Sunday, December 22, 2024

 *శంబల - 3*
💮

రచన : శ్రీ శార్వరి 


*శంబల చరిత్ర*

చాలా శతాబ్దాలుగా ప్రపంచానికి తెలియని శంబల, ఇటీవలి కాలంలో అందరి దృష్టిని ఆకర్షించింది.

చాలా కాలం క్రిందట Shanghai Times పత్రికలో Dr Lao Tsin పేరున ఒక వ్యాసం ప్రచురించబడ్డది. అది శంబల యాత్ర గురించిన రచన. 

ఒక మంగోలియా లామాతో కలిసి డా. లావోసిన్ శంబల పర్యటించాడు. అక్కడ గొప్ప లాబొరేటరీలు, పెద్ద దేవాలయాలు ఉన్నాయి. అక్కడ వైజ్ఞానిక ప్రగతి అనిర్వచనీయం, అమోఘం. వారు సంకల్ప సిద్ధులు. అంతటి Will Power ఎక్కడా చూడం.


*నాగలోకం*

మన పురాణాలలో నాగలోక ప్రస్థావన ఉంది. ఇప్పుడు మనకు తెలియదు కాని పర్వత గుహల్లోంచి నాగలోకం చేరవచ్చు. అక్కడ ఉండేది నాగ సర్పాలు. ఆ గుహలు మణుల కాంతిలో ప్రకాశిస్తుంటా యి. దానిని పాతాళ లోకం అంటారు. నాగలోక వాసులు మహా సౌందర్యవంతు లని నమ్మకం. వారు జ్ఞానులు. నాగులు, నాగినులు మానవాకారం ఎత్తి భూమి పై మనుషులను పెళ్లిళ్లు చేసుకునేవారు. ముఖ్యంగా రాజులు, రాణులు వారికిష్టం. ఆధ్యాత్మిక తపన లేనివారి జోలికి నాగ నాగినులు వెళ్లరు. యోగం చేసే వారికి నాగ నాగినుల దర్శనం అవుతుంది. అది శుభసూచన. 

పాములని భయపడకూడదు. నాగు పాము కుండలినీ శక్తి. నాగలోక రాజధాని భోగవతి. నాగలోకంలో ఎక్కడ చూచినా మణులు, రత్నాలు, వజ్రాలు కనిపిస్తాయి. అర్జునుడు నాగలోకం వెళ్లిన కధ మనకు తెలిసిందే.


*ప్రజ్ఞా పారమిత*

గౌతమ బుద్ధుని బోధనల కూర్పు 'ప్రజ్ఞాపారమితసూత్ర' నాగలోకంలో ఉండేది. ఆచార్య నాగార్జునుడు నాగ లోకం వెళ్లి దానిని ఉద్ధరించినట్లు చెబుతారు. అందువల్లనే ఆయన నాగార్జునుడు. నాగ+అర్జునుడు. మహాయాన బౌద్ధం స్థాపించినది ఆచార్య నాగార్జునుడే.

టిబెట్ నుండి నాగలోకానికి గుహ మార్గం ఉన్నట్లు చెబుతారు. టిబెట్ మహాత్ములు ఆ మార్గం ద్వారా నాగలోకం వెళ్లి వస్తుండేవారు. ఆ గుహలు వందల మైళ్ల పొడవు. శాంగ్ పో లోయలోని మానస సరోవరం నాగులకు ఇష్టమైన సరస్సు. పదిహేను, పదహారు వేల అడుగుల ఎత్తున ఉంది (4700 మీటర్లు). మహా చలి ప్రదేశం. ఆ సరోవరంలో పెద్ద పెద్ద పద్మాలు తేలుతూ వస్తాయి. ఆ పద్మాలపై మహాత్ములు కూర్చుని తిరుగుతారట. వారు నాగలోకం నుండి వస్తారని టిబెటన్ల విశ్వాసం.

శంబలలో ఆధిపత్యం మహాత్ములది. అంటే అనేక జన్మలలో తపస్సు చేసి పూర్ణ పురుషులైన యోగులు వారు. వారికి పునర్జన్మలుండవు. మరణం దాటి వచ్చినవారు. ప్రపంచంలోఆధ్యాత్మికత్వం నెలకొల్పడమే వారి ఏకైక లక్ష్యం. వారిని బౌద్ధ పరిభాషలో అర్హతు లంటారు. చైనా భాషలో 'లోహన్' లంటారు.

అర్హతులంటే గ్రహాల ప్రభావానికి లోను కాని 'కర్మరహితు' లని అర్థం.

