Thursday, December 19, 2024

 💲డాలర్‌ పెత్తనం💲

✍️ప్రభాత్‌ పట్నాయక్‌

అంతర్జాతీయ ఆర్థిక, ద్రవ్య వ్యవస్థ ద్వారా అన్ని దేశాలకూ సౌకర్యంగా ఉండే ఒక చెల్లింపుల విధానాన్ని రూపొందించుకుని ఆ ప్రాతిపదికన వాణిజ్యాన్ని కొనసాగించ వచ్చునని ఉదారవాద ఆర్థికవేత్తలు భావిస్తారు. కాని వాస్తవం అందుకు పూర్తి భిన్నం. పశ్చిమ సామ్రాజ్యవాద దేశాల పెత్తనం మీద ఆధారపడి అంతర్జాతీయ వ్యవస్థ ఏర్పడింది. ఈ ఆర్థిక, ద్రవ్య వ్యవస్థ తిరిగి అదే సామ్రాజ్యవాదానికి దన్నుగా నిలబడుతుంది. ఈ అంతర్జాతీయ వ్యవస్థకు ఇరుసుగా అమెరికన్‌ డాలర్‌ ఉంది. అంటే అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థలో డాలర్‌ పెత్తనం చెలాయించడం వెనుక పశ్చిమ సామ్రాజ్యవాద దేశాల దన్ను ఉంది. 

అదే డాలర్‌ ఆధిపత్యం తిరిగి ఆ పశ్చిమ సామ్రాజ్య వాద దేశాల ఆధిపత్యానికి దన్నుగా ఉంటోంది. అంతర్జాతీయ వాణిజ్యంలో పాల్గొనే వివిధ దేశాల మధ్య పరస్పరం జరిగే వాణిజ్యానికి ఈ డాలర్‌ పెత్తనం ప్రతిబంధకంగా ఉంటోంది.

దీనిని ఒక ఉదాహరణతో వివరిస్తాను: 1వ దేశానికి ‘క’ అనే సరుకు అవసరం అనుకోండి. అది 2వ దేశం తయారు చేస్తోంది. ఈ 2వ దేశానికి ‘చ’ అనే సరుకు అవసరం అనుకోండి. దానిని 1వ దేశం తయారు చేస్తోంది. అప్పుడు ఈ రెండు దేశాలూ ఆ రెండు సరుకులనూ పరస్పరం మార్పిడి చేసుకోవచ్చు కదా. కాని ప్రస్తుత అంతర్జాతీయ వాణిజ్య వ్యవస్థ ప్రకారం అలా మార్పిడి చేసుకోడానికి వీలు లేదు. ఆ రెండు దేశాలవద్దా తమకు కావలసిన సరుకులను కొనుగోలు చేయడానికి సరిపడా డాలర్‌ నిల్వలు ఉండాలి. అలా లేకపోతే ఆ రెండు దేశాలూ తమ సరుకులను మార్పిడి చేసుకోలేవు. అంతర్జాతీయ వ్యాపారం యావత్తూ డాలర్‌ కరెన్సీతోనే సాగుతుంది. ఈ నిబంధన గనుక లేకపోతే చాలా దేశాలు తమ తమ సరుకులను తక్కిన దేశాలతో తేలికగా మార్చు కోవచ్చు. డాలర్‌ మీద ఆధారపడడం అనేది తగ్గితే అది అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేస్తుంది.

ఈ విధంగా డాలర్‌ మీద ఆధారపడడం తగ్గితే అది అమెరికాకు అంగీకారంగా ఉండదు. ప్రపంచం అంతా డాలర్‌ను మారకపు సాధనంగా అంగీకరించడం, డాలర్‌ రూపంలో నిల్వ ఉంటే అది బంగారపు నిల్వతో సమానం అన్న అభిప్రాయం ప్రబలంగా ఉండడం అనేది అమెరికాకు చాలా పైచేయిని కల్పిస్తుంది. అమెరికా ఇప్పుడు ఎన్నటికీ తరగని ఒక బంగారపు గని మీద దర్జాగా కూర్చుని వుంది. ఇతర దేశాల నుండి తనకు కావలసిన వనరులను అది కొనుగోలు చేయవచ్చు,సంస్థలనే కొనుగోలు చేయవచ్చు,విదేశాలలో ఎంత కావాలంటే అంత పెట్టుబడి పెట్టవచ్చు. తన విదేశీ వ్యాపారంలో లోటు గనుక ఏర్పడితే దానిని పూడ్చుకోడానికి ఎన్ని డాలర్లు కావాలంటే అన్నింటిని ముద్రించుకోవచ్చు.

