Thursday, November 28, 2024

 Vedantha panchadasi:
అత్రాపి కలహాయన్తే వాదినః స్వస్వయుక్తిభిః ౹
వాఖ్యాన్యపి యథాప్రజ్ఞం దార్ఢ్యాయోదాహరన్తి హి ౹౹104౹౹

104.  ఈశ్వరుని విషయమున కూడా వివిధ తాత్త్వికులు తమ తమ తర్కములచే వివిధ వాదములతో కలహింతురు.తమ తమ ప్రతిభకు తగినట్లు శ్రుతి వాక్యములను కూడా దార్ఢ్యార్థము ఉటంకింతురు.

క్లేశకర్మవిపాకైస్తదాశయై రప్యసంయుతః ౹
పుంవిశేషో భవేదీశో జీవవత్సోఽ ప్యసంగచిత్ ౹౹105౹౹

105.  యోగసూత్రకారుడైన పతంజలి మతమున ఈశ్వరుడు క్లేశకర్మ విపాక ఆశయములు స్పర్శింపని ఒక విశిష్ట పురుషుడు. పురుషుల వలనే ఈశ్వరుడు అసంగుడు చిద్రూపుడు.

వ్యాఖ్య:  యోగసూత్రముల సమాధి పాదము సూ.24. 
అవిద్యా,అస్మితా,రాగద్వేషములు, అభినివేశము అనునవి అయిదు క్లేశములు.
శుక్లము,కృష్ణము,శుక్లకృష్ణము అని కర్మ మూడు విధములు (పుణ్య,పాప,పుణ్యపాపమిశ్రమ కర్మ)
జాతి,ఆయువు,భోగము అనునవి మూడు విపాకములు.
ఆశయమనగా సంస్కారములు.

సాంఖ్యులకు యోగులకును పురుషుడు భోక్త మాత్రమే కర్తకాడు.కర్తృత్వము సుఖదుఃఖములు ప్రకృతి వికారమగు బుద్ధి లక్షణములు.

బుద్ధితో తాదాత్మ్యము వలన పురుషుడు తానే కర్తయని భ్రమించును.సమాధి ద్వారా తన భిన్నత్వమును తెలిసికొని మోక్షము నొందును.

పురుషుడు(ఆత్మ) స్వాభావికంగా
అసంగుడు.అసంగ వస్తువనగా ఏదైతే దేనియందుగూడి యున్నప్పటికీ తన అసంగత్వమును వీడదో అది అసంగవస్తు వనబడును.

స్వస్వరూపమైన ఆత్మ,
కల్పిత వస్తువులయిన అహంకారం మొదులుకొని స్థూలదేహ పర్యంతము కల్పిత అభిమానంబుతో
"నేను నేను"అని,ఉన్నప్పటికి తన అసంగత్వమును వీడలేదు.
కాన సంగత్వము మాయికమని తెలియ వలయును.

ఆత్మకు సంగత్వము సత్యమే అగుచో మోక్షము వచ్చుటకే వీలు లేదు.కాన సంగత్వము అసత్యమైనందుననే "తత్త్వమసి" ఇత్యాదిశ్రుతులు నీవే బ్రహ్మమని తేల్చుచున్నవి.          

No comments:

Post a Comment