జాతకత్మాది విషయము-శ్రీ విష్ణు పురాణము
Part 33
జౌర్యుడిలా చెప్తూన్నాడు
పుత్రజననమైనదని తెలిసిన వెంటనే తండ్రి కట్టుబట్టలతో స్నానం చేయాలి. జాతకర్మాది నాందీ శ్రాద్ధం (వృద్ధినిమిత్తం) ఆచరించాలి. దీనిలో ముఖ్యాంశాలేమిటంటే...తూర్పు/ఉత్తర దిక్కులకు అభిముఖంగా నిలిచి, రేగుపళ్లతో కూడిన పెరుగు, అక్షతలతో పిండము, అంగుళ్యాగ్రంతో గాని - కనిష్ఠ కామూలంతోగాని (బొటనవ్రేలి చివరతో/చిటికెనవ్రేలి మొదలుతో) పితృదేవతల కిచ్చి సంతృప్తి పరచాలి.
ఇదేకాదు! సమస్త అభ్యుదయకర్మలలోను ఈ నాందీ (వృద్ధి) శ్రాద్ధం జరపడం అత్యావశ్యకం. కుమారుడూ, కుమారై వివాహాలలో; సీమంతంలో, బాలుని పుట్టువెంట్రుకలు తీయించే (చూడాకర్మలో) సందర్భములో; పుత్రుని ముఖావలోకన సమయంలో గృహస్థుడు ఈ విధి ఆచరించాలి. వృద్ధికర్మల్లో చేయదగిన పితృపూజా విధి సంగ్రహంగా ఇదీ.
ప్రేతకర్మాది విషయము
ఓ రాజా!ఇప్పుడు ఆచరణ చెబుతాను, వినుము. మృతుని శరీరం శుభప్రదమైన స్నాన సాధనాలతో స్నానం చేయించాలి. తదుపరి పూలమాలలతో అలంకరించి గ్రామానికి వెలుపల గల శ్మశానికి తీసుకువెళ్ళాలి. (అయినవారుంటే శవం ఒకవైపు కాడి మోయవచ్చు!)
అక్కడ దహనక్రియలు పూర్తిచేశాక సచేలస్నానం చేసి కర్త, అతడితో పాటు బంధువులు దక్షిణ దిశాభి ముఖాలై జలాంజలులు విడవాలి. గోధూళివేళగాని - నక్షత్రదర్శన సమయంలోగాని గ్రామంలో ప్రవేశించి, తృణశ్యయ్యమీద పరుండుతూ, ప్రతిరోజు ప్రేత ప్రీత్యర్థం పిండప్రదానం చేయాలి. మాంస రహితమైన అన్నాన్ని భుజిస్తూ కర్మ ఆచరించాలి. నాలుగవరోజు అస్తి సంచయనం చేయాలి.
ఆ తర్వాత సపిండులతో పాటు భోజనాదికాలు కర్తజరిగించవచ్చు! సంధ్యోపాసన, శయ్యాసనాది భోగాలు పనికివస్తాయి. స్త్రీసంగమమొక్కటే నిషేధము.
నీటిలో పడిగానీ, అగ్నిలోపడిగానీ, ఉరివల్లగానీ, ఈతరేతర ప్రమాదాల వల్లగానీ మరణిస్తే కూడా ఆశౌచవిధి పాటించాలి. ఎవరి బంధువు మరణిస్తాడో, వాని ఇంట భుజించరాదు. దానం ఇవ్వడం గాని - తీసుకోవడం గాని ఆ ఇంట జరగరాదు. శుద్ధి అయిన తర్వాత చేయాలి.
బ్రాహ్మణ, క్షత్రియులకు 12 రోజులు, వైశ్యులకు 15 రోజులు, శూద్రాదులకు ఒక నెల అశౌచం ఉంటుంది. బ్రాహ్మణభోజనాదికాలు జరిగించాక ప్రేతకు పిండప్రదానాదికాలు పూర్తయ్యాక, బ్రాహ్మణులైతే ఉదకాన్నీ, క్షత్రియులైతే ఆయుధాన్నీ, వైశ్యులైతే కొరడానీ, శుద్రులైతే దండము (కర్ర) తాకడం వల్ల పరిశుద్ధులవుతారు.
