Tuesday, December 24, 2024

 Vedantha panchadasi:
జానామి ధర్మం న మే ప్రవృత్తిః జానామ్యధర్మం న చ మే నివృత్తిః ౹
కేనాపిదేవేన హృది స్థితేన యథా నియుక్తోఽ స్మి తథాకరోమి ౹౹176౹౹

176. ఏది ధర్మమో నాకు తెలుసు. కాని దానిని అనుసరించి ప్రవర్తింపను.
అధర్మమేదో తెలుసు.కాని దాని నుండి విరమింపను. హృదయమునందు ఆసీనుడైన ఏ దైవమో ఎట్లు నియమించిన అట్లు చేయుదును.  వ్యాఖ్య:- ప్రసన్నగీత యందలి దుర్యోధనుని పలుకులు
"కేనేపి దేవేన" అనే మార్పుతో భగవంతుడే కర్తయని భావించే జ్ఞాని వాక్కుగా చెప్పబడినవి.

పరమార్థ మందు ఆత్మజ్ఞానికి కర్మలతో సంబంధమే లేదు. అయినను లోకదృష్టి యందు చేయువాడుగానూ,చేయించువాడుగానూ కనపడుచున్నాడు.

అయినప్పటికి సంపూర్ణ అపరోక్షజ్ఞానముగల మహానుభావుడు నూరుకోట్ల అశ్వమేథయాగముల నాచరించుగాక,సమస్త దానముల సల్పుగాక,అఖిల జీవులకు సుఖకరములైన సుకర్మములను చేయుగాక,కానీ
తత్తత్కృత్యముల వలన,కర్తృత్వ బుద్ధి లేక పోవుటచే పుణ్యము లేదు పాపము లేదు.

తత్త్వవేత్తయగు కర్మయోగి అన్నియు చేసియు చేయని వాడు.కనుక వినిన,తినిన,తిరిగిన,తాకిన,
గ్రహించిన,మూకొనిన,
పరిహరించిన - ఏమి చేయుచున్ననూ ఆయా ఇంద్రియములు ఆయా విషయములందు ప్రవర్తించు చున్నవే గాని తాను యేమియు చేయుట లేదని నిశ్చయము.

ఎట్లనగా,ఆయా ఇంద్రియములు దేహమునకే గానీ ఆత్మయైన తనకు కరణములు(కొరముట్లు)కానేరవు.
కాన కరణ రహితమగు తనకు కర్మయే లేదని జ్ఞాని నిశ్చయమై యున్నది.

నార్థ పురుషకారేణేత్యేత్వ మాశంక్యతాం యతః ౹
ఈశః పురుషకారస్య రూపేణాపి వివర్తతే   ౹౹177౹౹

177. ఈశ్వరుడే అంతా చేయుచున్నచో ఇక పురుషకారమేల? అని శంకింప పనిలేదు.ఈశ్వరుడు పురుషప్రయత్న రూపమున కూడా భాసించును.

ఈదృగ్బోనేశ్వరస్య  ప్రవృత్తిర్మైవ
వార్యతామ్ ౹
తథాపీశస్య బోధేన స్వాత్మాసఙ్గత్వ ధీజని ౹౹178౹౹

178.  ఇట్టి సిద్ధాంతము ఈశ్వరుడు సర్వమును చోదించుననుటతో విరోధింపదు.ఈశ్వరుడు అంతర్యామి అని తెలిసికొనిన పురుషుడు తన ఆత్మ అసంగమని కూడా తెలిసికొనును.

తావతా ముక్తి రిత్యాహుః శ్రుతయః
 స్మృతయస్తథా ౹
శ్రుతి స్మృతీ మమైవాజ్ఞే ఇత్యపీశ్వర భాషితమ్ ౹౹179౹౹

179. ఆత్మ అసంగమనెడి బోధయే ముక్తికి కారణమని శ్రుతి వాక్యములు స్మృతి వాక్యములును చెప్పుచున్నవి.వరాహపురాణమున శ్రుతి స్మృతులు కూడా తన ఆజ్ఞ వలననే అని ఈశ్వరుడనును.

