Vedantha panchadasi:
పరోక్షా చాపరోక్షేతి విద్యా ద్వేధా విచారజా ౹
తత్రాపరోక్షవిద్యాప్తౌ విచారోఽ యం సమాప్యతే ౹౹15౹౹
15.విచారణ వలన కలుగు జ్ఞానము రెండు విధములు,
పరోక్షము, అపరోక్షము అని,
అపరోక్షజ్ఞానము కలుగుటతో విచారణ సమాప్తి నొందును.
అస్తి బ్రహ్మేతి చేద్వేద పరోక్షజ్ఞానమేవ తత్ ౹
అహం బ్రహ్మేతి చేద్వేద సాక్షాత్కారః స ఉచ్యతే ౹౹16౹౹
16. "బ్రహ్మము ఉన్నది"అనే జ్ఞానము పరోక్షము మాత్రమే
"నేనే బ్రహ్మమును"అనే జ్ఞానము అపరోక్షము.
అదే సాక్షాత్కారము.
తత్సాక్షార సిద్ధ్యర్థ మాత్మ తత్త్వం వివిచ్యతే ౹
యేనాయం సర్వ సంసారాతు త్సద్య ఏవ విముచ్యతే ౹౹17౹౹
17. ఆ సాక్షాత్కారము సిద్ధించు కొరకు ఆత్మ తత్త్వము వివేచింప బడుచున్నది.
ఈ ఆత్మసాక్షాత్కారముచే జీవుడు తత్క్షణమే సంసార చక్రము నుండి విముక్తి నొందును.
నిజమైన గురువు స్వయంగా నారాయణ స్వరూపమే.మానవరూపంలో వుండే గురువు వలన పరమసత్యాన్ని గ్రహించి
అపరోక్ష జ్ఞానముతో సత్యదర్శనాన్ని పొందగలగాలి.
బుద్ధితో సముపార్జించిన జ్ఞానమంతా పర+అక్ష అంటే ఇతరుల కన్ను.ఇతరుల కన్నులతో చూసినది పరోక్షజ్ఞానం. సునిశితమూ తీక్షణమూ అయిన బుద్ధికల వారందరూ కూడా దీనిని సంపాదించగలరు.కానీ దీనిని స్వానుభవముగా గ్రహించడం మాత్రం అత్యంత కష్టసాధ్యం.
స్వయంగా తన కన్నులతో చూసినది అ+పరోక్ష+జ్ఞానం. అపరోక్షనుభూతి అంటే స్వానుభవం.
సిద్ధాంతపరమయిన జ్ఞానసంపాదన ప్రధనంకాదు, స్వానుభవము వలన మాత్రమే సత్యదర్శనమౌతుంది.
శాస్త్రాధ్యయనము వలన బ్రహ్మము కలదు అనే పరోక్షజ్ఞానము కలుగు చున్నది.
మనలోని ప్రత్యగాత్మయే బ్రహ్మమనే అనుభవము కలుగుట అపరోక్ష జ్ఞానము.
పరోక్షజ్ఞానమనగా తర్కాది జనితమైన జ్ఞానము.అపరోక్ష జ్ఞానము అనుభవ జనితము. తేనెటీగలు కుట్టును అనే జ్ఞానము అందరికిని కలదు.సాక్షాత్తుగ తేనెటీగలచే కుట్టబడిన వ్యక్తికి కలుగు "తేనెటీగలు కుట్టును"అనే జ్ఞానములోని విశిష్టత స్పష్టమే గదా!
బుద్ధి ఫరిధిని అధిగమించి శుద్ధచైతన్యస్థితిలోనికి చేరుకోవాలి.మహోన్నతమైన విలువలకనుగుణంగా జీవిస్తూ,కేవలం శారీరక మానసిక సుఖాలతో తృప్తిపడకుండా,జీవన పరమార్థాన్ని గ్రహించి సాధించాలనే దృఢదీక్షతో జీవించాలి.
"లక్ష్యం"
మీద నిలబడడమే తపస్సు.
మానసికమైన కోరికలూ,బుద్ధిలోని ఆలోచనల నిరంకుశాధికారంనుండి విడివడి,వివేకంతో పరిమితత్త్వం నుండి బయటపడాలి.
మనచుట్టూఉండే వస్తుమయ ప్రపంచం మీద వ్యామోహం లేకుండా మమకారమూ, రాగద్వేషాలూ లేకుండా వైరాగ్యాన్ని వృద్ధిచేసుకోవాలి.
బ్రహ్మత్వం మొదలుకుని జడపదార్థం వరకూగల సర్వస్థితుల మీదను,కాకిరెట్టమీద ఉన్నట్లుగా (ఎటువంటి ఆకర్షణా లేకుండా)తీవ్ర వైరాగ్యం కలిగి ఉండడమే నిర్మలమయిన వైరాగ్యం.
మనోబుద్ధులద్వారా చైతన్యం ఆధారంగా చూడబడే బాహ్యవస్తుమయ ప్రపంచమంతా కూడా అనిత్యమయినది-నిత్యమూ మారే స్వభావం కలది.దృగ్గోచరమయే వస్తువులు నిత్యమూ మార్పు చెందుతూ నశిస్తూ పరిమితత్త్వంతో కూడి ఉన్నాయి.
వస్తుమయ ప్రపంచము నిత్యమూ మార్పు చెందుతూ ఉంటుందనీ,దానిని ప్రకాశింపజేసే చైతన్యం మాత్రం నిశ్చలంగా నిత్యమూ స్థిరంగా ఉంటుందనీ గ్రహించిన వాడే వివేకవంతుడు.
చైతన్యం నిత్యమైనది. మార్పులేనిది.
స్థూల-సూక్ష్మ-కారణ శరీరాలన్నీ కూడా చైతన్యజ్యోతి యొక్క విభిన్న వ్యక్తరూపాలు మాత్రమేననే జ్ఞానంలో క్రమంగా నిష్ఠను పొందడమే ఆత్మ సాక్షాత్కారానికి-స్వరూప దర్శనానికి సులభమయిన సాధనా విధానం.
నాలోని ఆత్మ,నేనే అయిన ఆత్మ, నిత్యమూ స్థిరంగా ఉంటుందని ఆ పరమాత్మస్వరూపమే నేను అనేదే అసలైనజ్ఞానం.
సద్ వృత్తి-నేనూ నాతో పాటుగా నేను చేసేవన్నీ కూడా కలిపి ఏకంగా ఒకేఒక బ్రహ్మం ఉంది,అహం బ్రహ్మస్మి-ఇది వినా రెండవదేదీ లేదు,అనే దృఢజ్ఞనంలో సాధకుడు స్థితమయిన నిరంతర ధ్యానంలో ఉండగలగాలి.
రెండవదానికి తావివ్వని అఖండ బ్రహ్మానుభవంలో నిష్ఠకలిగి ఉండడమే సమాధి(జ్ఞానం)అనబడుతుంది.
ఇదే సత్యాన్ని ప్రత్యక్షంగా దర్శించడం బ్రహ్మానుభవం,అపరోక్షానుభూతి అని అంటారు.
No comments:
Post a Comment