నారద భక్తి సూత్రములు
42 వ సూత్రము
"తదేవ సాధ్యతాం తదేవసాధ్యతామ్"
అదియే సాధించాలి అదియే అందుకోవాలి.
భక్తులకు భగవంతుని సారూప్యం పొందిన భక్తవరేణ్యుల సహవాసం,వారి కృపాసౌభాగ్యం అవశ్యం.భగవత్ ప్రేమ కావాలంటే భాగవత శ్రేష్ఠులను సేవించాలి.సత్సంగత్వం వల్ల పాపజాలం పటాపంచలై అనన్య భక్తి కల్గుతుంది.
పరమప్రేమ భక్తితత్త్వం హృదయ సంబంధమైనది, సద్గురువు ద్వారా భక్తి తత్వం పొందిన వారికే పరమప్రేమ భక్తితత్త్వం తెలుస్తుంది,మానస,వాచా,కర్మణా భక్తుడు భక్తికై పరితపించాలి.భక్తి భావనా సుధను వర్షించాలి,అప్పుడు భగవత్ శ్రేష్ఠుడైన గురువు భగవంతుని దగ్గరకు వెళ్లే సులభమైన పరమప్రేమ భక్తి తత్త్వమైన మార్గాన్ని చూపుతాడు
అది శాస్త్రాలకు,తర్కాలకు అందదు, అది అనిర్వచనీయమైన అనుభవైకవేద్యం.
భగవంతుని ప్రేమ తత్వం ప్రియురాండ్లకే తెలుస్తుంది ( పరమాత్ముడు ఒక్కడే పురుషుడు అతడే పురుషోత్తముడు),ప్రాణికోటి అంతా స్త్రీ తత్వమే కనుక ప్రతీ భక్తుడు ప్రియురాండులై పరమాత్మ యొక్క ప్రేమ తత్వాన్ని పొందడమే జీవిత పరమావధిగా సాధనా జీవనం గడపాలి గోపికలవలె.
43 వ సూత్రము
"దుస్సంగః సర్వథైవ త్యాజః"
దుర్జన సాంగత్యం సర్వదా త్యజించాలి.
సత్సాంగత్యం వలన భగవత్ కథాశ్రవణం,భగవత్ చర్చ,భగవత్ ప్రీతి,బ్రహ్మచర్య అబ్యాసం,శమం,దమం,శాంతి మొదలైన సద్వృత్తులు పొంది మానవుడు మహనీయుడవుతాడు.
దుస్సాంగత్యము వలన దుష్ట సాహితీపఠనం,విషయ వాంఛ విజృంభణ,పరనింద,భోగాసక్తి మొదలగు దుష్ప్రవృత్తులు కల్గి అసురీ ప్రవృత్తుల విజృంభణ తో దైవీ ప్రవృత్తుల నశిస్తాయి.
సామాన్యులకే దుస్సాంగత్యము దూష్యం అయితే భక్తుల విషయం లో ఇది మహాపకారి.
దుస్సాంగత్యము అంటే కేవలం దుర్మార్గులైన వ్యక్తులతో సంబంధమే కాదు,కామ మద మోహ లోభాది ఆలోచనలు కూడా ఇందులోకివస్తాయి.ఇవి భగవత్ భక్తికి ఆటంకాలు,కంటకాలు.
మనసు ఆలోచించిన దానిని బుద్ధి నిర్ణయం చేస్తుంది,బుద్ది బలహీనమైతే అది నీచ నిర్ణయాలు తీసుకుంటుంది కనుక బుద్దిని తన ఆధీనంలో సుశిక్షణాయుతంగా నిలబెట్టుకోవాలి, ఇది భక్తుడికి అనన్య నామసంకీర్తన వల్ల, సత్గ్రంధ పఠనం వల్ల,సత్సగత్యం వల్లన లభిస్తాయి.
No comments:
Post a Comment