🚩 " కన్యాశుల్కం"..🚩
♦
✍కన్యాశుల్కం గురజాడ అప్పారావు రచించిన తెలుగు నాటకం. కన్యాశుల్కం నాటకం రెండు కూర్పులను రాసి ప్రచురించారు. మొదటి కూర్పు 1897 లో ప్రచురించబడింది. ఈ నాటకం మొట్టమొదటి ప్రదర్శన 1892 ఆగస్టు 13న విజయనగరం లో జరిగింది. అంతకు ముందు 5 సంవత్సరాల క్రితం ఈ రచన జరిగిందని తెలుస్తోంది. అయితే 1909లో ప్రచురించిన రెండవ కూర్పే ప్రస్తుతం అత్యంత ప్రాచుర్యం పొంది, ప్రజాదరణ పొందిన కన్యాశుల్కం.
కథ!
♦కన్యాశుల్కంలో ప్రధానమైన ఇతివృత్తం సంఘ సంస్కరణ.
అగ్నిహోత్రావధాన్లు తన రెండవ కుమార్తెను చిన్న పిల్ల అని చూడకుండా 70 ఏళ్ళు నిండుతూన్న ముసలివాడు లుబ్దావధాన్లకి ఇచ్చి కన్యాశుల్కం కోసం పెళ్ళి చేయబోతాడు.
♦ అగ్నిహోత్రావధాన్లు కుమారుడికి ట్యూషన్ చెప్తానంటూ అప్పులు చేస్తూ, గొప్పలు చెప్పుకుంటూన్న గిరీశం అనే మోసకాడు ఆ ఇంట్లో ప్రవేశిస్తాడు. అగ్నిహోత్రావధాన్లు అప్పటికే పెద్ద కూతురు బుచ్చెమ్మకి కన్యాశుల్కం తీసుకుని ముసలివాడికి కట్టబెట్టగా, ఆ పెళ్ళిచేసుకున్న వ్యక్తి పెళ్ళి పూర్తికాకుండానే మరణిస్తాడు.
♦విధవగా ఇంట్లో ఉన్న బుచ్చెమ్మ అందానికి ముగ్ధుడైన గిరీశం ఆమెను మోసగించి వివాహమాడదామని ప్రయత్నిస్తాడు.
♦మరోవైపు గతంలో గిరీశం పోషణలో ఉండే మానవత్వం కలిగిన సాని మనిషి మధురవాణి, లుబ్దావధాన్లును మోసం చేసి పెళ్ళికి ఒప్పించి డబ్బు తీసుకుందామని ప్రయత్నిస్తున్న రామప్పంతులు వద్దకు చేరారు.
♦కుమార్తెకు ఆ పెళ్ళి చేస్తే, చనిపోతానని అగ్నిహోత్రావధాన్లు భార్య బెదిరించగా, ఆమె అన్నగారు కరటకశాస్త్రి ఆ పెళ్ళి తప్పించేందుకు ప్రయత్నిస్తాడు. తన శిష్యుడికి ఆడవేషం వేసి రామప్పంతులుకు గుంటూరుశాస్త్రులుగా పరిచయం చేసుకుని, అగ్నిహోత్రావధాన్లు కుమార్తెతో లుబ్దావధాన్లుకు పెళ్ళి తప్పించి ఆడవేషం వేసిన శిష్యునికి ఇచ్చి పెళ్ళిచేసి కన్యాశుల్కం తీసుకునివెళ్ళిపోతాడు.
♦కనిపెట్టినా, కరటకశాస్త్రి చేసే పని మంచిదన్న ఉద్దేశంతో పెళ్ళికి మధురవాణి సాయం లభిస్తుంది. ఆడవేషంలోని శిష్యుడు సాధ్యమైనంత బాధపెట్టి, నగలు, బట్టలు మూటకట్టుకుని వెళ్ళిపోతాడు.
♦ఈలోగా పెళ్ళికి తరలివచ్చిన అగ్నిహోత్రావధాన్లు బంధుకోటిలోంచి బుచ్చెమ్మను తీసుకుని గిరీశం లేచిపోతాడు. అగ్నిహోత్రావధాన్లు ఈ పరిణామాలకు ఆగ్రహం చెంది, రామప్పంతులుతో కలిసి లుబ్దావధాన్లుపై దావా తెస్తాడు.
