ నిస్సందేహముగా వాని అసత్యత్వ విచారణయే!

వ్యక్తికి అసత్యత్వపు నిజ స్వభావమును ఉపదేశించునుద్దేశముతో జీవుడు,మొదలగునట్టి పదములు ఉపయోగింపబడును.

ఈ అపరిచ్ఛిన్నచైతన్యము జీవస్వభావమును ధరించినట్లుగానుండి తన నిజస్వభావమును విస్మరించి, ఉన్నదని తాను తలుచుదానినంతటని అనుభవగోచరము గావించుకొనును.

రాత్రియందు తాను దర్శించు అసత్యపిశాచము బాలునకు నిజముగా సత్యమయినట్లే జీవుడు గూడ తాను జూచు పంచభూతములను అవి తనకు కొన్ని వెలుపలనున్నట్లుగా కొన్నితన లోపల ఉన్నట్లుగా జీవుడు భావించును.అందువలన అతడు వానిని అనుభవించును.ఇవి జీవుని భావనలు తప్ప వేరు కావు.

ఎక్కడ ప్రపంచము కనిపించినను అది మాయామయమయిన ప్రపంచదృశ్యమే.అందువలన ఈ భ్రాంతి మానసిక పరిమితితో(వాసనతో)పోషింపబడును.

జీవుడు ఒక దేహమునుండి మరియొక దేహమునకు బోవును.
ఆ దేహము జీవుడు పెట్టుకున్న భావనయొక్క ప్రతిబింబమే.
అసత్యమయినది(దేహము)
మాత్రమే
మరణించును. మరియు మరియొక దేహమునందు మరల జనించునది కూడా అసత్యమే. 

సర్వదా జీవుడు జగత్తు పరమాత్మలను గూర్చి విచారింప వలెను.జీవజగత్తుల భావము నశించిన ప్రత్యగాత్మ స్వరూపమగు పరమాత్మయే మిగులును.

అన్ని ఆలోచనలను,భావనలను లేక మానసికరూపములను పరిత్యజించుట,గాఢమయిన మానసికపరిమితుల నివృత్తియే పరమాత్మ లేక బ్రహ్మము.

అట్టి
పరిమితి -బంధము, 
దాని 
పరిత్యాగము-విముక్తి.                 

No comments:

Post a Comment