*పేరు మరచిన ఈగ కథ (చిన్నారుల్లో జ్ఞాపక శక్తిని పెంపొందించే గొలుసుకట్టు జానపద కథ)* - డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
ఒకూర్లో ఒక ఈగుంది. దానిది చూడముచ్చటైన ఇండ్లు. ఒకరోజు ఒక పండగొచ్చింది. పండగరోజు ఈగ పొద్దున్నే లేసి, ఇంటి ముందంతా శుభ్రంగా కసువు కొట్టి, పేడతో అలుక్కోవడం మొదలు పెట్టింది. అట్లా అలుకుతా అలుకుతా అది తన పేరు మర్చిపోయింది.
"నా పేరు నాకు గుర్తు లేకుంటే ఎట్లా? ఎవరన్నా వచ్చి నీ పేరేమని అడిగితే ఏం చెప్పాల, మరియాద పోతాది గదా" అనుకోని చేస్తున్న పని చేస్తున్నట్టే వదిలేసి ఒక మూల కూచోని తెగ ఆలోచించింది. కానీ ఎంత ఆలోచించినా దానికి దాని పేరు గుర్తుకు రాలేదు. దాంతో ఎవరినన్నా అడిగి కనుక్కుందామని ఎగురుకుంటా పోతా వుంటే దానికి ఒకచోట ఒక పేదరాశి పెద్దమ్మ కనబడింది. వెంటనే అది పేదరాశి పెద్దమ్మ దగ్గరికి పోయి
“పేదరాశి పెద్దమ్మా! పేదరాశి పెద్దమ్మా! నా పేరేమిటో నీకు తెలుసా?" అనడిగింది. దానికామె “ఏమోనమ్మా నాకూ తెలీదు. పోయి నా కొడుకు నడుగు" అనింది.
“సరే" అని అది ఎగురుకుంటా పేదరాశి పెద్దమ్మ కొడుకు దగ్గరికి పోయి “పేదరాశి పెద్దమ్మా, పెద్దమ్మ కొడుకా! నా పేరేమిటో నీకు తెలుసా” అనడిగింది. దానికి వాడు “ఏమోనమ్మా నాకూ తెలీదు. పోయి నా చేతిలోని గొడ్డలినడుగు" అన్నాడు.
దాంతో అది గొడ్డలి దగ్గరికి పోయి “పేదరాశి పెద్దమ్మా, పెద్దమ్మ కొడుకా, కొడుకు చేతిలోని గొడ్డలీ! నా పేరేమిటో నీకు తెలుసా" అనడిగింది. దానికా గొడ్డలి “ఏమోనమ్మా నాకూ తెలీదు. నేను కొట్టిన చెట్టునడుగు" అనింది. దాంతో అది చెట్టు దగ్గరికి పోయి "పేదరాశి పెద్దమ్మా, పెద్దమ్మ కొడుకా, కొడుకు చేతిలోని గొడ్డలీ, గొడ్డలి కొట్టిన చెట్టూ నా పేరేమిటో నీకు తెలుసా" అనడిగింది. దానికా చెట్టు “ఏమోనమ్మా నాకు తెలీదు. నామీదున్న పక్షులనడుగు" అనింది.
దాంతో అది పక్షుల దగ్గరికి పోయి "పేదరాశి పెద్దమ్మా, పెద్దమ్మ కొడుకా, కొడుకు చేతిలోని గొడ్డలీ, గొడ్డలి కొట్టిన చెట్టూ, చెట్టు మీదున్న పక్షులారా నా పేరేమిటో మీకు తెలుసా" అనడిగింది.
దానికా పక్షులు “ఏమోనమ్మా మాకూ తెలీదు. పోయి మేం తాగే నీళ్ళనడుగు" అన్నాయి.
దాంతో ఆ ఈగ నీళ్ళ దగ్గరకు పోయి “పేదరాశి పెద్దమ్మా, పెద్దమ్మ కొడుకా, కొడుకు చేతిలోని గొడ్డలీ, గొడ్డలి కొట్టిన చెట్టూ, చెట్టు మీదున్న పక్షులు, పక్షులు తాగే నీళ్ళూ నా పేరేమిటో మీకు తెలుసా" అనడిగింది. దానికా నీళ్ళు “ఏమోనమ్మా మాకూ తెలీదు. పోయి మాలోని చేపలనడుగు" అన్నాయి.
