Saturday, November 23, 2024

 Vedantha panchadasi:
ప్రధాన క్షేత్రజ్ఞ పతిర్గుణేశ ఇతి హి శ్రుతిః ౹
అరణ్యకేఽ సంభ్రమేణ హ్యంతర్యామ్యుపపాదితః ౹౹103౹౹

103. ఈశ్వరుడు జీవులకు ప్రకృతికి ప్రభువనీ గుణములను కూడా నియమించుననీ శ్రుతి ప్రకటించును.అరణ్యకమున ఈశ్వరుడు అంతర్యామి అని వర్ణింపబడెను.

వ్యాఖ్య :శ్వేతాశ్వర  ఉప.6.14;
బృహదారణ్యక   ఉప.3.7;
కఠ  ఉప.2.33.సాంఖ్యుల మతమున పురుష సాన్నిధ్య మాత్రమున ప్రకృతి పరిణామము నొందును.యోగులమతమున ఈశ్వరుడు ప్రకృతిని నియమించును.

శుద్ధ బ్రహ్మము అసంగము, అక్రియము.అది సృష్టి చేయదు అది చతుష్పాత్తు అనగా పరిపూర్ణము.అందువలన మాయా విశిష్టుడయిన ఈశ్వరుడు అవసరం.ఆయనయే జగత్కర్త.

మాయ:ఇది శుద్ధ చైతన్యము నాశ్రయించిన పాదమాత్ర ప్రమాణమయినది.
శుద్ధ చైతన్యమనగా జీవ-ఈశ్వర భేదం లేనిది.మాయ-అనాది.

దీని ప్రభావము వలననే
 జీవ-ఈశ్వర భేదం సిద్ధించింది.కనుక వారినుండి మాయ పుట్టలేదు.

మిగిలినది శుద్ధ చైతన్యము.అది నిర్వికారము.దాని వలన మాయ పుట్టిందనరాదు.అంటే అది కర్తృత్వం మొదలయిన గుణాల వలన సవికారం అవుతుంది.పైగా మోక్ష సమయంలోనూ మాయ ఉన్నట్లు అవుతుంది.శుద్ధ చైతన్యం గదా మన స్వరూపము.అపుడు గూడా మాయ ఉన్నదంటే మోక్షము వ్యర్థమవుతుంది.కనుక మాయ అనాది.

నిర్వికార శుద్ధ బ్రహ్మమునుండి జగదుత్పత్తి అగుటలేదు.ఏలనగా శుద్ధ బ్రహ్మము అసంగముగను క్రియారహితముగను యున్నది.ఈ అనాది శుద్ధ బ్రహ్మములో అనాది కల్పిత మాయ ఉంది.

ఈ మాయకు బ్రహ్మముతో అనాది కల్పిత సంబంధం ఉన్నది. కేవలము ఈ కల్పిత మాయనుండియు జగదుత్పత్తి జరగదు.కాన బ్రహ్మము మాయ ఈ రెండింటి కల్పిత సంబంధముచే శుద్ధబ్రహ్మము,సర్వజ్ఞుడు మరియు ఈశ్వరుడుగా పిలవబడుచున్నాడు.

ఈ మాయావిశిష్టుడైన ఈశ్వరుని యొద్దనుండి జగదుత్పత్తియగు చున్నది.కాన మాయ -ఈశ్వరుడు-భోక్తయైన జీవుడు-సృష్టి విధానము వీని స్వరూపములను ప్రతిపాదించడం జరుగుచున్నది.  

No comments:

Post a Comment