'అర్హతులు' నాలుగు అంచెలుగా పూర్ణత్వం సాధిస్తారు. శ్రోతపత్తి, సవృత ఆగామి, అనాగామి, అర్హతుడు. 'శ్రోతపత్తి' అన్నది మహత్వ సాధనలో తొలి ప్రకరణ. 'సవృత ఆగామి' స్థాయి వారు అప్పుడప్పుడు తిరిగి మళ్ళీ జన్మిస్తుంటారు. 'అనాగామి' మరల జన్మించనవసరం లేని స్థాయి. అర్హతుడు పూర్ణజ్ఞాని.

టిబెట్ సంప్రదాయం ప్రకారం అర్హతులలో రెండు విధాలు : ఒకరు బౌద్ధులు అంటే జ్ఞానపూర్ణులు. రెండవ శ్రేణి: ప్రతి ఒక్కరిని ఉద్దరించే కార్యక్రమం నిర్వహించేవారు అర్హతులు. చైతన్యాన్ని, నిర్వాణ పధంలో చేర్చితే అష్టసిద్ధులు లభిస్తాయి. వారికి కాలం, దూరం అవధులు ఉండవు. ఎక్కడైనా దర్శనం ఇవ్వగలరు. వారికి భౌతికరూపం ప్రధానం కాదు. అర్హతులకు పూర్వజన్మల జ్ఞానం ఉంటుంది. వారికి పునర్జన్మ ఉండదు.

అర్హతుడు అంటే సంపూర్ణ జ్ఞాని, పూర్ణ యోగి అని అర్థం. భూమి పైన ఉన్నంత కాలం ఇతరులకు సేవలు చేయాలన్న సంకల్పం ఉంటుంది. బోధి సత్వుడవుతా డు. ప్రత్యక్షంగా పరోక్షంగా, గోచరంగా అగోచరంగా తనశక్తి మానవోద్ధరణకు వినియోగిస్తాడు. తన యోగశక్తితో ఒక రూపాన్ని ఏర్పరచుకుని (లేదా) ఒక వ్యక్తి ద్వారా తన లక్ష్యాన్ని సాధించగలుగుతా డు. ఆ తర్వాత అంతర్ధానమవుతాడు.


*జార్జి రోరిక్ శంబల సంప్రదాయాల గురించి ఇలా వివరిస్తాడు*

"శంబల కేవలం బౌద్ధ కేంద్రం కాదు. అక్కడ రాబోయే తరాల రూపకల్పన జరుగుతుంది. అది విశ్వప్రయోగశాల. అన్ని దేశాలకు మార్గ దర్శకులు వారే. దర్శకత్వం వారిదే. అక్కడి నుండి ఏ దేశం లోని ఎవరినైనా చూడవచ్చు. గైడ్ చేయవచ్చు. అందరికీ దూరదర్శన, దూరశ్రవణ ప్రతిభ ఉంది. 'కంజీర్' అనే లిఖిత గ్రంథం ప్రతి ఒకటి శంబలలో ఉంది. కొందరు లామాలు చాలా శ్రమపడి శంబల రాజుల్ని కలిసేవారు. లాసాకు ఉత్తరంగా భయంకరమైన మంచు పర్వతాలున్నాయి. ఆ పర్వతాల మధ్య లో ఉంది శంబల. నాటి శంబల నేటి మంగోలియా వరకు విస్తరించి ఉంది.

శంబలలో స్థిరంగా ఉండేది మాస్టర్ మోర్య, మాస్టర్ కుత్ హోమి.


*చింతామణి*

ప్రపంచం మొత్తంలో అతి భయంకరమైన ఎడారి సహారా. అతి విస్తృతమైనది గోబీ ఎడారి.

సహారా ఎడారిలో ప్రాచీన నాగరికతకు చిహ్నాలైన పిరమిడ్లు ఉన్నాయి. గోబీ ఎడారిలో విశ్వ విజ్ఞాన కేంద్రం అనదగిన శంబల ఉంది. పిరమిడ్లకున్న ప్రశస్తి శంబలకు లేదు. ప్రపంచ వింతల్లో పిరమిడ్ ఒకటి. శంబల గురించి వినడమే తప్ప తెలిసింది తక్కువ. అడపా తడపా ఒకరిద్దరు శంబల సరిహద్దుల వరకు వెళ్లి భంగపడి మతిచలించి వెను తిరిగి వచ్చినవారే.19వ శతాబ్దంలో మాడం బ్లవట్స్కీ, రోరిక్ సాహసించి, ప్రాణాలకు తెగించి టిబెట్ వెళ్లి లామాలను దర్శించి వచ్చారు.