ఇలా అపరిమితమైన కొనుగోలు శక్తిని అంతర్జాతీయ వాణిజ్య రంగంలో కలిగి వుండడమే కాదు.ఇతర దేశాల మెడలు వంచి అవి తన పెత్తనానికి లోబడి వుండేలా చేయడానికి కూడా డాలర్‌ పెత్తనం తోడ్పడుతుంది. ఆయా దేశాల డాలర్‌ నిల్వలు సాధారణంగా పశ్చిమ దేశాల బ్యాంకుల్లోనే భద్రపరచడం జరుగుతుంది. అందుచేత అమెరికా తనకు నచ్చిన దేశానికి కావలసినంత మేరకు డాలర్ల ప్రవాహాన్ని పంపనూవచ్చు. తనకు నచ్చనప్పుడు ఆ దేశపు బ్యాంక్‌ అకౌంట్లను స్తంభింపజేసి డాలర్ల కొరతనూ సృష్టించవచ్చు. ఇరాన్‌ నుండి రష్యా వరకూ అనేకదేశాలు ఈ విధంగా శిక్షలు అనుభవిస్తున్నాయి. ఈ విధంగా వివిధ దేశాల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైంది. దాంతో డాలర్‌ ప్రమేయం లేని వ్యాపారం కావాలన్న డిమాండ్‌ ఆ డాలర్ల కొరతను ఎదుర్కొంటున్న దేశాల నుండి పెరుగుతోంది.

ప్రస్తుతం దాదాపు మూడో వంతు ప్రపంచ దేశాలు అమెరికా నుండి ఇటువంటి శిక్షలను ఎదుర్కొంటున్నాయి. అయితే ఆ విధంగా శిక్షించడానికి ఐరాస నుండి అమెరికాకు ఎటువంటి అనుమతీ లేదు. దక్షిణాఫ్రికా దేశం జాతి వివక్షతను పాటించిన కాలంలో అంతర్జాతీయ సమాజం ఆదేశాన్ని శిక్షించడానికి ఆమోదం ఇచ్చింది. అటువంటి సందర్భాలేవీ లేకపోయినా అమెరికా తన పెత్తనాన్ని చెలాయిస్తూ తనకు లొంగని దేశాల ఖాతాలను స్తంభింపజేస్తూ వాటిని ఇబ్బందుల పాలు చేస్తోంది. వాటిలో మూడవ ప్రపంచ దేశాలు ఎక్కువగా ఉన్నాయి. అమెరికా కన్నెర్రకు గురైన దేశాలు ఇప్పుడు డాలర్‌ ప్రమేయం లేని అంతర్జాతీయ వాణిజ్యం కావాలని కోరు కుంటున్నాయి. ఇటీవల కాజన్‌లో జరిగిన ‘బ్రిక్స్‌’ దేశాల శిఖరాగ్ర సమావేశంలో ఈ ఆకాంక్ష బలంగా వ్యక్తం అయింది.

తమ పెత్తనం వల్లే ఇటువంటి ఆకాంక్షలు తలెత్తు తున్నాయని అమెరికన్‌ ప్రభుత్వం సైతం గుర్తించింది. అమెరికన్‌ ఆర్థిక శాఖ మంత్రి జానెట్‌ యెల్లెన్‌ జులైలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కమిటీ సమావేశంలో మాట్లాడుతూ ”అమెరికా ఆంక్షలు ఎన్ని ఎక్కువ దేశాల మీద విధిస్తే అన్ని ఎక్కువ దేశాలు అమెరికన్‌ డాలర్‌ ప్రమేయం లేని వ్యాపారం కావాలని కోరుకుంటాయి.” అన్నారు. తన అడుగులకు మడుగులొత్తేలా ఒత్తిడి చేయడానికి అమెరికా ఆంక్షల బెదిరింపును వాడుకుంటోందని యెల్లెన్‌ చెప్పకనే చెప్పారు. అలా బెదిరింపులకు బలౌతున్న దేశాల సంఖ్య పెరుగుతున్న సంగతినీ అంగీకరించారు.

ఇలా ఏకపక్షంగా ఆంక్షలు విధించడం ద్వారా పెత్తనాన్ని చెలాయించేందుకు పూనుకోవడం వలన పరస్పర విరుద్ధ ఫలితాలు వస్తాయి. ఒకటో, రెండో దేశాల మీద ఆంక్షలు విధిస్తే అప్పుడు వాటి ప్రభావమూ గట్టిగా ఉంటుంది. ఆ ఆంక్షలు మొత్తం వ్యవస్థకూ ముప్పు తెచ్చిపెట్టవు. అదే అనేక దేశాల మీద ఆంక్షలు విధిస్తే అప్పుడు మొత్తం వ్యవస్థకే ముప్పు వాటిల్లుతుంది. 

