Friday, January 10, 2025

 ☘️🍁  ఆప్తవాక్యాలు  🍁☘️

72. వేదోఖిలధర్మమూలమ్

వేదమంతా ధర్మమూలం=అన్ని ధర్మాల మూలం వేదం(స్మృతివాక్యం)

మనువు, గౌతముడు, పరాశరుడు లాంటి స్మృతికర్తలందరూ ఈ వాక్యాన్నే ఉద్ఘాటించారు. మన సనాతన ధర్మానికంతటికీ మూలం వేదమే. దానిని ఆధారం చేసుకొని ధర్మశాస్త్రాలు(స్మృతులు), పురాణాలు, ఇతిహాసాలు ఉద్భవించాయి.చివరకు కావ్యనాటక, సంగీత, నాట్యశిల్పాది కళలు, వైద్యాది విద్యలు కూడా
వేదమూలాలనే ఆధారం చేసుకొని వర్థిల్లాయి.

వేదవిద్యను అక్షరస్వరాది గ్రంథరూపంగా అధ్యయన, అధ్యాపనాది పద్ధతులలో పరిరక్షించే జీవన విధానాన్ని అవలంబించుతూ ఒక వర్గం అంకితభావంతో తరతరాలుగా కృషి చేస్తున్నది. ఆ బాధ్యత వారు తీసుకున్నా - వేదం బోధించినధర్మాన్ని సామాన్యజనులకు సైతం అందించడానికి మహర్షులు స్మృతులనీ, పురాణాదులనీ పటిష్ఠంగా తీర్చిదిద్దారు. వీటితోపాటు ఆగమశాస్త్రాలు, మంత్రశాస్త్రాలు కూడా వేదాల మూలాలనుండే అభివృద్ధి చెందాయి.

వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే
వేదః ప్రాచేతసాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మనా॥

వేదవేద్యుడైన పరమపురుషుడు దశరథపుత్రునిగా ఉద్భవించాడు. ప్రాచేతసుడనే పేరు కలిగిన మహర్షి (వాల్మీకి) ద్వారా వేదం నేరుగా రామాయణంగా ఆవిర్భవించింది
అనే ప్రసిద్ధ శ్లోకం మనకు సుపరిచితం.

“రామాయణం వేదసమం” రామాయణం వేదంతో సమానం - అని
రాయాయణంలోని వాక్యమే.

'మహాభారతా'న్ని 'పంచమవేదం' అని పేర్కొంటున్నాం. 

భాగవతం “నిగమకల్పతరోర్గలితం ఫలం" - వేదమనే కల్పతరువు నుండి రాలిపడిన ఫలం అని విశదపరచారు.

“ఇతిహాస పురాణాభ్యాం వేదం సముపబృంహయేత్" - ఇతిహాస పురాణాల ద్వారా వేదం చక్కగా వ్యాప్తి చెందించబడినది. వేదం సిద్ధాంతరూపంగా చెప్పిన
ధర్మాలను దృష్టాంత రూపంగా అందించడానికే పురాణేతిహాసాలు ఉద్భవించాయి.

నాట్యం, సంగీతం కూడా “చతుర్వేద సముద్భవం” అని చెప్పుకున్నాయి. సంగీత శాస్త్ర కోవిదులైన త్యాగరాజాదులు కూడా సంగీతాన్ని “సామవేద జనితం” అని
స్పష్టపరచారు.

అయితే ఈ విషయాలను సరిగ్గా పరిశోధించని పాశ్చాత్యులు “మన దేశంలో వేదంపై గౌరవం ఎక్కువ కనుక, ప్రతిదానినీ వేదమూలంగా చెప్పడం ఒక అలవాటైపోయింద”ని వ్రాతలు గుప్పించారు, కానీ - పాపం - వాళ్ల మత గ్రంథాలకు 'వేదము' అని పేరుపెట్టుకొని చెలామణి చేసుకుంటూ, వాళ్ల గ్రంథాల వాక్యాలు
కూడా వేదాల్లో ఉన్నాయని చెప్పుకొని చెల్లుబాటు జరిపించుకోవాలనే నీచత్వానికి దిగజారారు.

కానీ పరిశోధనాత్మక దృష్టితో చూడాలంటే ముందు గౌరవభావం ఉండాలి. ఆ భావంతో నిష్పాక్షిక దృష్టితో అధ్యయనం చేస్తే తప్పకుండా మనదేశపు ప్రతి సంప్రదాయానికీ, విద్యకీ సుస్పష్టమూలాలు వేదాలలో కనిపిస్తాయి. అలా విశదపరచిన
శాస్త్రీయ గ్రంథాలు కూడా మనకి ఇప్పటికే చాలా వచ్చాయి. వాటిని ఓపికగా పరిశీలించాలి.

మనదేశంలో విద్యలు, శాస్త్రాలు కేవలం పుస్తకాధారాలు కావు. దేశ స్వభావం,సంప్రదాయం, విజ్ఞానం వంటివి చాలా గమనించాలి. అప్పుడే ఆ విద్య ప్రస్ఫుటంగా అవగతమవుతుంది.

ఆ విధంగా గమనించి స్పష్టపరుస్తున్న మేధావివర్గం పాశ్చాత్య దేశాలనుండి సైతం వస్తున్నది. వారి శోధనల్లో మన మంత్ర, పురాణాదుల విజ్ఞానం సశాస్త్రీయమని ఋజువౌతోంది. కానీ మనవారు పాశ్చాత్యానుకరణల్లో పడి నిర్లక్ష్యపరుస్తున్నారు.

తన జాతి ప్రాచీన ఔన్నత్యంపై గౌరవం లేని దేశం పురోగమించడం కష్టం. ఈ
దేశం అనాదిగా వేదభూమి. వేదమంత్రం మొదలుకొని, జానపదుల పలుకు వరకు విస్తరించిన ధర్మం మనది. ఇంత అనంత పరిధి కలది కనుకనే మన సనాతన ధర్మవృక్షం అచంచలమై విస్తరిల్లింది.

ఈ వృక్షంలోని కొమ్మలకీ, రెమ్మలకీ, పువ్వులకీ, పళ్ళకీ అన్నిటికీ ఒకే వేద ధర్మం మూలం. దీనితో మేళవించుకొని చెట్టుని కబళిద్దామనే చీడపురుగుల్ని తెలివిగా గుర్తించి
దూరం చేయడంలోనే మనం విజ్ఞతను కనబరచాలి.      

No comments:

Post a Comment