Friday, November 29, 2024

 బ్రహ్మచర్యాది ఆశ్రమధర్మాలు-శ్రీ విష్ణు పురాణము

Part36
బ్రాహ్మణులు దానం - యజ్ఞాలచేత దేవతలను ఆరాధించాలి. వేదాధ్యయనాన్ని వీడరాదు. జీవనయాత్ర సాగడం కోసం ఇతరులచేత యజ్ఞాలు చేయించడం, వేదాలను అభ్యసింపజేయడం, ఇతరుల నుండి పవిత్రద్రవ్యాన్ని న్యాయర్జితమైన విత్తాన్ని దానాంగా గ్రహించడం, దానం చేయడం ఇవీ బ్రాహ్మణులు ఆచరించదగిన ధర్మాలు. త్రికాల స్నానం - నిత్యాగ్నిహోత్రం వీరికి చెప్పబడిన నిత్యకృత్యాలు. సకల ప్రాణుల పట్ల మైత్రీభావం విప్రులకు ముఖ్యధనం. ఋతుకాలంలో మాత్రమే నిజభార్యతో సంగమం చెప్పబడింది.

క్షత్రియులైతే సంకల్పపూర్వకంగా దానం, బ్రాహ్మణులచేత యజ్ఞాలు చేయించడం, తాము వేదాధ్యయనం చేయడం, ఆయుధవిద్య - నిజపరాక్రమాలచేత జీవిస్తూ ప్రజలను రక్షించడం, రాజ్యపాలన చేయడం, ఆచరించదగిన ధర్మాలు. యజ్ఞాదికర్మల ఫలితం రాజుకే అందుతుంది. దుష్టశిక్షణ - శిష్టరక్షణ - వర్ణాశ్రమ వ్యవస్థను కాపాడడం రాజుల ముఖ్యవిధి.

బ్రహ్మదేవుడు వైశ్యులకు పశుపాలనం, వాణిజ్యం, అధ్యయనం, దానం, యజ్ఞకర్మలు ఆచరించడం, ధర్మాచరణ కలిగి ఉండడం ముఖ్యంగా బ్రాహ్మణాదరణ కలిగివుండటం ధర్మాలుగా ఏర్పరచాడు.

ఇక - శూద్రులు...అన్ని విధాలా బ్రహ్మ, క్షత్రియ, వైశ్యులను ఆశ్రయించి కృషి ప్రధానంగా జీవనం సాగించాలని చెప్పబడింది. వడ్రంగం, శిల్పం, బంగారుపని, లోహాదులకు చెందిన వృత్తులు, ఇతర చేతివృత్తులు, (కుమ్మరం, కమ్మరం మొదలుగునవి) చేసి జీవిస్తూ దానం, పితృకర్మలు చేయడం ద్వారా వర్ణాశ్రమధర్మాలు కాపాడిన వారౌతారు.

తమను సేవించే సేవకులను పోషించడానికై, ఇతరుల నుండి దానాలను స్వీకరించడం - సమస్త భూతహితంగా వర్తించడం - అహంకారాన్ని వర్జించడం - సత్యం - శుచిత్వం - శుభకరంగా సంభాషించడం - హితకరమైన పనులు చేయడం - అసూయను విడనాడటం - అన్నిటిపట్ల, అందరిపట్ల మిత్రభావం కలిగి ఉండడం సర్వవర్ణాల వారికి సాధారణ ధర్మాలుగా చెప్పబడ్డాయి.

అపత్కాలంలో ఆచరించే ధర్మాలూ కొన్ని ఉన్నాయి. ధర్మంగా వెళ్తూన్నపుడు ఏకారణం చేతనైనా జీవితం జరగనపుడు బ్రాహ్మణుడు క్షత్రియ - వైశ్య వృత్తులను అలవంబించ వచ్చు! క్షత్రియుడు వైశ్యవృత్తీ వైస్యుడు క్షత్రియవృత్తి ఆచరించవచ్చు! కాని ఈ ఉభయులూ శూద్రవృత్తులు అవలంబించకూడదు. కర్మ సంకరం కూడదు. అనగా ఎవరికి చెప్పబడినవి వారే ఆచరించాలిగాని, ఇతరుల వృత్తులలో తలదూర్చుట తగదని భావము.

