Tuesday, December 24, 2024

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️

53. త్వం కామ సహసాసి ప్రతిష్ఠితో విభుః

పరమేశ్వరా! నీవు
'కామ’స్వరూపానివి. ప్రతిష్ఠితుడవైన విభుడవు (అథర్వవేదం)

'కామం' అంటే కోరిక. ఆధ్యాత్మికమైన ఈ దేశంలో 'కామం' వంటి భౌతికాంశాలను అలక్ష్యపరచారని భావిస్తాం. కానీ ఈ దేశంలోనే ఈ విషయమై అద్భుతశాస్త్రాలు
పుట్టాయి. అయితే వ్యాపార విష సంస్కృతిని ప్రపంచమంతా ప్రసరించిన విదేశీ దృష్టిని మన నేత్రాల్లోకి అరువుతెచ్చుకుని అద్భుతమైన మన ఆవిష్కరణల్ని అతి తక్కువ భావంతో చులకన చేస్తున్నాం.

(కామ=క+అ+మ. ఇందులో 'క' బ్రహ్మవాచకం. 'అ' విష్ణుసూచకం. 'మ'
రుద్రస్వరూపం. ఈ మూడు సృష్టి, స్థితి, లయ శక్తులు. ఈ మూడు శక్తుల
మూలశక్తి 'కామ'. అందుకే పరమేశ్వరుని 'కామ' అని కొలుచుకుంటాం.దైవాన్ని ఎంత పవిత్రంగా, ధర్మంగా ఆరాధిస్తామో కామాన్ని కూడా అంత చక్కగా నియమాలతో పాటిస్తే అది మనల్ని పతనం కానీయకుండా కాపాడుతుంది.)

కామం భగవద్భావనగా గ్రహించమనీ, పురుషార్థాలలో ఒకటిగా స్థాపించాం.
మహాభారతంలో 'కామగీతలు' చెప్పబడ్డాయి. అంటే కామం పట్ల దార్శనిక దృష్టితో తాత్త్విక చింతన ఈ దేశంలో ప్రాచీన కాలంలోనే జరిగిందన్న మాట. వాత్సాయనాదుల
గ్రంథాలను స్పష్టంగా పరిశీలిస్తే ఒక ఆరోగ్యవంతమైన కుటుంబవ్యవస్థకు మూలాలను ఎలా ప్రతిష్ఠ చేశారో అర్థమౌతుంది.

ధర్మపు పునాదిపై అర్థకామాలను సంపాదించడమనే మౌళిక సామాజిక సూత్రాన్ని అత్యంత ప్రభావవంతంగా ఆవిష్కరించిన సంస్కృతి మనది.

“ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభోధర్మమునకు విరుద్ధం కాని కామము నా స్వరూపము' - అని సాక్షాత్తు భగవానుడే గీతాబోధ చేశాడు. సహజ స్వభావాన్ని సవ్యధోరణిలో సాగనిస్తే వ్యక్తికీ, సమాజానికీ క్షేమమని గ్రహించి, ధర్మపు హద్దులనే పాదుగా వేసి మానవజీవన వృక్షాన్ని పదిలంగా ఎదగనిచ్చిన పటిష్ట సంస్కారం
ఇక్కడ అనాది సిద్ధాంతం.
-
పరమాత్మయే 'స అకామయత ఏకోహం బహుస్యాం ప్రజాయాయేతి' అనే 'కోరిక'తో ఏకుడే అనేకుడై పరమేశ్వరుడయ్యాడనీ, అందుకే ఆయన కామేశ్వరునిగా
కొలువబడుతున్నాడనీ, ఆయన శక్తియే కామేశ్వరీదేవి అనీ విశ్వంలో ప్రతి అణువులోనూ
ఆ శక్తి విలసనమే దాగి ఉందనీ అద్భుత దర్శనం ఇక్కడ ఉపాసనా
సంప్రదాయమయ్యింది.

భౌతిక కామనలను ధర్మబద్ధం చేసే ప్రవృత్తి మార్గానికి ప్రాధాన్యమిస్తూనే
అంతర్ముఖమైన భగవత్కామన (బ్రహ్మకామన వేదాంతవిద్యగా పరిఢవిల్లిన మోక్షసామ్రాజ్య ఆవిష్కరణ(నివృత్తిమార్గం) ఈ నేలపై విలసిల్లింది.

అసలు సృష్టి, స్థితి, లయలు ప్రతిక్షణం జరుగుతుంటాయి. ఒకటి సృష్టింపబడి,ఎదిగి, తిరిగి లయించడం ప్రతిక్షణం, ప్రతిచోటా జరిగే ప్రక్రియ. ఈ మూడు చేసే
శక్తులను బ్రహ్మవిష్ణురుద్రులన్నాం. నిజానికి ఒకే శక్తి ఈ మూడుగా పని చేస్తోంది.ఆ ఒక్క శక్తిని 'కామ' శక్తి అన్నారు. అక్షర నిర్మాణంలో కూడా హేతుబద్ధమైన సూక్ష్మవిజ్ఞానాన్ని అవలంబించిన మనశాస్త్రం 'కామ' అనే నామంలో మూడు శక్తులున్నాయని వివరించింది.

కామ=క+అ+మ. ఇందులో 'క' బ్రహ్మవాచకం. 'అ' విష్ణుసూచకం. 'మ'
రుద్రస్వరూపం. ఈ మూడు సృష్టి, స్థితి, లయ శక్తులు. ఈ మూడు శక్తుల మూలశక్తి 'కామ'. అందుకే పరమేశ్వరుని 'కామ' అని కొలుచుకుంటాం.

దైవాన్ని ఎంత పవిత్రంగా, ధర్మంగా ఆరాధిస్తామో కామాన్ని కూడా అంత చక్కగా నియమాలతో పాటిస్తే అది మనల్ని పతనం కానీయకుండా కాపాడుతుంది.    

No comments:

Post a Comment