నయా ఉదారవాద విధానాల ఫలితంగా పేదరికంలోకి దిగజారి పోతున్న దేశాల సంఖ్య పెరుగుతోంది. అందుచేత ఎదురు తిరిగే దేశాల సంఖ్య రానున్న కాలంలో ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. వాటి మీద ఆంక్షలూ పెరుగుతాయి.అప్పుడు ఈ డాలర్‌ పెత్తనమే వద్దనే దేశాల సంఖ్యా పెరుగుతుంది. డాలర్‌ను అంతర్జాతీయ మారకపు సాధనంగా ఉపయోగించడం వలన అమెరికా దానిని అడ్డం పెట్టుకుని వివిధ దేశాల మెడలు వంచి వాటిపై తన పెత్తనాన్ని చెలాయించడం వల్లనే ఇలా జరుగుతోంది. అందుచేత డాలర్‌ మారకపు కరెన్సీగా ఉండడం అనేది అంతర్జాతీయ వాణిజ్యంలో అన్ని దేశాలకూ ప్రయోజనకరంగా ఉంటుందని ఉదారవాద ఆర్థికవేత్తలు చెప్తున్నది ఎంత డొల్ల వాదనో స్పష్టంగా తేలుతోంది.

డాలర్‌ ఈ విధంగా పెత్తనం చెలాయించ గలగడానికి ఒక కారణం 1970 దశకంలో అమెరికాకు, చమురు ఉత్పత్తి దేశాలకు నడుమ కుదిరిన ఒప్పందం.ఆ ఒప్పందాన్ని సౌదీ అరేబియా మధ్యవర్తిత్వంతో కుదుర్చు కున్నారు. దాని ప్రకారం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలను డాలర్లలో నిర్ణయిస్తారు. ఆ డాలర్లలోనే ఆ చమురు వ్యాపారం సాగుతుంది. చమురుకు ఉన్న ప్రాధాన్యత రీత్యా ఈ ఒప్పందం తర్వాత డాలర్‌ ప్రాధాన్యత ఒక్కసారి పెరిగింది.ముడి చమురుకు ఇటువంటి ప్రాధాన్యత ఉంది కనుకనే ఇటీవల పశ్చిమ దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాక వాటి నుండి తట్టుకోడానికి రష్యా తన ముడిచమురు కొనుగోలు చేసేవారు రూబుళ్ళలోనే చెల్లింపులు చేయాలని నిబంధన విధించింది.

అయితే,1970 దశకంలో కుదిరిన ఆ ఒప్పందం ఒక్కటే డాలర్‌ ఆధిపత్యం నేటికీ కొనసాగడానికి కారణం కాబోదు.డాలర్‌ ప్రమేయం లేకుండా అంతర్జాతీయ వ్యాపారం జరగాలన్న భావననే జానెట్‌ యెల్లెన్‌ మొదట్లో తేలికగా కొట్టిపారేశారు. కాని ఇప్పుడు ఆమె ఆ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవలసి వస్తోంది.ఇప్పుడు ట్రంప్‌ డాలర్‌ పెత్తనాన్ని కాదనుకుంటున్న దేశాలను బెదిరించడానికి పూనుకుంటున్నాడు. అమెరికాకు ఆ దేశాలు ఎగుమతి చేసే సరుకులపై సుంకాన్ని 100 శాతం పెంచుతానంటూ రంకెలు వేస్తున్నాడు. అంటే డాలర్‌ పెత్తనం ఎలాగైనా కొనసాగడానికి అమెరికన్‌ సామ్రాజ్యవాదం తన శక్తిని వినియోగిస్తోందన్న మాట.