1935 ప్రాంతంలో నికోలస్ రోరిక్ మధ్య ఆసియాలో పర్యటిస్తూ శంబల గురించి విన్నాడట. గోబీ ఎడారిని, మంగోలియా ను గొప్పగా వర్ణించాడు. ఆయన చూసినంతలో “గోబీ ఎడారి నల్లటి ఇసుక సముద్రం. పగలు దుర్భరమైన వేడి, రాత్రి వేళల్లో భరించరాని చలి. రాత్రి వేళ కన్ను పొడుచుకున్నా కనిపించనంత పొగ మంచు ఆవరిస్తుంది. అక్కడ రాత్రి వేళల్లో నల్లటి ఆకాశంలో నక్షత్రాలు బిక్కుబిక్కు మంటూ తొంగి చూస్తుంటాయి. ఎడారి దుమ్ము ఆకాశం ఎత్తుకు ఎగిరి గగనాన్ని కమ్మేస్తుంది. ఆ చీకటి ఆకాశంలో సూర్యుడు ఎర్రని బంతిలా కనిపిస్తాడు. ధూళి తుఫానులు వచ్చినపుడు జీవులు ప్రాణ భయంతో వజవజ వణికి పోతుంటాయి.

వేల మైళ్ల గోబీ ఎడారిలో ప్రయాణం చేసి వచ్చినవారు చెప్పే విషయాలు ఎవరూ నమ్మరు. వారిని మరో గోళం పైకి వెళ్లి తిరిగి తిరిగి బ్రతికి వచ్చిన మహాత్ములుగా భావిస్తుంటారు. గోబీ ఎడారి నిర్మానుష్యం అయినా అక్కడక్కడ సువాసనలు వెలువడుతుంటాయి. వందలమైళ్లు ప్రయాణం చేస్తే ఒక ఊరు గాని, మనిషి గాని కనిపించడు. గుక్కెడు నీళ్లు కూడా దొరకవు. పరిశోధన బృందంలోని ప్రతి ఒక్కరి అనుభవం సువాసన. అక్కడ గాలులు అంతేనేమో!

అలెగ్జాండ్రాకు చెందిన డేవిడ్ నీల్ అనే ఆమె పరిశోధనలు చేసి టిబెట్ తూర్పు భాగాన 'జెకుండో' అనే పట్టణంలో జరిగిన ఒక సంఘటన రికార్డు చేసింది.

ఆ ప్రాంతంలో ఒక గాయకుండేవాడట. ఆయన ఎక్కడివాడో ఎవరికీ తెలియదు. అప్పుడప్పుడు వచ్చిపోతుండేవాడు. చిత్రంగా పర్వతాల పైకి వెళ్లి అదృశ్యమ య్యేవాడు. ఆ పర్వతాల పైన మంచు గడ్డ కట్టి ఉండేది. మనిషి బ్రతకడం కష్టం. అలాంటిది అతను ఎట్లా ఉండేవాడు? ఆ పర్వతాల పైన దేవతలు ఉంటారని ప్రజలు చెప్పేవారు. మాడం డేవిడ్ నీల్ ఒక రోజు ఆ గాయకుడికి ఒక బొకే (పూలగుత్తి) యిచ్చి రాజు గారికి బహుమతిగా పంపించింది. ఆ రాజు గారు ఆమెకు అతని ద్వారానే ఒక పూవు బహుమతిగా పంపాడట.

రోరిక్ ఒక పొట్టి గుర్రం మీద ఆప్రదేశాలన్నీ తిరిగాడు. తిరిగి వచ్చిన అతనిని ప్రజలు దేవునిగా ఆరాధించారు.

శంబల వాసులు అజ్ఞాతంగా ఉన్నా అప్పుడప్పుడు బయట ప్రపంచంలోకి వస్తుంటారు. తమ ఆధ్యాత్మికతను ప్రపంచానికి అందిస్తుంటారు. ఆనాడు శంబల రాజు 'రిగ్లెన్ జాయేపే' ప్రార్ధనా మందిరంలోకి రాగానే దీపాలు వాటంతట అవే వెలిగాయిట.

1890లో పశ్చిమ మంగోలియా లోని నారా బందీకుల్ మఠానికి చాలామంది అశ్వికులు వచ్చారు. వారు లామాలు, అందరినీ ఆశ్రమంలో సమావేశపరిచారు. వారిలో మహా గురువు తెల్లని గుర్రం మీద వచ్చాడు. ఆయన శంబల ప్రభువు. అందరి చేత ప్రార్ధన చేయించి వెళ్లి పోయారు అని డేవిడ్ నీల్ రాసుకుంది.


