(నేటి గురువారం స్పెషల్ స్టోరీ). సుడాన్ దేశాన్ని 1990 సంవత్సరంలో భయంకరమైన కరవు పీడించింది. ఆకలి దప్పులతో ప్రజలు అలమటించిపోయారు.
ఆ కరవు తీవ్రతను ప్రతిబింబించిన ఫొటో ఒకటి ఆ రోజుల్లో ప్రపంచంలో ప్రకంపనలు సృష్టించింది.
ఎముకల పోగులా ఉన్న ఓ పసిపాప చిన్న రొట్టెముక్కను- తన వెనక కాచుకొని కూర్చొన్న రాబందు ఎక్కడ ఎత్తుకుపోతుందోనన్న భయంతో దాన్ని గుండెలకు అదుముకొన్న ఫొటో అది.
నిజానికి రాబందు వేచి చూస్తున్నది- రొట్టె ముక్క కోసం కాదు. ప్రాణాలు గుటుక్కుమంటే ఆ పాపను పీక్కుతిందామని!
ఇప్పటికీ ఎంతోమందికి ఆ ఫొటో గుర్తుండిపోయింది.
పరమ హృదయవిదారకమైన ఆ దృశ్యాన్ని అద్భుతంగా చిత్రీకరించిన దక్షిణాఫ్రికా ఫొటోగ్రాఫర్ కెవిన్ కు లెక్కలేనన్ని ప్రశంసలు దక్కాయి. సన్మానాలు జరిగాయి. కెవిన్ పేరు ప్రపంచమంతటా మారుమోగింది.
At that moment (సందడిలో) కెవిన్ కు ఓ ఫోనొచ్చింది.
'సార్! ఆ పాప ఏమయింది? ఉందా,చనిపోయిందా?' అని అడిగారెవరో.
'ఏమో మరి! ఆ విషయాన్ని నేను పట్టించుకోలేదు' అన్నాడు కెవిన్.
'ఓహో! అయితే రోజు పసిపాప చావుకోసం కాచుకొన్నది రెండు రాబందులన్నమాట! ఒకటి- ఫొటోలో కనబడుతున్నది,
రెండోది- ఈ ఫొటో తీస్తున్నది' అనేసి ఫోన్ పెట్టేశాడు అవతలి వ్యక్తి.
ఆ ఒక్క వాక్యం ఎంతటి తీవ్ర ప్రభావాన్ని చూపిందంటే- 1993లో కెవిన్ తన 33వ ఏట ఆత్మహత్య చేసుకున్నాడు.
మహాయోధులమో, అభిమానధనులమో కాదు కాబట్టి... మాట మనల్ని పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు.
ఏ లారీయో గుద్దేసి పోతే రక్తం ఓడుతూ కొన ఊపిరితో ఓ మనిషి కొట్టుమిట్టాడుతుంటే హాస్పిటల్ కు చేరుద్దామనో, ఆంబులెన్స్ ను పిలుద్దామనో అనుకోకుండా ఆ వ్యక్తితో సెల్ఫీ దిగుదామని ప్రయత్నించే మనలోని 'కెవిన్' కేసి, ఆ మనిషి చూసే చివరిచూపు చాలు- మనల్ని జీవచ్ఛవాల్ని చేయడానికి!
-ఎర్రాప్రగడ రామకృష్ణ.

No comments:
Post a Comment