Tuesday, November 26, 2024

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️


25. శ్రద్ధయా దేయమ్

(ఏది ఇచ్చినా) శ్రద్ధగా ఇవ్వాలి(యజుర్వేదం)

దానం ఎలా చేయాలి?
-అనే విషయంపై వేదవిజ్ఞానం చక్కని పరిజ్ఞానాన్ని ఇచ్చింది.

పాత్రునికి దానం చేయమని చెప్తూనే, అది 'శ్రద్ధ'గా చేయాలి - అని చెప్తోంది.
'దానం' అనే వ్యవస్థ వల్ల ఉన్నవాడూ, లేనివాడూ ఉన్న సమాజంలో కొంత
సమతౌల్యం సాధ్యమౌతుంది.

'ధనం' ఉన్నదంతా స్వభోగానికే కాదనీ, కొంత శాతాన్ని పాత్రతనెరిగి
పంచవలసిందేనని శాసిస్తోంది వైదికసంస్కృతి. దీనివల్ల ధనవంతుడననే 'అహంకారం'
తగ్గే అవకాశముంది. ఈ ధనం నాదనే అహంభావం, నేను దానం చేస్తున్నాననేదర్పం - ఈ రెండిటితోనూ దానం చేయరాదు అని శాస్త్రశాసనం.

శ్రద్ధయా దేయమ్ - అనే మాటతోపాటు, 'భియా దేయమ్', 'ప్రియా దేయమ్' అని కూడా ఉపదేశించింది వేదమాత.

'నేను తగినంత, తగినవిధంగా ఇవ్వగలుగుతున్నానో లేదోననే భీతి 'ఇంత మాత్రమేఇవ్వగలుగుతున్నాను' అనే లజ్జ ·-'దాత'కి అవసరం.

దాత వినీతుడై, ప్రతిగ్రహీతను పరమేశ్వరునిగా భావించి ఇవ్వడం - అనే గొప్ప భావన, ఇచ్చే వానిలోని అహాన్ని తొలగించగల విధానం.

ప్రతిగ్రహీత కూడా 'కృష్ణార్పణం' అనో, 'శివార్పణం' అనో గ్రహిస్తాడు. అతనికి
సైతం అహంకారమో, లోభమో దరిచేరరాదనే భావన ఇందులో ఉంది.

ధనవంతుడై ‘దానం' చేయనివాడూ, దరిద్రుడై 'తపస్సు' చేయనివాడూ - ఇద్దరూ వ్యర్థులే అని ఆర్షవాఙ్మయం బోధిస్తోంది.

దరిద్రుడు ఇతరుని దానాన్ని ఆశిస్తూ, యాచిస్తూ బ్రతకడం కాదు. తన కాలాన్ని తపస్సు కోసం (స్వధర్మాచరణ, అనుష్ఠానాల కోసం) వినియోగించుకోవాలనిహెచ్చరించారు.
అంతవరకు బ్రహ్మచర్యాశ్రమంలో గడిపిన శిష్యునకు స్నాతకం జరిపిస్తూ, పై ఉపదేశాలిచ్చి గృహస్థాశ్రమ స్వీకారానికి అనుమతినిస్తాడు గురువు. ఆ సందర్భంలోనిదే ఈ 'శ్రద్ధయా దేయమ్' అనే మాట.

గృహస్థు సమాజంలో బ్రతుకుతున్నాడు. సమాజమంతా ఒకరి అవసరాలు మరొకరి
ద్వారా తీర్చుకొనే వ్యవస్థ. ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఇక్కడి అనివార్య ప్రధానాంశం.
ఇందులో స్వలాభం కోసం సాగే లావాదేవీలు అటుంచి, భౌతిక ప్రయోజనాపేక్షను ప్రక్కన పెట్టి సాగే 'ఇచ్చిపుచ్చుకోవడమే' - 'దానం' అనే విధానం.

దీని ద్వారా వ్యక్తి దృష్టిభౌతికాతీతంగా ఆలోచించగలుగుతుంది. ఆంతరిక
సంస్కారానికి అది మెరుగు దిద్దుతుంది. 'ఆధ్యాత్మిక ప్రయోజనం' అనే దిశగా సాగే సమాజంలో భౌతిక క్షేమాన్ని అతిసులభంగా సాధించవచ్చు.

అందుకు తగ్గ మానసిక పరిణతిని కల్పించేందుకు ఈ విధానాన్ని ప్రవేశపెట్టారు మహర్షులు.

"మాతృదేవో భవ - పితృదేవో భవ - ఆచార్యదేవో భవ - అతిథిదేవో భవ..”
లాంటి మాటలు చెప్పి కుటుంబంతో ఎలా మెలగాలో బోధించిన తరువాత,
“అధ్యయనం నుండి ఏనాడూ దూరం కాకూడదనీ, గృహస్థునికి సైతం
నిరంతరాధ్యయనం ఉండాలని బోధించి - తరువాత సమాజంతో ఎలా ఉండాలో బోధిస్తాడు ఆచార్యుడు.

దేవపితృ కార్యాలను విస్మరించరాదని హెచ్చరించి, శ్రద్ధతో, భీతితో, లజ్జతో దానం చేయమని చెప్పడమే కాకుండా 'అశ్రద్ధయా అదేయమ్'- “అశ్రద్ధతో ఏదీ ఇవ్వకు” అని మళ్లీ ప్రత్యేకంగా హెచ్చరిస్తాడు.

దైవపితృకార్యాలకు సమర్పించే దానిని కూడా 'ఏదో మొక్కుబడి వ్యవహారంగా కాకుండా, 'శ్రద్ధ, భక్తి' మొదలైన వినీత భావాలతో ఇవ్వాలనే బోధన కూడా ఇందులో ఉంది.

అందులోనూ దేవతాదృష్టి 'శ్రద్ధ'నే గమనిస్తుంది. ఇస్తున్న వస్తువుని ఎంత శ్రద్ధతో, ఎంత ప్రీతితో ఇస్తున్నాడో గమనించేదే దేవతాదృష్టి. దానికి అనుగుణంగా ఫలాన్ని ప్రసాదిస్తారు.       

No comments:

Post a Comment