ఆజ్ఞాయా భీతిహేతుత్వం భీషాఽ
స్మాదితి హి శ్రుతమ్ ౹
సర్వేశ్వరత్వమేతత్సా దన్తర్యామిత్వతః పృథక్ ౹౹180౹౹

180. ఈశ్వరుని వలన భీతిచే ప్రకృతి శక్తులు ప్రవర్తించునని శ్రుతిలో వింటాము.అనగా ఈశ్వరాజ్ఞ భయము కలిగించును.కనుక ఈశ్వరుని అంతర్యామిత్వము కంటె భిన్నమై ఈశ్వరుని సర్వేశ్వరత్వము కూడా ఉన్నది.

తైత్తిరీయ ఉప.2.8.1;
కఠ ఉప.2.3.3;
నృసింహ తాపనీయ ఉప.2.4.
వ్యాఖ్య:-  తాను దేనిని ఎంతమాత్రము చేయకున్నను విశ్వములోని భూతములన్నియు పని చేయునట్లు చేయునది ఏది?

కంకణమువంటి ఆభరణము‌లు బంగారముతో చేయబడువిధముగా ద్రష్ట ,దర్శనము, దృశ్యము దేనితో చేయబడును?

త్రివిధములయిన అభాసరూపములను
(ద్రష్ట -దర్శనము-దృశ్యములను) అచ్ఛాదించి,అభివ్యక్తము చేయునదేది?

బీజములో వృక్షమున్నట్లుగా భూత,భవిష్యత్,వర్తమానములను త్రివిధకాల విభాగము దేనియందాభాసముగా నున్నది?బీజమునుండి వృక్షము, వృక్షమునుండి బీజము పర్యాయముగా వచ్చునట్లు ఏది పర్యాయముగా అభివ్యక్తమయి అదృశ్యమగును?

ఈ విశ్వముయొక్క సృష్టికర్తయెవరు?ఎవరి శక్తిచేత జీవించుచున్నాము?

చైతన్యవంతమయినను
శిలగానున్నది,శూన్యాకాశములో అద్భుతమయిన చమత్కారములను(మాయలను)చేయునది ఏది?

ఈ ప్రశ్నలన్నియు ఆ పరమాత్మకు సంబంధించినవే.
ఆ పరమాత్మ అంతర్యామిగా సర్వమును చోదించుననుటతో ఎట్టి విరోధములేదు.ఇది తెలుసుకున్నవాడు ఆత్మ అసంగమని కూడా తెలుసుకొనును.ఎట్లనగా,

అగ్నిదేవుడు సర్వపదార్థములను భక్షించి వాటి గుణములను అంటుకోనటుల అనగా వేపచెట్టును కాల్చి చేదును,
శ్రీ గంధపు చెట్టును కాల్చి సుగంధమును అంటుకోనటుల 
ఆ పరమాత్మ సర్వమును చేయుచూ కూడా చేయనివాడే, అసంగుడే.

జ్ఞానికి వ్యవహార నియమముగానీ దాని వలన ప్రమాదముగానీ లేదు.కర్తృత్వము లేక పోవుట వలన పుణ్యపాపములయందు 
అసంగుడు.

అసంగమనెడి బోధయే ముక్తికి కారణమని శ్రుతి ,స్మృతి వాక్యములును చెప్పుచున్నవి.
ఈ శృతి,స్మృతితులు కూడా ఆ పరమాత్మ నిర్ణయమని వరాహపురాణము చెప్పుచున్నది.

సమస్త ప్రకృతి శక్తులయందును ఆ పరమాత్మ అంతర్యామిగాయుండి నడిపించుచున్నాడు.

ఆ ఆత్మ నామరహితమయి వర్ణింపరానిది,సూక్ష్మము గనుక మనస్సు ఇంద్రియములుగానీ గ్రహింపజాలవు.

జీవన్ముక్తుడగు తత్త్వజ్ఞాని ఆత్మ రూపుడై సర్వత్రా వ్యాపించి యున్నప్పటికీ,ఈ శరీరమను నగరమున నున్నవాడై ప్రపంచ కల్పితములగు(ప్రారబ్ధానుసార)
భోగములననుభవించి,పూర్వమే సాక్షాత్కరింపబడియున్న స్వాత్మరూప పరమపురుషార్థమను మోక్షమును సేవించును.అనగా,

"పరమాత్మగానే యుండును".       

No comments:

Post a Comment