*మనము... మనస్సు.....*
*ఆలోచించి చూస్తే పాదము నుంచి మస్తకము వరకూ ఉన్నవాటిలో ‘మనము’ అనేది ఏదీ లేదు. "జ్ఞాన స్వరూపమే మనము" కేవలం విశుద్ధ చైతన్యమే ‘మనము’ అనే రూపంలో ప్రకాశిస్తుంది. శరీరము, ఇంద్రియములు, మనస్సు, చైతన్యములు ఒకే రకమైన భావము కలవి.. అయినప్పటికీ వాటికి పరస్పర సంబంధము ఏదీ లేదు.*
*అన్ని అంగాలూ ఉన్నప్పటికీ శవదర్శన స్పర్శనాదులు ఎందుకు చేయకూడదు.. శరీరము, శవములు ఒకే రకమైన పదార్థములే కదా.. మనలో చైతన్యము ఉన్నది కనుకనే మనము చూడగలుగుతున్నాము, వినగలుగుతున్నాము. కనుక మనము శరీరము కాదు. దానిలో ఎలాంటి సందేహములు కలుగరాదు. కనుక మనము శరీరము కన్నా భిన్నులము, నిత్యులము, స్వయం ప్రకాశులము అయి ఉన్నాము.*
*ఎక్కడ ఆత్మ ఉంటుందో అక్కడ మనస్సు ఇంద్రియములు ఆత్మ మొదలైనవి ఏమీ ఉండవు. రాజు ప్రక్కనే సామాన్య వ్యక్తి నిలువలేడు. తిలల నుంచి తైలము తీసివేసిన తరువాత తెలకపిండికి తిలలకు ఎలాంటి సంబందమూ ఎట్లా ఉండదో, అట్లాగే శరీరము, మనస్సు ఇంద్రియములతో మనకు ఎలాంటి సంబంధమూ లేదు. "మనస్సూ మనము కాదు, జీవమూ మనము కాదు". ఎందుకంటే అవన్నీ చైతన్యము చేతనే తెలుసుకోబడతాయి. జీవునకు తనదైన స్వతంత్ర ఏమీ లేదు. అది కేవలము సాక్షి మాత్రమే.*
*ముత్యాలహారములోని ముత్యాలు దారం చేత ఎట్లా గ్రుచ్చబడి ఉన్నాయో, అట్లాగే భగవంతుని రూపమైన ఆత్మ పదార్థంలో జీవ పదార్థములన్నీ గ్రుచ్చబడి ఉన్నాయి. దారానికి ముత్యాలకూ ఏమీ సంబంధము లేదు. అట్లాగే శరరానికి ఆత్మకూ ఏమీ సంబంధం లేదు. శరీరము జడపదార్థము. కాని మనము అమరులము.*
*"జీవుడు మృతుడా, జీవితుడా అన్నది కేవలం భ్రమ మాత్రమే". మనము అంటేనే ఆత్మకన్న భిన్నమైనది మరేదీ లేదు. ఇది జ్ఞానోదయమయిన తరువాత తెలుస్తుంది. బాహ్య జగత్తు మనము కాదు. అనిత్యమైన శరీరము మనము కాదు. పంచ ప్రాణములు కాని, వాయువు కాని మనము కాదు. ఎందుకంటే అవన్నీ అచేతనములు. మనము చైతన్యము కలవారము. పంచజ్ఞానేంద్రియములు మనము కాము. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు మనము కాము.*
*అయితే మన మెవరము...*
*మనము ఆలోచనలకు మించిన నిర్మల శాంత, విశుద్ధ, చేతన స్వరూపములము. బాహ్య అభ్యంతర స్థానాలలో వ్యాపించి ఉన్నవారము. మనము దీపం లాగా అన్ని పదార్థములను ప్రకాశింపజేస్తున్నాము. మనము అన్నింటిలో ఉండే ఆత్మ స్వరూపులము. దీపం సహాయంతో చీకటిలో ఉన్న తెల్లని, నల్లని వస్తువులు ఎట్లా తెలుస్తాయో, అట్లాగే మనలోని ఆత్మ పదార్థం వలన అన్ని వస్తువుల పరిజ్ఞానం మనకు కలుగుతుంది. అద్దంలో అన్ని వస్తువులూ ఏ విధంగా ప్రతిబింబిస్తాయో, అట్లాగే జాగృతమైన అన్ని వస్తువులకు మనము అనుభవస్థానము.*