ఇటువంటి బెదిరింపుల ప్రభావం బలంగానే ఉంటుంది. ఎందుకంటే డాలర్‌ ప్రమేయం లేకుండా వ్యాపారం చేసుకోవడం అనేది ఒక్క పట్టున సాధ్యపడేది కాదు. ఈలోపున అమెరికాకు ఆ దేశాలు చేసే ఎగుమతులు కుదించుకుపోతే అప్పుడు ఆ దేశాల దగ్గరుండే డాలర్‌ నిల్వలు మరీ వేగంగా హరించుకుపోతాయి. అప్పుడు ఆ దేశాలు మరింతగా ఇబ్బందుల పాలౌతాయి.తమ దేశీయ అవసరాలకు కావలసిన దిగుమతులను అవి డాలర్‌ ప్రమేయం లేని వ్యాపారం ద్వారా పొందవచ్చు.కాని ఇప్పటికే ఆ దేశాలు ఐ.ఎం.ఎఫ్‌ లేదా ప్రపంచబ్యాంక్‌ దగ్గర రుణాలు పొందివుంటే ఆ రుణాలకు చెల్లించవలసిన వాయిదాలు డాలర్ల రూపంలోనే చెల్లించాలి.ఆ డాలర్ల నిల్వలు హరించుకుపోతే అప్పుడు ఆ దేశాలు రుణ ఎగవేతదారులుగా నిలబడ వలసి వస్తుంది. దాని వలన కొత్త షరతులను భరించవలసి వస్తుంది.అందు చేత ట్రంప్‌ ప్రకటిస్తున్న హెచ్చరికలను సీరియస్‌గానే తీసుకోవాలి. ఉదారవాద ఆర్థిక వేత్తలు ఎంతో సౌమ్యంగా చిత్రించే సామ్రాజ్య వాదపు ఆధిపత్య రూపం కాస్తా ఇప్పుడీ ట్రంప్‌ బెదిరింపులతో పూర్తిగా బైటపడి పోయింది!

అయితే ఈ బెదిరింపులను ఎదుర్కొనే దేశాలు డాలర్‌ పెత్తనం నుండి బైటపడవలసిన అవసరాన్ని మరింతగా గుర్తించడానికే ఈ బెదిరింపులు తోడ్పడతాయి. డాలర్‌-రహిత అంతర్జాతీయ వ్యాపారం పుంజుకోడానికి ఇంకా చాలా సమయం పడుతుంది.ఈ సంగతి కజన్‌ శిఖరాగ్ర సమావేశానికీ తెలుసు.ట్రంప్‌ బెదిరించగానే భారత దేశంతో సహా పలు దేశాలు తమకు ఈ డాలర్‌-రహిత వాణిజ్యం పట్ల ఆసక్తి లేదంటూ ప్రకటించాయి. అమెరికా దృష్టిలో బుద్ధిమంతులనిపించు కోడానికి ఈ ప్రకటనలు ఉపయోగ పడవచ్చు. కాని అమెరికా పెత్తనానికి సవాలు తీవ్రంగానే ఎదరవుతోందన్నది మాత్రం వాస్తవం. తమ దేశాల ఆధిపత్యానికి సవాలు తీవ్రంగా ఎదురవుతోందన్న వాస్తవాన్ని గుర్తించిన పశ్చిమ సామ్రాజ్యవాద దేశాల ప్రభుత్వాలే కాకుండా ఆ దేశాల్లోని సోషల్‌ డెమాక్రటిక్‌ పార్టీలు సైతం ఉక్రెయిన్‌ విషయంలో గాని, గాజా విషయంలో గాని మరింత ఐక్యంగా వ్యవహరిస్తున్నాయి.

సామ్రాజ్యవాదానికి ఎదురౌతున్న సవాలులో డాలర్‌- రహిత అంతర్జాతీయ వ్యాపారం అనే డిమాండ్‌ కూడా ఒక భాగమే.అయితే డాలర్‌కు ప్రత్యామ్నాయంగా ఏ విధమైన అంతర్జాతీయ వ్యవస్థను ఏర్పరచాలన్న విషయం మీద ఇంకా బ్రిక్స్‌ దేశాల నడుమ ఒక స్పష్టత రాలేదు.ఇలా ఏర్పడే ఆ ప్రత్యామ్నాయ వ్యవస్థ డాలర్‌కు బదులు మరొక దేశపు కరెన్సీకి ఆధిపత్యాన్ని కట్టబెట్టేదిగా మాత్రం ఉండకూడదు.అలా జరగాలంటే ఇప్పుడు ఏ సూత్రాల ప్రాతిపదికపై అంతర్జాతీయ వాణిజ్యం సాగు తోందో ఆ సూత్రాలే,ఆ నియమాలే మారిపోవాలి. అంతే కాదు.అంతర్జాతీయ వాణిజ్యంలో వాణిజ్య లోటు పెరుగుతున్న దేశాల మీద ఆ లోటును భర్తీ చేసే భారాన్ని మోపే పద్ధతి కూడా మారాలి. బ్రెట్టన్‌వుడ్‌ వ్యవస్థ పర్యవసానం ఇది.నిజానికి సర్దుబాటు జరగాలంటే అది మిగులు ఉన్న దేశాల వైపు నుంచి మొదలు కావాలి.

( స్వేచ్ఛానుసరణ )
@ప్రజాశక్తి దినపత్రిక నుండి సేకరణ

No comments:

Post a Comment