♦ఈ కేసులో లుబ్దావధాన్లు పక్షాన్ని ధర్మాత్మునిగా, సంఘసంస్కర్తగా, వేశ్యా వ్యతిరేకిగా పేరొందిన లాయరు సౌజన్యారావు పంతులు వకాల్తా పుచ్చుకుంటాడు.
♦చివరికి నిజం తేలడంతో పాటుగా, మధురవాణి సౌజన్యారావు పంతులుకి గిరీశం నిజస్వరూపం తెలియజేయడంతో బుచ్చెమ్మను శరణాలయానికి పంపడంతో నాటకం ముగుస్తుంది
✍
సర్దేశాయి తిరుమల రావు “కన్యాశుల్క నాటకకళ” అనే విమర్శలో నాటకంలోని పాత్రల్నిరెండు వర్గాలుగా విభజించాడు .
♦మంచి పాత్రలూ, చెడ్డ పాత్రలు. మనిషిలోని మంచి,చెడ్డల మేలుకలయిక మంచితనంగానూ, చెడ్డ,మంచిల కీడుకలయిక చెడ్డతనంగానూ తెలిపారు.
♦మధురవాణి, బుచ్చమ్మ, కరటక శాస్త్రి, సౌజన్యారావు పంతులు పాత్రలు మంచివి.
♦గిరీశం, రామప్పంతులు, అగ్నిహోత్రావధాన్లు, లుబ్ధావధాన్లు చెడ్డపాత్రలు.
♦
సుబ్బి రంగస్థలంపైకి రాని “నాయిక” వంటిది. సుబ్బిని రంగం మీదకి తీసుకురాకపోవడానికి కారణం ప్రేక్షకుడిలో సెన్టిమెంటాలిటీ పుట్టకుండా చెయ్యడాని కనిపిస్తుంది.కన్నీళ్ళు ,వెక్కిళ్ళూ కనుపించనీయకూడదని నాటక కర్త ఉద్దేశం కావచ్చు.
ఇంకా ఇతర పాత్రలున్నాయి. కొందరన్నట్టు అసలు నాటకంలో కనుపించని పాత్ర గురజాడ.
♦“సామూహిక పాత్రీకరణ” అంటే, పాత్రశీలానికి ఒక్క పాత్రను గాక,
రెండుగాని అంతకంటె ఎక్కువగాని పాత్రలని ప్రతినిధులుగా నిలబెట్టే విధానం కన్యాశుల్కంలో కనుపిస్తుంది.ఇందుకు ఉదాహరణలు అగ్నిహోత్రావధాన్లు, లుబ్ధావధాన్ల పాత్రలే. గురజాడ గొప్పదనానికి ఇదొక నిదర్శనం.
♦ఈ నాటకాని ప్రసిద్ధి తెచ్చిందీ, అందరినీ ఆకర్షించిందీ గిరీశం పాత్ర.
ఇది నాయక పాత్ర కాకపోయినా నాటకమంతా పరచుకొంది.
నాటకం మొదలు, ముగింపూ ఈ పాత్రతోనే కాబట్టి రచయిత ఈ పాత్రవిషయంలో ఒక ఆద్యంతసమత పాటించాడనవచ్చు.
గిరీశంవల్ల రచయిత ఏ ప్రయోజనాన్ని ఆశించాడు?
ఇది కేవలం ఒక హాస్య పాత్రా? అనే ప్రశ్నలు తలెత్తుతాయి
మనలో. నాటకంలో గిరీశం చాలాపనులు చేసినట్టు కనుపించినా,
ఆ పనులవల్ల ఏ ప్రయోజనం, మార్పూ కనుపించదు.
♦గిరీశం సమాజంలోని దొంగ పెద్ద మనుషులకి ప్రతీక,.మాయమాటల్తో
పబ్బం గడుపుకోవడమే గాని, ఇతనికి ఒక సిద్ధాంతం, ఆశయం
ఉన్నట్టు కనుపించవు. స్వప్రయోజనం కోసం ఇతరులకి కష్టాల్నితెచ్చిపెట్టడానికి కూడా వెనుకాడడు. తాను చేసే ప్రతిపనీ అన్యాయమని తెలిసే చేస్తాడు. వేడుకొని, భయపెట్టి, నవ్వించి, ఏడిపించి, ఏడ్చి ఇతరుల్ని తన దారిలోకి తిప్పుకోగల లౌక్యుడు. నాటకంలో జరిగే సంఘటలపై వ్యతిరేకంగా వ్యాఖ్యానించే గిరీశం పాత్ర సాంఘిక, సాంస్కృతిక ప్రయోజనాల్నిఆశించి గురజాడ సృష్టించి ఉండవచ్చు.