*అనాది.. అనంతము. సర్వాంతర్యామి.. చిన్మయము అయిన ఆత్మయే మనము... స్థావర జంగమములైన పదార్థ సముదాయమే మన శరీరము. ఇంత పెద్ద పరిమాణంలో ఉన్నా, దానికి ఉనికి లేదు. ఎప్పటి నుంచీ ఉన్నది, ఎప్పటి వరకు ఉంటుంది అనే హద్దు కూడా లేదు. అంతేకాక, ఎంత దూరం వ్యాపించి ఉన్నది అనే పరిమాణం కూడా లేదు. మనము స్వయం ప్రకాశులము.*
*పుష్పంలో పరిమళము, బీజములో వృక్షము, జలములో శీతలత, అగ్నిలో తేజస్సు, సూర్యునిలో కిరణము, దీపములో ప్రకాశము, కాంతిలో రూపము, రూపములో అనుభవము అయి ఉన్నాము.. పాలలో నెయ్యి, నీటిలో రసము, చక్కెరలో తీపితనము ఉన్నట్లే, మనం కూడా అన్ని పదార్థాలలోనూ శక్తి రూపంలో ఉన్నాము. మనము ఆత్మ కనుకనే ఎవరి ప్రార్థనా లేకుండా ఈ విశాలమైన జగత్తంతా వ్యాపించి ఉన్నాము.*
*నీవు.. మనము, మనది అనేవి అన్నీ మిథ్యాభ్రమలే. మనస్సు మనస్సుకు ఎక్కడా ఏమీ దొరకదు. అందువలననే దూర దూరాంతరాలలో త్రోవ తప్పి తిరుగుతూ ఉంటుంది. మనస్సు యొక్క వృత్తి తరంగాల లాగా చంచలమైనది. మనస్సు యొక్క తేజస్సు అగ్ని కన్న కూడా అధికమైనది. దానిని అతిక్రమించుటం పర్వతములను అతిక్రమించటంకన్నా కష్టతరమైనది. మనుస్సును వశపరచుకొనటం సముద్రాన్ని ఆపోశన పట్టటం కన్నను, సుమేరు పర్వతం ఎత్తటం కన్నను, అగ్నిభక్షణం కన్నను చాలా కఠినమైనది.*
*కాని మనస్సు క్షీణిస్తే, అంటే.. వాసనా శూన్యమైతే, జగత్తు నష్టమవుతుంది. అనంతమైన సుఖదుఃఖాలు ఈ మనస్సు నుంచే పుడుతున్నాయి. అలాంటి మనస్సు వివేకం వలన క్షీణించికపోతే, సుఖ దుఃఖాలన్నీ వినష్టమైపోతాయి. మనస్సు నటునిలాగా అన్ని విషయాలలోను క్షణికానందము, క్షణిక విషాదము, క్షణిక ప్రసన్నతలను అనుభవిస్తుంది. నిర్మల బుద్ధియోగంతో ఇప్పుడే ఆ మనసుకు తగిన మందు వెయ్యకపోతే, దానికి ప్రతీకారం చేసే సమయం ఎప్పుడు వస్తుంది...*
*మనస్సు యొక్క శక్తి వలననే దృశ్యమాన వస్తువుల దర్శనం కలుగుతుంది. మనోచ్ఛేదము వలన దృశ్య దర్శనోచ్ఛేదము కూడా కలుగుతుంది. ఈ ప్రపంచం యావత్తు మనో సృష్టియే. మనస్సే జగత్ కర్త, మనస్సే పురుషుడు. మనో నిశ్చయం వలన సంపాదితమయ్యేది మనస్సు యొక్క ప్రతిబింబమే అవుతుంది.*
*ఈ ఆకాశము విస్తృతమైనది, అనంతమైనది. చిదాకారమైన ఈ విస్తృత మనస్సులోని ఏ అంశంలో చైతన్య ప్రతిబింబింబం పడుతుందో, అంశం ప్రకాశితమై, స్థిరత్వాన్ని పొందుతుంది. మనస్సు యొక్క శక్తి ఎంత ప్రబలమైనదంటే, ఏకీకృత మనస్సుతో ఏది చేస్తే అది తప్పక సఫలమవుతుంది. "చివరకు బ్రహ్మ వరకూ అన్నీ పొందవచ్చును". మనస్సు చైతన్య శక్తి నుంచి చైతన్య భావమును పొంది, బ్రహ్మ భావాపన్నము అవుతుంది...*
*ఆధ్యాత్మికం ఆనందం*
🍁🍁🍁 🙏🕉️🙏 🍁🍁🍁
No comments:
Post a Comment