Saturday, November 23, 2024

 *సండే స్టోరీ*
 

*రామలింగడి తెలివి*

🍆🍆🍆

విజయనగరంలో రాజుగారి దివాణంలో విందులకు అవసరమైన కూరగాయలన్నీ రాయలివారి ప్రత్యేకమైన తోట లోనే పెంచేవారు. అదే తోటలో ఒక ప్రత్యేకమయిన మడిలో గుత్తివంకాయ కూడా పెంచేవారు. రాయల వారికి గుత్తివంకాయ కూర అంటే ప్రాణం. అందుకే ఆ ప్రత్యేకమయిన తోట. గుత్తివంకాయ కూర వండినపుడల్లా అప్పాజీ (మహామంత్రి తిమ్మరుసు) ని కూడా తనతో విందుకు పిల్చేవారు రాయలువారు. ఎప్పుడైనా తనని కూడా పిలుస్తారేమో, తను కూడా ఆ గుత్తివంకాయ కూర రుచి చూడ వచ్చునన్న ఆశతో ఎదురుచూసే రామలింగ డికి నిరాశే ఎదురయింది. వంటవాడిని రోజూ శాకపాకాలేమిటి అని ప్రశ్నిస్తూ, వంకాయ కూర వండిన రోజున భోజనశాల పరిసరాల లో తచ్చాడుతూ వుండేవాడు. అతడి అవస్థ కు జాలిపడి ఒకనాడు వంటవాడే రహస్యం గా కొంత గుత్తివంకాయ కూరను ఒక గిన్నెలో పెట్టి రామలింగడికి అందించి రుచి చూడమన్నాడు. రామలింగడికి అది ఎంతో రుచిగా అనిపించింది. అటు వంటికూర జన్మలో తను తిని ఎరుగడు.

తిన్నవాడు తిన్నట్టు ఊరుకోక రామలింగడు తన ఇంటికిపోయి తన భార్య కమలతో గొప్పలు చెప్పకున్నాడు.

రాజుగారి తోటలో అపురూపమైన గుత్తి వంకాయలు పండుతున్నాయని, ఆ కూర వండి తనకు పెట్టారని, దాని రుచి అమోఘం అని చెప్పాడు. కమలమ్మకు కూడా నోరూరింది.

"ఏమండీ! అంత మంచి వంకాయలు. ఎల్లాగైనా ఒక బుట్టెడు కోసుకురండి. మనం కూడా వండుకు తిందాం ! " అని కోరింది.

“ఓసి వెర్రిమొహమా! అది అంత సులువైన పని కాదే. రాజుగారి తోట చుట్టూ చురకత్తు లతో సైనికులు ఎప్పుడూ సహరా కాస్తూ వుంటారు. అక్కడ దొంగతనం జరిగినట్టు తెలిస్తే అప్పాజీ నేరస్తుడిని పీక తెగ వేయి స్తాడు తెలుసా? అదేమైనా మజాకా అనుకు న్నావా?" అని వారించాడు.

అయినప్పటికీ ఆమె పట్టువదలలేదు. కాళ్ళా వేళ్ళాపడి, కన్నీరు కార్చి ఎలాగైనా ఆ వంకాయలని తెమ్మని బ్రతిమలాడింది. రామలింగడు భార్య కోరికకు లొంగక తప్ప లేదు.

ఆ మరునాడు చీకటి పడగానే నక్కుతూ నక్కుతూ రాజుగారి తోట వద్దకు వెళ్ళాడు. దశమినాటి రాత్రి వెన్నెల కాస్తోంది. తోట ద్వారం వద్ద ఒక ముసలి సైనికుడు కాపలా వున్నాడు. ఒక బల్ల పైన కూర్చుని కునికి పాట్లు పడుతున్నాడు. వాడి కన్ను కప్పి, రామలింగడు మెల్లగా తోటలో దూరి వెన్నెల వెలుతురులో ఒక బుట్టనిండా వంకాయలు కోసుకుని, రెండో కంటి వాడికి తెలియకుండా ఇంటికి తెచ్చి భార్య కిచ్చాడు.

అప్పటికి రాత్రి పది గంటలు అయ్యింది. నిగ నిగ మెరుస్తూ తాజా గుత్తివంకాయలు చూనే సరికి ఆమె సంతోషంతో వుండబట్టలేక వెంటనే వాటిని తరగి, శనగపప్పు, కొబ్బరి కోరు, ఇంగువ, ఆవాలు మొదలైన దినుసుల తో మసాలా తయారు చేసి వాటిలో కూరి చక్కగా నూనెలో మగ్గపెట్టి గుత్తివంకాయ కూర తయారు చేసింది.

విస్తరి వేసి ముందు భర్తకు వడ్డించింది. విస్తరి ముందు భోజనానికి కూర్చున్న రామలింగడు మొత్తం అన్నమంతా ఆ కూరతోనే తిన్నాడు. భోజనానంతరం బ్రేవ్ మంటూ లేచి..

