*తరగని కుండ - సంయుక్త అక్షరాలు లేని కథ* - పునః కథనం - డా.ఎం.హరికిషన్-94410 33222-కర్నూలు
**************************
ఒక ఊరిలో నారాయణ అని ఒక ముసలోడు వుండేవాడు. ఆయన చానా మంచోడు. ఎప్పుడూ ఇతరులకు సహాయం చేయాలి అనుకునేవాడు. ఊరిబైటవున్న చింతచెట్టు కింద ఒక చిన్న కొట్టమేసి ఒక పెద్దబాన పెట్టి ఆ దారిన వచ్చేటోళ్ళకీ, పోయేటోళ్ళకీ చల్లని నీళ్ళు అందించి సంతోషపడేవాడు.
ఒకరోజు ఒక సాధువు అక్కడికి వచ్చాడు. ఎండకు ఆ ముసలాయన బిందెతో నీళ్ళు తెచ్చి బాన నింపుతావుంటే చూశాడు. ఇతరుల కోసం సాయపడతావుంటే బాగా మెచ్చుకున్నాడు.
నీళ్ళు తేవడానికి ముసలాయన పోగానే బానను చిన్నగా చేతితో తట్టి వెళ్ళిపోయాడు.
ముసలాయన దారిన పోయేవాళ్ళందరికీ నీళ్ళు ఇవ్వసాగాడు. ఒకగంట తరువాత బానలో నీళ్ళు పోద్దామని బిందె ఎత్తి బాన మూత తీశాడు. ఇంకేముంది... బాన నిండుగా నీళ్ళు వున్నాయి. ఆ ముసలాయన “ఇదేందబ్బా... ఇన్ని నీళ్ళున్నాయి" అనుకుంటా బానలోంచి ఒక బిందె నీళ్ళు మరలా బయటికి తీశాడు. కానీ నీళ్ళు దాని నిండా అలాగే వున్నాయి. అప్పుడు ఆ ముసలాయనకి ఆరోజు సాధువు వచ్చి పోయినేది మతికి వచ్చింది. అంతా ఆయన మహిమనే అనుకున్నాడు.
ఆ రోజునుండీ ఆ ముసలాయనకు నీళ్ళు తెచ్చే పని తప్పిపోయింది. ఎండాకాలమయినా, చలికాలమయినా, వానాకాలమయినా... ఆ కుండ ఎప్పుడూ నిండుగానే వుండేది.
అలా కొన్ని ఏళ్ళు గడిచాక ఆ ముసలాయనకు చనిపోయే రోజు దగ్గరపడింది. చనిపోయే ముందు కొడుకును పిలిచి ఆ బాన విషయం చెప్పి, నా తరువాత గూడా నీవు ఈ పనిని కొనసాగించమని చెప్పాడు.
ముసలాయన చనిపోయిన తరువాత కొడుకు బాన దగ్గర పెట్టుకొని ఆలోచించాడు. ముసలాయన లెక్క వాడు మంచోడు గాదు. దాంతో ఆ కుండతో డబ్బు సంపాదించాలని అనుకొన్నాడు.
నీళ్ళు దొరకక కరువుతో బాధ పడుతున్న దేశాలకు పోయి చెంబు రూపాయి, రెండు రుపాయలకు అమ్మడం మొదలు పెట్టాడు. అలా చానా డబ్బులు సంపాదించి అన్నీ ఒక డబ్బాలో వేసుకొని ఇంటికి వచ్చాడు.
సంతోషంగా ఇంటిలో కూచోని ఎన్ని డబ్బులు వచ్చాయో లెక్క బెడదామని డబ్బా తెరిచాడు. లోపల డబ్బులు లేవు. ఉత్త నీళ్ళు వున్నాయి. దాంతో వానికి కోపమొచ్చి ఆ కుండను ఇంటి బయటకు విసిరి కొట్టాడు. దాంతో ఆ కుండ పగిలిపోయింది. అందులోంచి నీళ్ళు రావడం ఆగలేదు. ఆ నీళ్ళు అలా వచ్చీ వచ్చి అక్కడ పెద్ద చెరువు తయారైంది.
చుట్టుపక్కల జనాలంతా ఆ నీటిని తోడుకోని వాడుకోసాగారు. పంటలు పండించుకోసాగారు. కానీ ఆ నీళ్ళు కొంచం గూడా తగ్గడం లేదు. ముసలాయన ఎలాగయితే అందరికీ సేవ చేశాడో అలాగే చెరువుకూడా అందరికీ నీళ్ళిచ్చి ఆదుకోసాగింది. జరిగిన విషయమంతా తెలుసుకున్న ఆ ఊరి జనాలు తలాయింత చందాలు వేసుకొని ఆ చెరువు పక్కనే ముసలాయనకు గుడి కట్టారు.
***************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
***************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
No comments:
Post a Comment