అటుపైన బ్రాహ్మణాదులకు చెప్పబడిన ధర్మాలు ఆచరించాలి.
అటుపైన నిజబుద్ధి చాతుర్యములతో ధర్మమార్గాన అర్జించిన దనంతో జీవించాలి. అటుపైన రెండోమాసం నుండి మృతతిథి రోజున ఏకొద్ధిష్టంగా ఆవాహనాదికం - దైవనియోగం లేకుండా చేయాలి. అందులోను ఏకార్ఝ్యం, ఏకపవిత్రం, ఎంతమంది బ్రాహ్మణులు భుజించినా ప్రేతకోసం ఒక పిండం ఇవ్వాలి. ఈ ప్రకారం సంవత్సరకాలం ఏకోద్దిష్టమయమగు ధర్మమే ఆచరించాలి.
సపిండీకరణము
ఇది కూడా ఏకోద్దిష్ట విధానాన ఆచరించాలి. ఆరోనెలలో గాని, సంవత్సరాంతానగాని, ద్వాదశాహం రోజునగాని చేయాలి. తిలగంధజలాలతో కూడిన నాలుగు పాత్రలుంచాలి. అందులో ప్రేతకొకటి. పితృదేవతలకు మూడు. ప్రేతకు ఉద్దేశించిన పాత్రను మిగతా వాటితో కలిపి సమస్త శ్రాద్ధ విధులతో కూడా పూజించాలి.
పుత్ర, పౌత్ర, ప్రపౌత్రాదులెవరైనా గానీ, వారిసోదరులుగానీ, ఎవరైనా ఈ కర్మచేయడానికి అర్హులే! వీరులేనప్పుడు సమానోదకసంతతిగాని, మాతృపక్ష జలసంబంధీకులుగాని, వీరెవ్వరూలేనపుడు స్త్రీలు అయినా సరే చెయ్యవచ్చు!
పితృ మాతృసపిండ సంబంధీకులు. ప్రేతకు స్నేహితులు, సహచరులు ఎవరైనా ప్రేతకర్మలు చేయాలి. ఏ బంధువులూ లేనివానికి ధనంతో రాజు కర్మ చేయించాలి.
ఇది శ్రీవిష్ణుపురాణే తృతీయాంశే త్రయోదశోధ్యాయః
పూర్వక్రియలు, మధ్యమక్రియలు, ఉత్తరక్రియలు అని ఇవి మూడు విధాలు.
అగ్నిసంస్కారంతో ప్రారంభించి మృతాశౌచం తీరాక తిరిగి అందరితో సమానంగా నిత్యనైమిత్తిక సర్వవిధులు నిర్వర్తించుకొనేంతవరకు మృతుని నిమిత్తం ఏ కర్మలు ఆచరించబడతాయో అవి పూర్వక్రియలు.
మాసతిథులలో నెలనెలా జరిపే ఏకొద్దిష్టాలు మధ్యమక్రియలు. ప్రేతానికి - పితృదేవతా స్థానాన్ని ఆపాదించే పిండీకరణం వంటివి ఉత్తరక్రియలు. వీటిలో పూర్వక్రియలను మృతుని తల్లిదండ్రులు - సపిండులు - సమానోదకులు లేదా వారసులు నిర్వర్తించాలి.
పూర్వోత్తర క్రియలను - పెద్దవారు మృతిచెందినపుడు కొడుకులు, కూతుళ్లు, దౌహిత్రులు (కూతురి కొడుకులు), వారి పుత్రులు ప్రతిఏటా (సందర్భాలను బట్టి) ఆచరించవచ్చు!
No comments:
Post a Comment