Friday, November 29, 2024

 🧘‍♂️ *సాధకుడు*


🧘‍♂️ *సాధకుడి జీవితం ప్రత్యేకం. భగవంతుడి కోసం ముడుపు కట్టుకున్న పవిత్ర పరిమళ నారికేళం సాధకుడి జీవితం. కేవలం మానవుడు వేరు, సాధకుడు వేరు. ఎన్నో జన్మల సుకృత ఫలంగా తన జన్మ రహస్యం (మానవ జన్మోద్దేశం) గ్రహించిన మనిషి సాధకుడై పునర్జన్మ ఎత్తుతాడు. అందరిలో ఉంటాడు. అందరిలానే ఉంటాడు. ముళ్ల మధ్యనే విరిసిన గులాబీ అతడు. అన్ని మామూలు ఆకుల్లో కలిసిపోయిన మరువం అతడు. ప్రత్యేకంగా ఉండాలని అనుకోడు. ప్రత్యేక ప్రతిపత్తీ కోరుకోడు.* 

🔥 *ఒక మనిషి ఎందుకు సాధకుడు కావాలి.... ఎందుకు అందరిలా మామూలు మనిషిగా మసలకూడదు....ప్రాపంచిక లాలసం నుంచి ఎందుకు మడికట్టుకోవాలి.?*
 
*ప్రకృతిలో ప్రతి జీవికీ ఒక స్థానం ఉంటుంది. ఒక స్థాయి ఉంటుంది. దాన్ని అంగీకరించి, నిభాయించి నిలుపుకొనే ప్రయత్నమే జీవి ప్రధాన కర్తవ్యం. సహజ జీవన గమనం కూడా. మనిషితప్ప మిగిలిన జీవరాసులన్నీ ఆ నిర్దేశిత నియమాన్ని తు.చ. తప్పకుండా పాటిస్తున్నాయి. నియమ భంగం చేయాలన్న, చేయొచ్చన్న ఆలోచన కూడా వాటికి లేదు. అయితే ఒక జీవే అయినా నిర్మాణం వేరు, మనోస్థాయి లేదు. మనిషికి మనోమయ ప్రపంచం ఉంది. ‘ఆత్మ’ జ్ఞానం ఉంది.* 🙏🙏🙏

*ప్రతి మనిషికీ మానవ జన్మోద్దేశంపట్ల లీలగానైనా అవగాహన ఉంటుంది. కొంత ప్రయత్నంతో మనోమయ కోశద్వారాలు తెరుచుకోగలడు. మనోమయ కోశాన్ని విస్తృతపరచుకోగలడు. అసలు రహస్యాన్ని గ్రహించగలడు.*🙏🙏🙏

 *అక్కడే, ఆ ప్రయత్న వైఫల్య సాఫల్యాలే మామూలు మనిషికి, సాధకుడికి మధ్య భేదాన్ని పట్టిస్తాయి. భూమిమీద పుట్టిన ఏ ఇతర జీవైనా, ఎప్పటికైనా పరమపదం చేరే అవకాశమున్నా- అది సహజ ప్రక్రియే. అయినా అది చాలా చాలా నెమ్మదైన పరిణామం. ప్రయత్న రాహిత్యంవల్ల ఆ ప్రయాణం మరింత మందగిస్తుంది.*

 *మానవుడికి భగవంతుడిచ్చిన అద్భుత వరాలు- మనోమయ ప్రపంచం, ప్రయత్న శీలం. శరీరానికి సంబంధం లేకుండా మనసు సహకారంతో సాధనంతో భగవంతుడి పరమధామాన్ని ఎంత వేగంగా కావాలంటే అంత వేగంగా చేరుకోవచ్చు. మామూలు మనిషిగా మనమూ ఎప్పటికైనా చేరుకునే అవకాశమున్నా మనం జ్ఞానం లేని ఇతర జీవరాసుల వంటివాళ్లం కాదు కదా?.... ఉన్న అవకాశాన్ని ఎందుకు ఉపయోగించుకోకూడదు? అది కూడా అలాంటిలాంటి అవకాశం కాదు. అందుకే... మామూలు మనిషి సాధకుడిగా పరిణామం చెందితే ఆ అవకాశం కరతలామలకం అవుతుంది.* 

🔥 *పరమపదానికి సాధన అనే రాచబాట ఉండగా ఈ అడుసు దారిలో ప్రయాణం ఎందుకు.?* 

*పసిపిల్లలు బురదలో ఆడుకుంటారు. బురద పూసుకొంటారు. బురదలో చిందులేస్తారు. పరుగులు తీస్తారు. అది వాళ్ల వయసుకు తగిన సరదా. వయో పరిణతినిబట్టి సరదాలు, అభిరుచులు మారిపోతాయి. మనోపరిణతీ అంతే. అమృతాన్ని కోరుకోవలసిన స్థాయిలో మురుగు నీటికై అర్రులు చాచకూడదు.*
 
*సాధనకై వేసే మొదటి అడుగునుంచి మనకు అయాచితంగానే భగవంతుడి సహకారం, ఆశీర్వాదం లభిస్తాయి. చాలా అరుదుగా తప్ప ప్రాపంచిక సాధనల్లో ఆ అవకాశమే లేదు. ఎవరి సహకారమూ ఉండదు... వాళ్లకు ఏదో ఒక ప్రయోజనం ఉంటేతప్ప. భక్తి తప్ప మరో పెట్టుబడి లేని ఈ అద్భుతమైన వ్యవహారం, నష్టం ప్రసక్తే లేని ఈ దేవుడితో ప్రేమ వ్యాపారం ఎంత అభిలషణీయం.!* 🙏🙏🙏

*ఈ కొత్త దారిలో పరంధామానికి దారీ తెన్నూ తెలీక తికమక పడకూడదని భగవంతుడే ప్రేమతో సాధన అనే రాచబాట వేశాడు. మార్గదర్శిగా గురువును పంపాడు.*

 గురుబోధ అర్ధంచేసుకుని దర్జాగా.. ఆనందంగా.. నడిచిపోవటమే మన పని.

🕉️ *సర్వేజనా సుఖినోభవంతు* 🕉️

No comments:

Post a Comment