Wednesday, November 20, 2024

 *ప్ర : ఒక సామాన్య రజకుని మాట పట్టించుకొని సీతమ్మను అడవులపాలు చేయడం రాముని వంటి వానికి తగునా ?*


జ : రామాయణం ప్రకారం - 'సామాన్య రజకుని మాట' - అనే కథ లేదు.
పట్టాభిషేకానంతరం శ్రీరాముడు సీతమ్మ చాలాకాలం సుఖంగా జీవించారు. ఒక రాత్రి వేళ వారు సుఖాసీనులై మాట్లాడుకుంటూండగా, తనకు వాల్మీకుల వారి ఆశ్రమం చూడాలని ఉందనీ, అక్కడ కొంతకాలం నివసించాలని ఉందనీ - గర్భవతిగా నున్న సీతమ్మ కోరుకుంటుంది. ఆ సమయంలో - సభా భవనంలో పురజనుల అభిప్రాయం తెలుసుకునే సమావేశం జరగనుంది. శ్రీరాముడు సీతతో సంభాషించాక, ఆ సమావేశానికి వెళ్ళాడు. అక్కడ అయోధ్య మంత్రి అయిన భద్రుడు, ఎంతో రామప్రేమ ఉన్నప్పటికీ, ప్రభుత్వ ధర్మాపాలనలో భాగంగా, అయోధ్య ప్రజల అభిప్రాయాన్ని చెప్తాడు. అందరూ, శృంగాటకముల (జంక్షన్స్) దగ్గర కూడా "సీతమ్మ ఏడాదిపాటు లంకలో ఉన్నప్పటికీ శ్రీరాముడు ఏలుకున్నాడు. ఎంతటి విమోహి?" అని అనుకుంటున్నారన్న విషయం చెప్పాడు.
'దీనికి పరిష్కారంగా మీ అభిప్రాయమేమిటని' రాముడు న్యాయవేత్తల్ని ప్రశ్నిస్తాడు. దానికి వారు మౌనంగా ఉంటారు. అది అర్థం చేసుకున్నాడు రాముడు. ఆ రోజుల్లో ప్రజాభిప్రాయం ఎలాంటిదైనా దానికి విలువనివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. రాజుకి వ్యక్తిగత జీవితం కన్నా, ప్రజల వద్ద బాధ్యతగా స్పందించాల్సి ఉంది. ఇది పరంపరాగత రాజధర్మం.
సమావేశం చాలించి, లక్ష్మణుని పిలిచి, గుండె ఱాయి చేసుకొని, సీత వాల్మీకుల వారి ఆశ్రమం చూడాలని అంది కనుక, మరురోజు సకల మర్యాదలతో ఆశ్రమానికి తీసుకువెళ్లమ'ని ఆజ్ఞాపిస్తాడు. అంతేగానీ అడవుల్లో వదిలి రమ్మనలేదు. సీతమ్మను తాను శంకించలేదు.
రామో విగ్రహవాన్ ధర్మః. లక్ష్మణుడు వాల్మీకి ఆశ్రమానికి తీసుకువెళ్లి, ఆశ్రమవాసుల రక్షణలో అమ్మవారిని ఉంచాడు.
అడవిలో ఒంటరిగా వదల్లేదు.

No comments:

Post a Comment