☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
5. కేవలాఘో భవతి కేవలాదీ
తన కోసం (తాను)మాత్రమే ఆరగించేవాడు కేవలం పాపాత్ముడే అవుతున్నాడు (ఋగ్వేదం)
కేవలం తన పొట్ట నింపుకొనేవాడు, తన కోసం మాత్రమే ధనాన్ని దాచుకొనేవాడు,
పరధనాలను అనుభవించేవాడు పాపాలు స్వీకరిస్తున్నట్లేనని వేదవచనం.
స్వార్థం పనికిరాదని భారతీయ హృదయం.
-
ఈ సృష్టిలో మనం అనుభవించే సంపద అనేక ప్రాకృతిక శక్తుల నుండి,సమాజం నుండి పొందుతున్నాం. కాబట్టి దీనిని మనం మాత్రమే అనుభవించడం తగదు. పంచుకొని స్వీకరించాలి. ఇంత సమసమాజ భావన, సామ్యవాదం ఇంకెక్కడ లభిస్తుంది?
సృష్టిలో మానవులే కాక, ఇతర ప్రాకృతిక జగత్తు కూడా మన పోషణకి హేతువవుతోంది. కనుక వాటి ఋణం తీర్చుకోకుండా మనం మాత్రమే తినడం
స్వార్థం, కృతఘ్నత అనిపించుకుంటుంది.
సమస్త వస్తుసముదాయం ఈశ్వరునిదే. ఈశ్వరుని ద్వారా నియంత్రించ బడుతోంది.మనిషికి ఎంత అవసరమో, సత్కర్మ ద్వారా ఎంత సంపాదించాడో - అది మాత్రమే అతడు అనుభవించాలి. దానికి మించిన అధికమంతా ఇతరులదే.
తన సంపదని ఈశ్వరునికి సమర్పించి భుజించాలి. అదే యజ్ఞం. 1.దేవయజ్ఞం,
2. పితృయజ్ఞం, 3. ఋషియజ్ఞం, 4. మనుష్యయజ్ఞం, 5. భూతయజ్ఞం -అని యజ్ఞం అయిదు విధాలు.
దేవతలకూ, పితృదేవతలకూ, ఋషులకూ, సాటి మనుష్యులకు,ఇతర స్థావర జంగమాది జీవకోటికీ తగిన విధంగా కృతజ్ఞత ప్రకటించాలి - అని మన ఆర్ష సంప్రదాయం.
'యజ్ఞ శిష్టాశినః' ఆ
యజ్ఞము చేయగా మిగిలిన దానిని తినాలి. దానిని ''అమృతం' అంటారు. అందుకే ఈశ్వరునకు నివేదించి అన్నాన్ని తినడం అనే
సంప్రదాయం మనకి ఉంది. అలా కాకుండా తినడం మహాపాపమే.
భగవదర్పణం చేసిన వస్తువు పునీతమవుతుంది. ఆ భగవద్భావనచే పవిత్రమైనbదానిని భుజించడం వల్ల చిత్తశుద్ధి, శరీరం శుద్ధి - తద్వారా ఉత్తమబుద్ధి... క్రమంగ శుభమయమైన జీవనం సంప్రాప్తిస్తుంది.
‘భుంజతే తే త్వఘం పాపా యే పచన్త్యాత్మకారణాత్'
'తనకోసం వండుకునేవాడు పాపాన్నే తింటున్నాడు' -అని భగవద్గీతలో శ్రీకృష్ణపరమాత్ముని వచనం.
ఈశ్వరునికి నివేదించడం, సాటి మనుష్యులకు అందజేయడం, ఇతర జంతుకోటిని తృప్తిపరచడం.... వీటి వల్ల 'ఆహారశుద్ధి', 'చిత్తశుద్ధి' లభిస్తాయి.
'శ్రీమత్ భాగవతం'లో వ్యాసమహర్షి ఈ విషయాన్ని మరింత స్పష్టంగా చెప్పారు.
యావత్ బ్రియేత్ జఠరం
తావత్ స్వత్వం హి దేహినామ్
అధికం యోభిమన్యేత
యస్తేనో దండమర్హతి ||
“తన అవసరానికి మించిన దానిని ఆశించే వాడు, సేకరించేవాడు 'దొంగ' అనిపించుకుంటాడు. అతడు శిక్షార్హుడు" - అని భావం. 'కడుపు నిండడానికి ఎంత
అవసరమో అది మాత్రమే నీది. అది కూడా ఈశ్వరనివేదితం చేసి ఆరగించాలి'.
సంపదంతా కొంతమంది దగ్గరే నిలవ ఉండడం అనేది వేదం అంగీకరించదు.పోషణకి, భవిష్యత్లో జాగ్రత్తకి అవసరమైన ధనమే ఉండాలి. మిగిలింది పూర్తిగా ప్రపంచానిదే. పంచి బ్రతకడం - అనే సిద్ధాంతమే ఆర్షమతం.
యజ్ఞమయమైన ఆర్ష సంప్రదాయాలు సర్వకాలాలకీ, సర్వ మానవాళికీ శాశ్వతమైన, శ్రేయస్కరమైన జీవన విధానాలు.
No comments:
Post a Comment