Thursday, November 21, 2024

 నారద భక్తి సూత్రములు 
             35 వ సూత్రము 
"తత్తు విషయ త్యాగాత్ సంగ త్యాగా చ్చ"  
భక్తి ఇంద్రియ వికారాలు,విషయ వాంఛలు,స్నేహాలు,చర్చలు,పరి త్యజించడం వల్లనే వృద్ధి పొందుతుంది. ప్రతి జీవి హృదయం లోనూ ప్రేమరసం ప్రవహిస్తూవుంటుంది,కానీ జీవుని ప్రేమ విషయ వాంఛలపై ప్రవహిస్తూఉండడం వల్ల అది దూషితం అవుతుంది,కామం కల్మషంతో కలవడం వల్ల మలినం అవుతుంది. ఆ ప్రేమరసం నిశ్చలమైన భక్తి ద్వారానే స్వచ్ఛమై,దివ్యమై తేరుకుంటుంది, అప్పుడు ఆ హృదయంలో ఈశ్వరముఖం ప్రతిబింబిస్తుంది. 
మనస్సు ఏది మననం చేస్తే అటువైపే ఆలోచనలు పరిగెడతాయి,కామం వుండే మనస్సులో రాముడు ఉండలేడు, భక్తి ద్వారా రాముణ్ణి హృదయం లో నింపితే కామం ఉండదు.
సంగం రెండువిధాలు  ౧. వంధ్య సగం ౨. వంద్య సగం. 1 సంసార సంబంధిత వాంఛ వంధ్య సగం.ఇది లౌకికం,దుఃఖ కరం. 2 భగవత్ సంబంధిత వాంఛ వంద్య సగం. ఇది అలౌకికం,మోక్షకరం.
విషయము విషయేఛ్చాదులు రెండిటిని త్యాగం చెయ్యటమేత్యాగం.ఇదియే నిజమైన నిష్కళంక త్యాగం.కాబట్టి విషయానురాగ రహితమైన హృదయం పవిత్ర దేవాలయం,భగవత్ ప్రేమ యొక్క ప్రభావంతోనే  విషయత్యాగం సహజంగానే కల్గుతుంది,అప్పుడు ఆ హృదయం భగవత్ స్థిర నివాసం అవుతుంది.
             36 వ సూత్రము 
"అవ్యావృత్త భజనాత్"                                     
 అఖండ నామ సంకీర్తన వల్లనే భక్తి కి సాధనం అబ్బుతుంది.భగవత్ భక్తులు సహజంగా నిరంతర నామసంకీర్తన చేస్తూవుంటారు.వారి అవయవాలు,ఇంద్రియాలు ఏపని చేస్తున్నా మనస్సు మాత్రం పరమాత్మను మననం చేస్తూనే ఉంటుంది. ఇది అభ్యాసం చేయుట భక్తులకు అత్యవసరం, నామ సంకీర్తన (భజన) లేకుండా భగవత్భక్తి కలుగదు.ఇలాంటి అఖండ అచంచల సంకీర్తనాది ప్రార్థనాభ్యాసం వల్లనే భగవత్ ప్రీతి సులభంగా లభిస్తుంది.
" నామస్మరణ ఉచ్చ్వాస నిశ్వాసాలతోపాటు జరిగిపోతూవుండాలి,అభ్యాసం దృడమైతే మనస్సు సంకల్ప రహితమై భగవంతునిలో లయం అవుతుంది,మనస్సు భగవంతునితో లయం కావడమే ముక్తి.  
సాధన దృఢం కావాలంటే దీర్ఘ కాలం జపతప ధ్యానాదులను అభ్యసించాలి.మననం వల్ల నామం అధిక ప్రభావం చూపుతుంది, ఎడతెగకుండా నామస్మరణ చేయుటవల్ల మనస్సు పరమ పవిత్రం అవుతుంది,అనన్య భక్తి కుదురుతుంది.   

No comments:

Post a Comment