♦“డామిట్ ! కథ అడ్డం తిరిగింది” అంటూ నాటక రంగం నుంచి నిష్క్రమించినా సమాజంలో కనుపిస్తూ నేటికీ అస్తిత్వాన్ని కాపాడుకుంటూనే ఉన్నాడు.
♦ఈ నాటకంలోని రెండవ ముఖ్య పాత్ర “మధురవాణి”.
ఈ పాత్రలో అసాధారణత, పరిణామం, శీఘ్రప్రగతీ కన్పిస్తాయి.
మొదట్లో సామాన్య వేశ్యగా కన్పించే మధురవాణి, నాటకం ముగిసేసరికి గొప్ప మనిషిగా కనబడుతుంది. ఇది గురజాడ ఇంద్రజాలం.
♦రామప్పంతులు తన బుగ్గ గిల్లినప్పుడు, “మొగవాడికైనా ఆడదానికైనా నీతి ఉండాలి. తాకవద్దంటే చెవిని బెట్టరు గదా” అని మందలించడంలోనే
ఆమె మనసు అర్ధమవుతుంది.
♦వ్యక్తి స్వాతంత్య్రాన్ని, పట్టుదలను ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ కోల్పోని గుండె నిబ్బరం గలది. విమర్శనాఙ్ఞానం, విశ్లేషణ కలది. ఎదుటి వాళ్ళగురించి ఆలోచిస్తుంది. తృతీయాంకంలో రామప్పంతులు పైన పటారం లోన లొటారం అని పసిగడుతుంది. ఇతర వేశ్యలు ధనం గుంజాలని చూస్తూంటే, మధురవాణి తనని ఉంచుకున్నవాడు బాగు పడాలనీ,
అదే తనకు ఎక్కువ గొప్పనీ చెబుతుంది.ఆమె సంస్కారవతి.
దురాచారాల్ని సహించదు. కన్యావేషంలో ఉన్నశిష్యుణ్ణి లుబ్ధావధానికి
కట్టబెట్టి, సుబ్బి పెళ్ళి తప్పించడంలో ఆమె వ్యూహాశక్తి మనకి తెలుస్తుంది. కరటక శాస్త్రితో “వృత్తి చేత వేశ్యని గనక చెయ్యవలసిన చోట ద్రవ్యాకర్షణ చేస్తాను గాని మధురవాణికి దయాదాక్షిణ్యాలు సున్న అని తలిచారా?” అనడం ప్రత్యక్షర సత్యం. నాటకం చివర కరటక శాస్త్రిని జైలు నుంచీ,లుబ్ధావధానిని మరణ శిక్ష నుంచీ తప్పిస్తుంది.
“ఆహా! ఏమి యోగ్యమైన మనిషి” అని రామప్పంతులు కూడా
అనకుండా ఉండలేక పోతాడు.
అయితే నాలుగో అంకంలో “నీకు సిగ్గులేదే లంజా!” లాంటి మాటలు
ఈ పాత్రచేత అనిపించడం సబబుగా లేదు.
♦ఆరవ అంకంలో మధురవాణి సంఘం మీద దాడి చేస్తుంది. స్త్రీస్వాతంత్ర్యోద్యమానికి మధురవాణి పాత్ర నాందిగా చెప్పవచ్చు. పొరుగువారికి సాయపడుతూ, ఈ పాపపు లోకంలో కూడా మంచి ఉందని నిరూపించిన త్యాగజీవి మధురవాణి. ఈ పాత్ర ఒక్కొక్క సారి నాటక పరిధిని దాటిపోయి విశ్వరూపాన్ని చూపిస్తుంది.
♦డబ్బు గడించి దానిపై వ్యామోహం లేకుండా ప్రేమకోసం పరితపించే పాత్ర మధురవాణి. “కాపు మనిషినై పుట్టి మొగుడి పొలంలో వంగ మొక్కలకూ, మిరప మొక్కలకూ దోహదం చేస్తే యావజ్జీవం కాపాడే తన వాళ్లైనా ఉందురేమో” అనుకోవటంలో పాత్రలో పరివర్తన కనుపిస్తుంది. దీన్ని గురజాడ హఠాత్తుగా కాక క్రమంగా వచ్చిన మార్పుగా చిత్రించడంలో తన కళాప్రతిభ, సహజత్వం చూపించారు
సేకరణ 🌹.
No comments:
Post a Comment