బ్రహ్మచర్యాది ఆశ్రమధర్మాలు:

ఉపనయనం జరిగాక, బాలుడు విద్యాభ్యాసం నిమిత్తం బ్రహ్మచారిగ గురుగృహవాసం చేయాలి. అక్కడ శౌచం - సదాచారం కలిగి గురుశుశ్రూష చేస్తూ విద్యను సంపాదించాలి. ప్రాతః సాయం సంధ్యలలో శ్రద్ధగా సంధ్యావందనం చేయాలి. గురువును అన్నివేళ్లా గౌరవిస్తూ, తగిన రీతిగా నడుచుకుంటూండాలి. గురువుకు ప్రతికూలమైనదేదీ ఆచరించకూడదు. వేదం శ్రద్ధగా పఠించాలి. ప్రతి ప్రాతః కాలం గురువుకు అగ్నికార్యం నిమిత్తం సమిధలు సమకూర్చాలి.

తాను ఏవిద్యలనైతే గురువుల వద్ద అధ్యయనం చేయగోరాడో ఆ వేద విద్యలను గ్రహించాక, గురుదక్షిణ ప్రతిఫలంగా ఇచ్చి, గురుదేవుని అనుమతిపొంది ప్రాజ్ఞుడై గృహస్థాశ్రమంలో ప్రవేశించాలి. శాశ్త్రోక్తంగా తగిన కన్యను పెండ్లాడి, తాను నేర్చిన విద్యచే న్యాయమార్గాన విత్తాన్ని ఆర్జించాలి. గృహస్తు ధర్మం నెరవేర్చాలి.

తర్పణాలచేత పితృదేవతలను, యజ్ఞాలచేత దేవతలను, ఆహారం చేత అతిథులను, స్వాధ్యాయంచేత మునులను, సంతానం కనడం వల్ల ప్రజాపతిని, భూతబలి సమర్పించడం ద్వారా ప్రాణులను తృప్తిపరచాలి. అట్లే దయ, వాత్సల్యం కలిగి సమస్తలోకం మెప్పు పొందాలి. ఈ రీతిగా ఏ విప్రుడు సంచరిస్తాడో - తాను చేసిన కర్మలకు (అనగా...తాను పాటించిన వర్ణాశ్రమధర్మాలకు) భగవానుడైన విష్ణువు సంతసించి, అ విప్రునికి ఉత్తమలోకాలను కలుగజేస్తాడు.

భిక్షాటనం చేసి, ఆహారాన్ని భుజించే యతులు, బ్రహ్మచారులు గృహస్తుని మూలంగానే జీవిస్తారు. కనుక బ్రాహ్మణునికి గృహస్థాశ్రమమొక దివ్యధామమని చెప్పబడినది. ముక్తిమార్గం అన్వేషించే యతులకన్న గార్హస్థ్యం ఆచరించే బ్రాహ్మణుడే మిన్న.

కొందరు వేదాది విద్యలను సంపాదించే నిమిత్తం, తీర్థాల్లో స్నానం చేయడానికీ - పృధ్విపై విశేషాలు చూడడానికీ బ్రహ్మచారులుగా సంచరించడమే వృత్తిగా గల కొందరి నిమిత్తం బ్రాహ్మణుడు గార్హ్యస్థ్యజీవనము స్వీకరించడం ద్వారా అట్టివారిని ఆదరంచదానికి వీలవుతుంది. అట్టి బ్రాహ్మణునికి సద్గతి కలుగుతుంది.