*ఆ మణిపేరు చింతామణి*

చింతామణి మహత్యాలు మన పురాణా లలో కొల్లలు. మనకు కామధేనువు, కల్పవృక్షం ఎలాంటివో చింతామణి అలాంటిది. దానిని టిబెట్లో 'నోర్బు రిన్పో' అంటారు. అది శంబలలో ఎత్తయిన టవర్ చివరన ఉంటుంది. ఒక దివ్య పురుషుడు ఎప్పుడో దానిని ప్రతిష్టించాడు. దాని వెలుగు కిరణాలే ప్రపంచానికి మార్గ జ్యోతులు. ఆ 'మణి' ఉన్న చోట సకల సౌభాగ్యాలు ఉంటాయంటారు. 'చింతామణి' మాటలు కాదు. మన పురాణ కధలో శమంతక మణి రోజుకు ఇరవై బారువులు బంగారం సృష్టిస్తుందని చెప్పారు.

'తోధారి న్యాన్శాన్' పాలిస్తున్న కాలంలో ఆకాశం నుండి నాలుగు వస్తువులు నేలకు రాలాయట. వాటిలో చింతామణి ఒకటి. ఒక రెక్కల గుర్రం మీద 'చింతామణి' భూమికి దిగి వచ్చిందట. తర్వాత చాలా కాలానికి అయిదుగురు మహా పురుషులు ఆస్థానానికి వచ్చి ఆ వస్తువుల విశిష్టత చెప్పారు. ఆ అయిదుగురు శంబలాకు చెంది మహా పురుషులని ప్రజల నమ్మకం.

బంగ్లా అనే గుర్రం ఎక్కి రాజులు, రుషులు ఆకాశ మార్గాన ప్రపంచం అంతా పర్యటించేవారు. కొందరు రోదసి నౌకలపై తిరిగేవారు. చింతామణి వేరే గ్రహం నుండి వచ్చింది. ఆ గ్రహం భూమికి తొమ్మిది వేల కాంతి సంవత్సరాల దూరం.

1920లో శంబల చక్రవర్తి నాటి దలైలామా కు ఒక నీలమణి బహూకరించాడంటారు. లామాలు తమ యోగశక్తితో శిష్యుల్ని ఇతర గ్రహాల పైకి పంపు తుంటారు. భూమి పైన అన్ని ప్రాంతాలలో లామాల ప్రతినిధులు ఉంటారు. వారి గ్రహ యాత్ర కు ప్రాణం, నీరు, ఆహారం అవసరం ఉండవు. వారు ఇతర గ్రహాల పైకి వెళ్లి చాలా సంవత్సరాలు ఉండిపోతుంటారు. వారు సూక్ష్మ శరీరాలతో తమకు ఇష్టమైన యోగులకు కనిపిస్తుంటారు.

శంబల గురువు బయటి ప్రపంచంలో దర్శనం ఇవ్వడం అంటే ఆధ్యాత్మిక వికాసమే. ఎట్లా అందిస్తారు అన్నది జవాబు లేని ప్రశ్న. వారు తాపసులకు, ధ్యానులకు మాత్రమే దర్శనమిస్తారు. వారి ఆధ్యాత్మికావసరాలను గుర్తించి శక్తిని అందిస్తారు. మాస్టర్ కుత్తోమి, మోర్య, జ్వాలూల్ మాత్రమే అప్పుడప్పు డు మన దేశంలో కన్పిస్తారు. మాస్టర్ మైత్రేయ బయట ప్రపంచానికి ఇంతవరకు తెలియదు. అసలు శంబల అంటే విశ్వప్రేమ అని అర్థం.

అనాది కాలం నుండి హిమాలయాలు తపోభూములు. శంబల తపోలోకం. సిద్ధులకు, మహా యోగులకు తప్ప అక్కడకు వెళ్లడం అందరికీ సాధ్యం కాదు. కాని పరమగురువుల స్ఫూర్తి, ప్రజ్ఞ అర్హులైన వారందరికీ అందుతూనే ఉంది.శంబల గురించి బోధి సత్వ విజ్ఞానం గురించి పండితులకు తెలుసు. ఆ విషయం బయటపెట్టరు.

బోధి సత్వం విజ్ఞానానికి మరో పేరు 'కాలచక్ర'

కాలచక్ర గురించి రేపటి భాగంలో...
🪷
*సశేషం* 

꧁☆•┉┅━•••❀❀•••━┅┉•☆꧂

No comments:

Post a Comment