Tuesday, December 10, 2024

 దేహేంద్రియాదయో భావా వీర్యేణోత్పాదితాః కథమ్ ౹
ఖథంవా తత్ర చైతన్యమిత్యుక్తే తే కిముత్తరమ్ ౹౹144౹౹

144. శుక్లము నుండి శరీరము ఇంద్రియములు మొదలగునవి ఎట్లు జనించినవి?మాతృగర్భమునందే చైతన్యమెట్లు కలిగినది?అని ప్రశ్నించినచో ఉత్తరమేమి?

వీర్యస్యైష స్వభావశ్చేత్కథం తద్విదితం త్వయా ౹
అన్వయ వ్యతిరేకౌ యౌ భగ్నౌ తౌ వంధ్యవీర్యతః ౹౹145౹౹

145. అట్లు పెంపొందుట శుక్లము యొక్క స్వభావమే అనినచో ఆ స్వభావము ఎట్లు తెలియబడినది?గొడ్రాలియందు ఆ "స్వభావము" భగ్నమైనది గదా?


న జానామి కిమప్యేతదిత్యన్తే శరణం తవ ౹
అతేవ భహాన్తోఽ స్య ప్రవదన్తీన్ధ్రీజాలతామ్ ౹౹146౹౹

146. చివరకు "ఇది ఏమీ నాకు తెలియదు"అనుటే శరణ్యము. కనుకనే మహాత్ములు ఈ జగత్తు యొక్క ఇంద్రజాలత్వమును గూర్చి చెప్పుదురు.
వ్యాఖ్య :- బ్రహ్మశక్తి ఊహకందనిది. అందువల్ల ఎట్టి బాహ్యాపేక్ష లేకుండా జగత్ నిర్మాణము,సమస్త సృష్టికార్యము బ్రహ్మమునకు సాధ్యమని శ్రుతులు,వేదములు,ఉపనిషత్తులు చెప్పుచున్నవి.

ఎంతటి పండితులకైనను,
శాస్త్ర పారంగతులకైననూ  సృష్టిరహస్యము గురించిన వివరణ  ఏదో ఒక స్థాయియందు దీనికి కారణము మాకు  తెలియదు అనే అగీకరింపక తప్పదు.ఏ శాస్త్రమునందైనను ఈ విషయము సత్యమే.

సృష్టి రహస్యము పాండిత్యము చేెత భేదింపబడునది కాదు. తర్కాదులవల్ల నిరూపించలేము.
పరమేశ్వరుని శక్తి అపారము.శ్రుతి మూలంగానే దానిని తెలుసుకోవటం సాధ్యం కాని, తర్కాదుల వల్ల దానిని నిరూపించలేము.

శుక్ల శోణితములనుండి శరీరము ఇంద్రియములు ఎలా జనించినవి?మాతృగర్భమునందే శిశు చైతన్యమెట్లు కలిగినది?సాలెపురుగు ఇత్యాది ప్రాణులు ఎవరి సహాయము లేకుండా తనే దారాన్ని సృజించుకొని అందులో సంచరిస్తూవుంటుంది.పాలకు స్వయంగా పెరుగుగా మారే సహజ సిద్ధ స్వభావం ఎలా వుంది?

ఇత్యాది ప్రశ్నలకు సమాధానమెక్కడ వుంది?

ఆధునికులు జీన్సు క్రోమోజోమ్స్ వరకు పోవచ్చును 
డి.ఎన్.ఏ., అర్.ఎన్.ఏ.  అని
వివరింపవచ్చును.అవిమాత్రము ఎట్లు ఏర్పడినవి అని అడిగినచో మిణకరింపక తప్పదు.

సరళముగ నాకు తెలియదు అనవచ్చును,లేదా తెలివిగా ప్రకృతి నియమము యాదృచ్ఛికము మొదలగు మాటలతో కప్పిపుచ్చవచ్చు.

ఈ తెలియని తనమునే బ్రహ్మజ్ఞానము మాయ అని అనిరి.
దీనిని బ్రహ్మానుభవము చేతనే తొలగింపగలము.

ప్రతిజీవికి కావలసినవి సమకూర్చుకొనే శక్తి ఎలా వున్నదో,అలాగే పరబ్రహ్మమునకు సృష్టికార్యము అలాగే సాధ్యమవుతుంది.కనుక స్వంత బుద్ధి కుశలతను ప్రకటించే ప్రయత్నములు  మాని మాయా రహస్యమును భేదించు ప్రయత్నము శాస్త్రోక్తముగ చేయవలెను.        

No comments:

Post a Comment