ఓ రాజా! ఈ ప్రకారం గృహస్థుడిగా జీవించి కృతకృత్యుడయి వార్థక్యం సమీపించాక, భార్యను కుమారుల వద్ద ఉంచి, తాను అరణ్యాలకు వెళ్ళాలి. కేశఖండనాది సంస్కారాలు పాటించక ఆకులు - దుంపలు తింటూ నేలపై శయనిస్తూ ప్రయోజనమేమీ ఆశించక శేషజీవితాన్ని భగవధ్యానంలో గడపాలి. చర్మం/ రెల్లు/ ధర్భలతో చేసిన ధోవతి - ఉత్తరీయం ధరించాలి. అడవిలో లభించే పదార్థాలే జీవనానికి ఉపయోగించాలి. ఇవి వానప్రస్థాశ్రమ ధర్మాలు.

తపస్సు ఆచరిస్తూ, మౌనంగా మునిలా జీవించడం వల్ల ఇతని దోషాలన్నీ అగ్నిదగ్ధమవుతాయి. శాశ్వతముగా ముక్తి లభిస్తుంది.

ఓ రాజా! భిక్షువు / సన్యాసి ఆశ్రమం అంటూ విద్వాంసులు వ్యవహరించే మరొక ఆశ్రమధర్మం విను! పుత్రులు - భార్య - ధనం - స్నేహం - మాత్సర్యం - మమకారం (తనమీదతానే)విడిచి ఈ ఆరింటికీ దూరంగా ఉంటూ సన్యాసాశ్రమస్వీకారం చేసేవారిని సన్యాసిగా పరిణమిస్తారు. చతుర్విధపురుషార్థాలలోను కేవలం చివరిదైన మోక్షం మీదనే దృష్టిసారించి, శత్రుమిత్రులనే భేదభావాన్ని విడనాడి, సమస్త ప్రాణుల పట్ల దయకలిగి చరించాలి.

నాలుగురకాలైన ప్రాణులలో ఏరకమైన ప్రాణిపట్లను ఎలాంటి ద్రోహమూ (త్రికరణ శుద్ధిగా) తలపెట్టరాదు. గ్రామాల్లో సంచరిస్తే ఏకరాత్రం, పురాల్లో సంచరిస్తే పాంచరాత్రం నిలువవచ్చు! కాని, ఎవరితోను ఏవిధమైన శాశ్వత బంధాలుంచుకోరాదు. ఆ సంచారంలోనైనా అందరి ఇళ్లలోను భోజనాలు ముగిశాక, శ్రేష్ఠవర్ణాలవారి ఇళ్లకు తన శరీరయాత్రామాత్రముననే భిక్షార్థం ఆహారం కోసం సంచరించాలి. అరిషడ్వర్గాలైన కామం, క్రోధం, లోభం, మోహం , మదం, మాత్సర్యం ఎన్నడూ ప్రదర్శించరాదు. మమకార శూన్యత చేతనే ఇది సాధ్యమని గుర్తించాలి. అన్ని విధాలా భూతదయగలిగి సంచరించే సన్యాసాశ్రమ స్వీకర్తకు ఎక్కడా ఏప్రాణివల్ల కూడా భయం ఉండదు. అగ్నిహోత్రాన్ని వేదికమీదగాక, తన దేహం మీదనే నిలుపుకొని భిక్షాటన చేత లభించిన ఆహారాన్నే శరీరాగ్ని చేత హోమంగా జరిపే సాధకుడు నిజమైన సన్యాసి. అగ్నిచయంతో యజ్ఞాలుచేసి/ హోమాలు చేసి ఎవరైతే పుణ్యసాధకులు అవుతారో, అట్టివారికి ఎంతపుణ్యం లభిస్తుందో తన దేహాగ్ని చేత ఈ హోమకార్యం నిర్వర్తించే (పై చెప్పబడిన) సన్యాసికీ అంత ఫలితం(పుణ్యం) లభిస్తుంది. జ్యోతివలె జీవించి (బ్రహ్మ, క్షత్రియ వైశ్యులు) బ్రహ్మలోకం పొందగలరు.

No comments:

Post a Comment