Thursday, November 28, 2024

****సమభావన అంటే ప్రేమభావన

 *మనిషి స్వభావం చాలా చిత్రమైనది. బండరాయిలో శిల్పాన్ని చూస్తాడు. చెట్ల ఆకుల్లో ఔషధగుణాలు చూస్తాడు. 

కాని, తోటి మనిషిని మనిషిగా చూడడు. మానవత్వం మరచిపోయి, తనకన్నా తక్కువ స్థాయి వారిని ఎంతో హీనంగా చూస్తాడు.*

*మనిషి సంఘజీవి! ఒంటరిగా జీవితం సాగించలేడు. ఎంత గొప్పవారైనా తనకన్నా తక్కువ స్థాయి వారిపై ఆధారపడవలసిందే. 

ఉన్నత పదవుల్లో ఉన్నవారు చిన్న పనులు చేసుకుంటూ జీవించేవారిని చిన్నచూపు చూడకూడదు! 

నిజానికి ఈ సమాజంలో ప్రతి వ్యక్తీ ప్రత్యేకమే. అందరిపట్లా సమభావం కనబరచాలి గాని హీనభావం ఉండకూడదు.*

*మనిషి నిత్యం ఆరాధించే ధైవానికి ఎలాంటి పక్షపాతవైఖరీ లేదు.* 

*రామాయణంలో శ్రీరాముడు ప్రతి ఒక్కరినీ తన బిడ్డలుగా భావించి పరిపాలన సాగించాడు. అరణ్యంలో చెట్లను, పక్షులను చివరికి రాక్షసులను కూడా తన ప్రేమతత్వంలో ముంచి ఉత్తముడిగా నిలిచాడు. ఆ భగవంతుడికి సర్వమానవాళిపై అపారమైన దయ ఉంది.*

*ఆయనకు ఏ జీవుడిపైనా రాగద్వేషాలు కాని, ఇష్టం గానీ, అయిష్టం గానీ లేవు. కుండపోతగా వాన కురుస్తూంటే శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని గొడుగులా ఎత్తి పట్టుకుని గోవులతో సహా ఆబాల గోపాలాన్ని రక్షించాడు. 

పాండవ రాయబారిగా హస్తినాపురానికి వెళ్ళినప్పుడు శ్రీకృష్ణుడు విదురుడికి అతిథిగా వెళ్ళాడు. కౌరవులకు విదురుడు తక్కువ కులంవాడు అనే భావం ఉంది. తన భక్తిలో కులమతాలకు చోటు లేదనే సత్యాన్ని ప్రకటించేందుకు విదురుడి ఆతిథ్యాన్ని స్వీకరించాడు ఆ పరమాత్మ.*

*సమదృష్టి కలిగినవారు ప్రశాంత మనుస్కులై ఉంటారు. అందరిపట్లా ప్రేమభావం కలిగి ఉంటారు. భేదభావం కలవారు నిత్యం పగ, ప్రతీకారాలతో రగిలిపోతుంటారు. దుర్యోధనుడు ఆ కోవకు చెందినవాడే. అతడు రారాజు అయినా అంతిమక్షణం వరకు పాండవులపట్ల ద్వేషం పెంచుకుని అశాంతితో బతికాడు. 

భేదభావం కలవారికి ధర్మంపట్ల ఎలాంటి ఆసక్తి ఉండదు, వారికి శాంతి రుచించదు. మంచి మాటలు ఎన్ని చెప్పినా వారు వినరు. నిత్యం తమ ధోరణి లోనే జీవించి దుష్ఫలితాలు పొందుతారు. అంతిమంగా వినాశనం పొందడం తప్ప మరోమార్గం వారికి లేదు.*

*’నన్ను సర్వ భూతాల్లోను, సర్వ భూతాల్ని నాలోను చూసేవాడు ఎప్పటికీ నా నుంచి వేరుకాడు, నేను అతడినుంచి వేరుకాదు-‘ అని గీతలో పరమాత్మ బోధించాడు.* 

*అందుకే అందరినీ సమదృష్టితో చూడాలి. అందరూ మనల్ని ప్రేమిస్తూ, గౌరవిస్తూ ఉంటే మనకెంతో సంతోషంగా ఉంటుంది. అలాంటి సంతోషం, గౌరవానికి మనం అర్హత పొందాలంటే మనం కూడా ఎదుటివారిని అభిమానించాలి. గౌరవం ఇస్తేనే గౌరవం తిరిగి లభిస్తుంది. అవమానకరంగా మాట్లాడితే దుష్ఫలితాలు అనుభవించక తప్పదు.*

*రామకృష్ణ పరమహంస పేద, ధనిక తారతమ్యాలను పాటించలేదు. స్త్రీలను, పురుషులను సమానంగా భావించేవారు.*
*ఆయన శిష్యుడైన వివేకానందస్వామి దరిద్రంలో బాధపడే సాటిమనిషిని నారాయణుడిగా భావించాలని బోధించేవారు.* 


*ప్రభువైనా చండాలుడైనా ఒక్కటే అన్నాడు అన్నమయ్య. ఏ కొండకోనల్లోనో పుట్టి ప్రవహిస్తుంది జలధార. మార్గమధ్యంలో అన్నింటినీ చేరి జీవకళ నింపుతుంది. అలాగే ఎవరో వేసిన విత్తనం నుంచి చెట్టు ఎదిగి అందరికీ ఫలాలు అందిస్తుంది. ఇలాంటి ప్రకృతి ధర్మాన్ని ప్రతి మనిషీ అలవరచుకోవాలి.*

*సమభావన అంటే ప్రేమభావన. ఆ భావనతో మనం తోటివారిని కరుణ, దయ, ఉపకారం వంటి దైవీ గుణాలతో ఆనందపరచాలి. అప్పుడే జన్మ సాఫల్యమవుతుంది.*
    

No comments:

Post a Comment