Vedantha panchadasi:
జలవ్యోమ్నా ఘటాకాశో యథా సర్వస్తిరోహితః ౹
తథా జీవేన కూటస్థః సోఽ న్యోన్యాధ్యాస ఉచ్యతే ౹౹24౹౹
24.జలాకాశముచే ఘటాకాశము సంపూర్ణముగా ఆవరింపబడి కనిపింప కుండునట్లు జీవునిచే కూటస్థము సర్వదా ఆవరింపబడి గోచరింపక ఉండును.వీనినే అన్నోన్యాధ్యాస అని అంటారు.
అయం జీవో న కూటస్థం వివినక్తి కదాచన ౹
అనాది రవివేకోఽ యం మూలాఽ విద్యేతి గమ్యతామ్ ౹౹25౹౹
25. ఈ అన్నోన్యాధ్యాస ఫలముగా జీవుడు ఎన్నటికిని కూటస్థమును గూర్చి వివేచింపక ఉండును.ఈ అవివేకము అనాదియైనది.దీనినే మూలావిద్య అంటారు.
విక్షేపావృత్తి రూపాభ్యాం ద్విధాఽ విద్యా వ్యవస్థితా ౹
న భాతి నాస్తి కూటస్థ ఇత్యాపాదనమావృతిః ౹౹26౹౹
26. అవిద్యయందు రెండుంశములున్నవి.విక్షేపము ఆవృతి అని. కూటస్థము ప్రకాశింపదు.కనుక అసలు లేదు అని ఆరోపించుట ఆవృతి.
అజ్ఞానము లేక అవిద్యయనునది అనాది,శాస్త్రములలో అనాది అవిద్యామాయా యని చేప్పబడినది.అనాది యొక్క ఆదిని గూర్చి తెలిసికొనవలయునునని ప్రయత్నించుట మూర్ఖత్వము.
జీవుని పరమార్థ రూపము జననమరణములు లేని శుద్ధ అసంగ చిన్మాత్ర కూటస్థాత్మయే.
ఇట్టి ఆత్మ సర్వవ్యాపి అయిన బ్రహ్మమున కంటే అన్యముకాదు.
జీవుడు
(అంతఃకరణ ప్రతిబింబుడు)తన వాస్తవ స్వరూపము ఇట్టిదని తెలియక పోవుట(మరుపు)అనీ అజ్ఞానముచేత అనాదిగా స్వరూపమునందు ఆరోపించుకొని యున్న దేహేంద్రియాది
మనః ప్రాణాదులే
"నేననియు"
విషయప్రపంచ సంబంధమైన వస్తుజాతము
"నాదనియు"
ఆరోపించుకొని అహంకార మమకారములతో సంసారచక్రమున పరిభ్రమించుచున్నాడు.
బ్రహ్మ రూపాత్మను తెలిసికొనలేదు అనునది అవిద్యాస్వరూపము లేక
అజ్ఞానలక్షణము.అంటే మన నిజస్వరూపమైన బ్రహ్మరూపాత్మను మనకు తెలియ నివ్వకుండా మరుగు పరిచినది.
నీటిలో పుట్టిన పాచి నీటినే కమ్ముకొని నటుల,కంటిలో పుట్టిన పొర కంటినే ఆవరించి నటుల ఈ అవిద్య స్వస్వరూపమైన ఆత్మయందు భాసించి ఆత్మను తెలియ నవ్వకుండా క్రమ్ముకున్నది
విషయప్రపంచమును,
స్థూలదేహమును, సూక్ష్మ దేహమని చెప్పబడుచున్న జ్ఞానేంద్రియకర్మేంద్రియములను,
అంతఃకరణమును,ప్రాణాదివాయువులను వీటన్నింటి యందు ఎడతెగక కర్తృ రూపముతో యున్న తనను,కర్తృత్వములేని సాక్షిగా వేరు చేసుకొనవలెను.
ఒక్క సాక్షిత్వముమాత్రమే వుండిన అట్టి స్థితికి బ్రహ్మమునకు ఏకత్వము చెప్పవచ్చును.అంటే చిదాభాసుడు తనను సాక్షిగా గుర్తించి ఆపై బ్రహ్మముగా నిశ్చయిస్తాడు.
అవిద్యా ఫలముగ మనము నిత్యసత్యమైన బ్రహ్మమును గ్రహింపక తత్కాల సత్యమైన జగత్తును చూచుచున్నాము.
అవిద్యను విశ్లేషించినచో ఉన్నదానిని చూడకపోవుట,లేనిదానిని చూచుట అనే రెండు ప్రక్రియలను గమనింపగలము.
మొదటిదానిని ఆవరణమనీ రెండవదానికి విక్షేపమనీ పేర్లు.అవిద్య యొక్క ఆవరణ ప్రభావముచే ఉన్న కూటస్థము తిరోహితమగుచున్నది.దాని విక్షేప ప్రభావముచే స్థూలసూక్ష్మాది శరీరములు జీవులు కన్పించుచున్నవి.
No comments:
Post a Comment