అపరిమితమైన విజయం తాలూకు మత్తు తలకెక్కినపుడు తనకి తాను ఒక అతీతమైన వ్యక్తిగాను,శక్తిగాను అభివర్ణించుకుంటాడు.
అలాంటప్పుడే నోటినుంచి అలవికాని మాటలు వెలువడుతాయి.అలాంటిదే అల్లు వారి అబ్బాయి నోటి నుంచి వచ్చిన ``తెలుగు సినిమా స్థాయిని పెంచుతున్నాను"అనే మాట.
ఇది ఖచ్చితంగా అహంకారంతో ధ్వనించిన మాటనే...300 కోట్ల రూపాయల(ఫోర్బ్స్ కథనం ప్రకారం) పారితోషకం తీసుకుని నీ స్థాయిని పెంచుకున్నావు.బెనిఫిట్ షోల రూపంలో వేలరూపాయలు,టికెట్లు రేట్లు వందల రూపాయలు పెంచుకుని నిర్మాతలు వాళ్ళ స్థాయి పెంచుకున్నారు.మార్కెట్ స్థాయి,కలెక్షన్ల స్థాయి పెరగడం అంటే తెలుగు సినిమా స్థాయి పెరగడం అవ్వదు..
నువ్వేదో ఒక ఉదాత్తమైన పాత్ర పోషించి,ఒక మరపురాని చిత్రంగా తీర్చిదిద్ది ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఒప్పుకునేవాళ్ళము తెలుగు సినిమాని ఇంకో స్థాయికి తీసుకెళ్లేలా చేసిన సినిమా అని.ఒక ఫక్తు కమర్షియల్ సినిమా చేసి పెట్టిన పెట్టుబడిని మించి డబ్బులు రాబట్టుకునే క్రమంలో మార్కెట్ స్థాయి ని పెంచుకోవడానికి చేసిన ప్రయత్నాలకి తెలుగు సినిమా స్థాయి పెంచడానికి కష్టపడ్డాము అని చెప్పుకోవడం అన్నది మిమ్మల్ని మీరు చాలా ఎక్కువ ఊహించుకోవడం అవుతుంది.
నువ్వు పుట్టకముందు తెలుగు సినిమాకి ఒక స్థాయి ఉంది,నువ్వు లేకపోయినా ఉంటుంది.ఎవ్వరూ ఆ స్థాయిని పెంచుదాము అని కష్టపడరు,ఒకవేళ పడినా నీలా చెప్పుకోరు...ఎవరి ప్రయత్నము వాళ్ళు చేస్తారు,ఎవడి సినిమాకి వాడు వాడి కష్టం వాడు పడతాడు...అంతే తప్ప తెలుగు సినిమాని ఉద్ధరించేస్తున్నాము అని ఎవరూ అనుకోరు..ఆ ప్రయత్నంలో తెలియకుండానే వచ్చే విజయాల వల్ల,కలెక్షన్ల వల్ల మార్కెట్ స్థాయి పెరుగుతుంది.దానిని మీ ఒక్కరి ఘనత గానే ఆపాదించుకోవద్దు.
సినిమాలో ఆ పాత్రకు తగ్గ అభినయం బ్రహ్మాండంగా చేశావు.దానికే అవార్డ్ ఇచ్చారు.దాని వరకు ఖచ్చితంగా అభినందనీయుడివి.ఆ విషయం అందరూ ఒప్పుకున్నారు.ఎవరికీ రాలేదు,నాకే వచ్చింది అని విర్రవీగుతునట్లుగా అనిపిస్తుంది ఇప్పుడు నువ్వు మాట్లాడుతుంది చూస్తుంటే...
సెక్యూరిటీ ప్రాబ్లమ్ అని నీ కుటుంబసభ్యులు ఎవరైనా హాస్పిటల్ లో ఉంటే వెళ్లడం మానేస్తావా...అర్ధరాత్రే అందరికి తెలిస్తే నీకు మరుసటి రోజు దాకా తెలియలేదు అంటే నమ్మే విధంగా ఉందా...
తెలిసిన వెంటనే పరామర్శించి వస్తే ఇంతదాకా వచ్చేదా...బాధితురాలి పక్షాన స్వాంతన అన్నది చూపకుండా కనపడకుండా,నేను ఇది చేశాను,అది చేశాను అని నీ సోత్కర్ష తప్ప ఏముంది నిన్న నువ్వు మాట్లాడింది...నిన్ను నువ్వు గొప్పగా చూపించుకునే నిర్లక్ష్యధోరణి తో కూడిన ఆటిట్యూడ్ తప్ప,కించిత్ పశ్చాత్తాపం కూడా కనిపించలేదు.
ఊహించని విజయం,అంతులేని ఆదరణ సంభవించినప్పుడు మనం మాట్లాడే మాట,మనం ప్రవర్తించే తీరు,మనం వేసే ప్రతి అడుగు ఆచితూచి వ్యవహరించాలి అన్నది రాజమౌళి,ప్రభాస్ లాంటి వాళ్ళను చూస్తే అర్ధం అవుతుంది.
ఎవరూ నువ్వు తప్పు అని చెప్పనవసరం లేకుండా నీకు నువ్వే తప్పు అని నిరూపించుకునేలా చేసుకున్నావు మొన్నటి జైల్ పరామర్శలు,నిన్నటి ప్రెస్ మీట్..
ఎంత కాదనుకున్న హీరో ని మించిన విలన్ అయ్యావు.
No comments:
Post a Comment