దాంతో ఆ ఈగ చేపల దగ్గరకు పోయి "పేదరాశి పెద్దమ్మా, పెద్దమ్మ కొడుకా, కొడుకు చేతిలోని గొడ్డలి, గొడ్డలి కొట్టిన చెట్టూ, చెట్టు మీదున్న పక్షులూ, పక్షులు తాగే నీళ్ళూ, నీళ్ళలోని చేపలూ నా పేరేమిటో మీకు తెలుసా" అనడిగింది. దానికా చేపలు "ఏమోనమ్మా మాకూ తెలీదు. పోయి మమ్మల్ని పట్టే జాలరినడుగు" అన్నాయి.
దాంతో ఆ ఈగ జాలరి దగ్గరకు పోయి “పేదరాశి పెద్దమ్మా, పెద్దమ్మ కొడుకా, కొడుకు చేతిలోని గొడ్డలి, గొడ్డలి కొట్టిన చెట్టూ, చెట్టు మీదున్న పక్షులూ, పక్షులు తాగే నీళ్ళూ, నీళ్ళలోని చేపలూ, చేపలు పట్టే జాలరీ! నా పేరేమిటో నీకు తెలుసా" అనడిగింది. దానికా జాలరి “ఏమోనమ్మా నాకూ తెలీదు. పోయి ఆ చేపల్ని తినే రాజును అడుగు”అన్నాడు.
దాంతో ఆ ఈగ రాజు దగ్గరకు పోయి “పేదరాశి పెద్దమ్మా, పెద్దమ్మ కొడుకా, కొడుకు చేతిలోని గొడ్డలీ, గొడ్డలి కొట్టిన చెట్టూ, చెట్టు మీదున్న పక్షులు, పక్షులు తాగే నీళ్ళూ, నీళ్ళలోని చేపలూ, చేపల్ని పట్టే జాలరీ, జాలరి పట్టిన చేపల్ని తినే ఓ రాజా నా పేరేమిటో నీకు తెలుసా" అనడిగింది. దానికా రాజు “ఏమోనమ్మా నాకూ తెలీదు. పోయి నేను ఎక్కే గుర్రాన్నడుగు" అన్నాడు.
దాంతో ఆ ఈగ గుర్రం దగ్గరకు పోయి “పేదరాశి పెద్దమ్మా, పెద్దమ్మ కొడుకా, కొడుకు చేతిలోని గొడ్డలి, గొడ్డలి కొట్టిన చెట్టూ, చెట్టు మీదున్న పక్షులూ, పక్షులు తాగే నీళ్ళూ, నీళ్ళలోని చేపలూ, చేపల్ని పట్టే జాలరీ, జాలరి పట్టిన చేపల్ని తినే రాజా, రాజెక్కే గుర్రమా! నా పేరేమిటో నీకు తెలుసా" అనడిగింది. దానికా గుర్రం "ఏమోనమ్మా నాకూ తెలీదు. నా కడుపులోని పిల్లనడుగు" అనింది.
దాంతో ఆ ఈగ గుర్రం కడుపులోని పిల్ల దగ్గరకు పోయి "పేదరాశి పెద్దమ్మా, పెద్దమ్మ కొడుకా, కొడుకు చేతిలోని గొడ్డలి, గొడ్డలి కొట్టిన చెట్టూ, చెట్టు మీదున్న పక్షులూ, పక్షులు తాగే నీళ్ళూ, నీళ్ళలోని చేపలూ, చేపల్ని పట్టే జాలరీ, జాలరి పట్టిన చేపల్ని తినే రాజా, రాజెక్కే గుర్రమా, గుర్రం కడుపులోని పిల్లా! నా పేరేమిటో నీకు తెలుసా" అనడిగింది.
దానికా గుర్రంపిల్ల “నీ పేరా? అదీ... అదీ... ఈ... హి... హిహి... హిహిహి..." అని సకిలించింది. గుర్రంపిల్ల “ఈహిహిహి” అని సకిలించటం వింటానే దానికి టక్కున తన పేరు గుర్తుకొచ్చింది.
“ఆ. గుర్తుకొచ్చింది. గుర్తుకొచ్చింది నా పేరు ఈగ కదా. అవును ఈగే, ఈగే" అనరచుకుంటా సంబరంగా ఆక్కన్నించి ఇంటికి ఎగిరిపోయింది.
*****************************
డా.ఎం.హరికిషన్-కర్నూలు-9441032212
*****************************
కథ నచ్చితే *SHARE* చేయండి. రచయిత పేరు మార్చకండి. తీసేయకండి.
No comments:
Post a Comment