Wednesday, November 27, 2024

****అదే భక్తి అని, అదే ఆధ్యాత్మికత అని పొరబడవద్దు. పాపం ఉన్నచోట పరమాత్మ ఉండడు.

 *దేవుడికి పూజలు చేసేవారంతా దైవభక్తులైపోరు.* 

*నిజంగా దేవుడి మీద ప్రేమ ఉన్నవారే దైవభక్తులు.*

*భక్తి ఉన్నవాడు పాపం చేయడు, చేయలేడు. ఎందుకంటే దైవం ధర్మప్రియుడు.*

*ధర్మాన్ని తప్పితే భక్తి అనిపించుకోదు. భక్తికి ధర్మం ప్రాణం.*

*గుళ్ళూ గోపురాలు తిరిగేవారు, దేవుడి పూజలు చేసేవారందరూ భక్తులేనని చెప్పడానికి లేదు.*

*తమ కోరికలను తీర్చుకోవడానికి ఎవరికి వీలైన మార్గాన్ని వారు ఆశ్రయిస్తారు, అలా కొందరు దేవుడ్ని కొలుచుకొంటారు.*

*వారికి దేవుడి పట్ల అసలైన శ్రద్ధ ఉండదు. వారందరినీ 'భక్తులు' అనే వర్గం క్రింద జమకట్టకూడదు.*

*అలాగే ప్రజల్లో తమ కోరికల కోసం దేవుడి పట్ల చూపించే ఆసక్తిని వాడుకొని సొమ్ము చేసుకొనే వ్యాపారులు ఉంటారు.*

*వారినే భక్తులనుకోవడం పొరపాటు. పాపం ఉన్నచోట భక్తి పండదు. దైవశక్తి జాగృతం కాదు.*

*దేవాలయాల దగ్గర చేరే గుంపులందరికీ దైవత్వం పట్ల ఆసక్తి ఉండదు.*

*భక్తుడు భగవంతుని నామ, గుణ మహిమల పట్ల ప్రేమ కలిగి, నిరంతరం ఆ చింతనలోనే కాలం గడుపుతూ సత్యం, అహింస, శుచి, దయ వంటి సద్గుణాలను అలవరచుకుంటాడు.*

*నిజంగా భగవంతుని అనుగ్రహం ధర్మపరునికే లభిస్తుంది. ధర్మం, ప్రేమ ఈ రెండూ కలిస్తేనే 'భక్తి'.*

*'మంది' చేరే చోట సొమ్ము చేరుతుంది. ఆ సొమ్ముని స్వాహా చేయడానికి అక్రమార్జనపరులూ చేరతారు.*

*అదేవిధంగా దేవుడి సొమ్మును స్వాహా చేసే మహాపాపాత్ములూ బయలుదేరతారు.*

*అలాంటి కొంతమంది దేవాలయాల్లో ఉన్నంతమాత్రాన భక్తులై పోరు. వారి పాపాలూ పరిహరింపబడవు.*

*సరికదా బయటచేసే మోసాల కన్నా దైవత్వాన్ని మోసగించి స్వీకరించడం అనే పాతకం మరీ బలవత్తరమైనది గనుక భవిష్యత్తులో వారూ, వారి తర్వాత తరాలవారూ బాధాకరమైన జీవితాన్ని అనుభవించితీరుతారు.*

*తాత్కాలికంగా వారు లబ్ది పొందినట్లు కనబడినా, భవిష్యత్తులో వారు నరక సమీపమైన వేదనను అనుభవిస్తారనడంలో సందేహం లేదు.*

*అటువంటి వారిని చూసి అదే భక్తి అని, అదే ఆధ్యాత్మికత అని పొరబడవద్దు. పాపం ఉన్నచోట పరమాత్మ ఉండడు.*
🍁🍁🍁 🌹🕉️🌹 🍁🍁🍁

No comments:

Post a Comment