“అర్థరాత్రి అవుతోంది. నువ్వు కూడా త్వరగా భోజనం కానియ్యి, కూర అయితే బ్రహ్మండం గా చేశావోయ్! రాజుగారింట్లో కన్నా కూడా రుచిగా వుంది. ఊఁకానీయ్" అని భార్యతో అన్నాడు.

భార్య కూడా భోజనానికి కూర్చుంది. కాని వెంటనే ఆమెకి నిద్రపోతున్న ముద్దుల కుమారుడు గుర్తుకువచ్చాడు, "ఏమండీ ఇంత రుచి గల కూర అబ్బాయి తినకపోతే ఎలాగండి? వాడు తినకపోతే నా మనుసు అదోలా వుంటుంది. పిచ్చిమొహం, వాడు డాబా మీద నిద్రపోతున్నాడు తీసుకురండి” అని భర్తను బ్రతిమిలాడింది.

రామలింగడికి కోపం వచ్చింది. "ఏమే నీ కిదేం పిచ్చి? కుర్రాడికి కూర పెట్టాలంటావేమిటే, అది చాలా ప్రమాదం. ఒకవేళ రేపు తోటలో
వంకాయలు మాయమవడం తెలిసిన రాజు గారి భటులు వచ్చి, అనుమానంతో వాడిని అడిగితే, నిజం కాస్తా బయటపడితే మన కొంపలంటుకుంటాయి. అలాంటిదేమీ పెట్టుకోక వెంటనే తినేసి నువ్వు కూడా పైకిరా” అన్నాడు.

కాని ఆ మాతృ హృదయం కొడుకు తినకుండా తాను తినడానికి ఒప్పుకో లేదు. తన బిడకు తినిపించాలనే మొరాయించిం ది. చేసేదిలేక కొడుకుని లేపుకు రావడానికే నిర్ణయించాడు రామలింగడు. రాబోయే ప్రమాదాన్ని ఎలా ఎదుర్కోవాలా అని ఆలోచిస్తూనే వున్నాడు. అతడి కుశాగ్ర బుద్ధికి వెంటనే ఒక ఆలోచన తట్టింది.

వాళ్ళ పెరటిలో రోజూ మొక్కలకు నీరు పోసే చిల్లుల గొట్టం గల డబ్బా తీసుకున్నాడు. దాని నిండా నీరు పోసి నింపి డాబా మీదకు తీసుకువెళ్ళాడు. ఆ డబ్బాలోని నీటిని నిదురపోయే కొడుకు మీద చిల్లుల గొట్టం ద్వారా వంచాడు. పాపం ఆ పసివాడు హఠా త్తుగా మేలుకొని ఏడుస్తూ భయంతో వాళ్ళ నాన్నను కావలించుకున్నాడు. వాడి బట్టల న్నీ తడిసిపోయాయి. చలితో వణికిపోతు న్నాడు.

కొడుకు వీపు తట్టి రామలింగడు.. "భయంలేదు నాన్నా! ఇందాకటి నుండి వాన కురుస్తూంటే నువ్వు డాబా మీద పడుకున్న సంగతి అమ్మకి ఇప్పుడే గుర్తుకొచ్చిందిరా..రా నాయనా, కిందకి దిగి బట్టలు మార్చుకుందు వుగాని” అని చెప్పి, వాడిని క్రిందకు తీసుకొని పోయి తల, ఒళ్ళు తుడిచి, పొడి బట్టలు  తొడిగి వాళ్ళ అమ్మ దగ్గరికి తీసుకువెళ్ళాడు.

పిల్లవాడిని లేపి తీసుకువచ్చినందుకు సంతోషించి అతడి భార్య వాడికి కూడా గుత్తి వంకాయ కూరతో అన్నం పెట్టింది. దానిని లొట్టలు వేస్తూ వాడు కూడా తిన్నాడు. తిన్న వెంటనే మళ్ళీ నిద్రాదేవి ఒడిలోకి ఒరిగిపో యాడు. రామలింగడి భార్య తృప్తిగా తాను కూడా భుజించింది.
తెల్లవారింది. వంగతోటలో గుత్తి వంకాయలు మాయమయిన సంగతి బయటపడింది. తోటలో దొంగతనం జరిగిందన్న సంగతి రాజుగారి చెవిన పడింది. వెంటనే మహా మంత్రి ఆప్పాజీని రప్పించి ఆ దొంగతనం జరిగిందో విచారించి, ఎలా దోషిని పట్టుకుని తగిన విధంగా శిక్షించ వలసిందని ఆజ్ఞాపిం చాడు. అప్పాజీ ఆదివరకటి అనుభవాల ఆధారంగా ఇది తప్పక రామలింగడి పనే అయి వుంటుందని అనుమానించి విచారణ ప్రారంభించారు. తోటమాలి, వంటవాడు మున్నగు వారిని విచారించి, రామలింగడిని కూడా రప్పించి మాయమయిన వంకాయల సంగతి ప్రశ్నించారు.

