Saturday, December 14, 2024

 దేహవద్వటనాదౌ సువిచార్య విలోక్యతామ్ ౹
క్వ ధానా కుత్ర వా వృక్షస్తస్మాన్మాయేతి నిశ్చిను ౹౹148౹౹

148. శరీరము వలెనే వటవృక్షపు విత్తనము మొదలగు వాని గూర్చి ఆలోచించి చూడు.
ఎక్కడి విత్తనము! 
ఎక్కడి వటవృక్షము!
(అత్యల్పమగు మర్రివిత్తనము నుండి ఆ మహావృక్షము వచ్చుట పరమాద్భుతము కదా.)
కనుక ఇది అంతా మాయే అని నిశ్చయింపువ్యాఖ్య:-  బీజములోపల వివిధములగు వృక్షదశలు (పూలు,ఆకులు,పండ్లు మొదలగునవి)ఉండు విధముగా,

 ప్రతి అణువులోపల గూడ అన్ని విధములగు అనుభవములు సంభావ్యముగా(గుప్తముగా)నుండును.
ప్రతి జీవాణువు లోపల అపరిచ్ఛిన్నమగు  చైతన్యముండును.కావున అవి అదృశ్యముగానుండును.

అందువలన నానాత్వమునకు, ఏకత్వమునకు సంబంధించిన అభిప్రాయములన్నింటిని పరిత్యజింపవలెను.

కాలము,దేశము,కర్మ లేక చలనము,పదార్థము అన్నియు ఒకే  చైతన్యము యొక్క విభిన్నదశలే.
అది స్రష్టయగు బ్రహ్మ శరీరమయినను,క్రిమి శరీరమయినను చైతన్యము వానిని తన లోపల అనుభవగోచరము గావించుకొనును.

ఈ ప్రపంచదృశ్యము కేవలము ఒక దీర్ఘస్వప్నము.ఇది భావన అగుట వలన అంతట అభివ్యక్తమగును. ఈ విధముగా స్రష్ట స్వప్నములో జనించిన విషయములు ఒక స్వప్నమునుండి మరి యొక స్నప్నమునకు,ఒక దేహధారణ నుండి మరియొక దేహధారణమునకు వలస పోవును.

ఈ విధముగా ఈ ప్రపంచ దృశ్యమునకు మాయామయమయిన దృఢత్వమును(ఘనత్వమును)కలిగించుచుండును.స్వప్నతుల్యమగు దృశ్యము స్వప్నమునందే సత్యముగానుండును.

నూనె గింజలో నూనె ఉన్నట్లు,
చిన్న మర్రి విత్తులో మహా మర్రి వృక్షము వున్నట్లు,
ప్రతి వ్యక్తి మనస్సులో,ఆకాశములో,ప్రతి పాషాణములో,అగ్నిజ్వాలలో,జలములో లెక్కలేనన్ని ప్రపంచదృశ్యములున్నవి.

అపరిచ్ఛిన్న చైతన్యముగా నిత్య సత్యమయినది ఒక్కటే తప్ప,తనలోపల కనిపించు ప్రపంచదృశ్యము మాయిమయమని అరుదయిన కొందరు వ్యక్తులు అనుభవగోచరము గావించుకొందురు.

మనస్సు సంపూర్ణముగా నిర్మలమగునప్పుడు,అది శుద్ధచైతన్యమగును గావున చైతన్యముతో ఏకమగును.

జీవులలో జీవులు నిరవధికముగా ఉందురు.వ్యక్తి ఆ విధముగా సత్యమును అనుభవగోచరము గావించుకొన్నప్పుడే భ్రాంతి విముక్తుడగును.  

No comments:

Post a Comment