“రామ రామ! నాకేమీ తెలియదు. బాగుందండి. మహామంత్రీ ప్రతి చిన్న విషయానికీ నా మీదనే అనుమానమా? మరీ ఇంత కూరగాయల దొంగతనానికి కూడా నేనే పాలు పడ్డానంటారా? ఇదేమీ బాగోలేదండీ. నా మీద మీ అభియోగం నిరాధారమూ, ఆన్యాయమూ కూడాను” అని రామలింగడు వాదించాడు.

అయినాసరే తిమ్మరుసు నమ్మలేదు. రామ లింగడిని ప్రశ్నించడం అయ్యాక అతడిని తన ఆజ్ఞ అయ్యేవరకు దివాణం లోనే వుంచమని భటులకు చెప్పి, చిన్నపిల్లాడు అబద్దాలు చెప్పలేడని ఆలోచించి రామలింగడి అయిదా రేళ్ళ కుమారుడిని తీసుకురావలసిందిగా కబురు పంపాడు.

కుర్రవాడు రాగానే వాడికి మామిడిపండు ఇచ్చి తినమన్నాడు. వాడు చక్కగా తిన్నాక “చూడుబాబూ! ఓ సంగతి అడుగుతాను. అబద్దం ఆడకుండా నిజం చెప్పాలి. నిన్నరాత్రి ఏమి కూరతో అన్నం తిన్నావు బాబూ?” అని ప్రశ్నించాడు.

*కథల ప్రపంచం* 

“రాత్రండీ! రాత్రి ఆఁ వంకాయ కూర వేసి పెట్టిందండి మా అమ్మ. భలే రుచిగా వుందండి” అని జవాబిచ్చాడు ఆ కుర్రవాడు.

ఇదంతా గమనిస్తున్న రాయలవారి వంక తిరిగి అప్పాజీ “నా అనుమానం నిజమైంది చూశారా? రామలింగడి నేరం ఋజువు అయ్యింది. ఇతడికి తగిన శిశిక్ష విధించవలసి నదిగా ఏలినవారికి మనవి” అన్నాడు.

అప్పాజీ మాటలు విన్న రామలింగడు చర్రున లేచాడు. తీవ్రమయిన తన అభ్యంతరాన్ని తెలుపుకూ ఇలా అన్నాడు.

“మహామంత్రి: మీరు తొందరపడి ఒక నిర్ణయానికి రావద్దని మనవి. పసి పిల్లవాడి అమాయకపు సాక్ష్యాన్ని నమ్మి నాకు శిక్ష విధించమనడం న్యాయం కాదు. వాడికి సమ యం, సందర్భం తెలియదు. సాక్ష్యాన్ని క్షుణ్ణంగా విచారించండి. ఇంకా వివరంగా ఆడగండి. వాడు వంకాయకూర సరిగ్గా ఏ రోజు తిన్నాడో- ఆనాడు వెన్నెల కాసిందో, లేక వర్షం కురిసిందో వివరాలన్నీ సరిగ్గా వాకబు చేయండి.”

“సరే లేవయ్యా? అదీ అడుగుతాను. నీ బండారం బయటపడకుండా వుంటుందా?” అంటూ అప్పాజీ బాలుడి వైపు తిరిగి..

“బాబూ! నువ్వు వంకాయ కూర తిన్న రాత్రి వెన్నెల కాసిందా? వర్షం కురిసిందా?” అని అడిగాడు.

వెంటనే వాడు తడుముకోకుండా “రాత్రి బాగా వాన కురిసిందండీ మా డాబా మీద పడుకుని
ఆ వర్షంలో తడిసిపోయాను కూడానండి మా 
నాన్నగారు మా అమ్మను కోప్పడ్డారు కూడా ను, నన్ను ఒంటరిగా పైన పడుకోనిచ్చినందు కు. మా నాన్నగారే నన్ను క్రిందికి దింపి, ఒళ్ళు తుడిచి పొడిబట్టలు తొడిగించారు. అప్పుడు మా అమ్మ వంకాయ కూర వేసి అన్నం పెడితే తిన్నానండి" అని జవాబు ఇచ్చాడు.

అప్పాజీ ఆశ్చర్యానికి అంతులేదు. ఇంకేం మాట్లాడతాడు? వంకాయలు మాయమైన రాత్రి వెన్నెలకాసింది కాని వర్షం లేదుగా. తన అభియోగాన్ని ఉపసంహరించుకున్నాడు. రాయల వారూ, అప్పాజీ కూడా తమ తొందరపాటుకు రామలింగడికి విచారం వ్యక్తం చేసారు.

తమ పొరపాటుకి పరిహారంగా రాయలవారు దివాణం కోసం వంకాయలు కోసినప్పుడల్లా ఒక బుట్టెడు వంకాయలు రామలింగడి ఇంటికి కూడా పంపేటట్లు శాశ్వతంగా ఏర్పాటు చేశారు.

🍆🍆
సమాప్తం

No comments:

Post a Comment