☘️🍁 ఆప్తవాక్యాలు 🍁☘️
78. కృష్యైత్వా క్షేమాయత్వా రయ్యైత్వా పోషయత్వా
కృషి - తద్వారా క్షేమం, సంపద, పోషణం(శుక్లయజుర్వేదం)
వేదఘోష ఎప్పుడూ కృషినే ప్రేరేపించింది.
అక్రమార్జన ఎంత దోషమో, అశ్రమార్జన (శ్రమ లేకుండా సంపాదించడం) కూడా
అంతే ఘోరం.
కష్టపడకుండా సుఖపడాలనే ఆశ పెరిగితే మనిషి సోమరి అవుతాడు. సుఖం విలువ కష్టపడ్డవానికే తెలుస్తుంది. ఏ కష్టమూ లేకుండా సంపాదించాలనే అత్యాశ
వల్లనే అవినీతి వ్యాధి పెరిగి వ్యక్తికీ, దేశానికీ శ్రేయోహాని కలిగిస్తుంది.
శ్రమ పడకుండా వేరే మార్గాలలో సంపాదించాలని కొందరు లాటరీలను
ఆశ్రయిస్తారు. ఇంకొందరు వంచనలకు పాల్పడతారు. అవినీతికి అంకితమవుతారు.ప్రజాధనాన్ని కూడా దోచుకునేందుకు సిద్ధపడతారు. అది అశ్రమార్జన, అక్రమార్జనకు
దారితీసి వ్యక్తిత్వంలోని శుద్ధతను నశింపజేస్తుంది. శుద్ధిలేని వ్యక్తిత్వం ఆత్మశక్తిని పోగొడుతుంది. ఫలితంగా అడుగడుగునా అశాంతి, ఆవేదనా మిగులుతాయి.
అందుకే వేదం కృషి గురించి చాలా గొప్పమాటల్ని చాటింది.
తే మనుష్యాః కృషించ
సస్యంచ ఉపజీవన్తి... అని అథర్వవేద వచనం.
మనుషులు కృషి ద్వారా లభించిన ఫలం వల్ల జీవించాలి. శ్రమ, సాఫల్యం - ఈ రెండే మనిషికి ముఖ్యం. అందుకే “ఉత్తమం స్వార్జితం విత్తం - మధ్యమం పిత్రార్జితం”.
స్వయంగా శ్రమించి సాధించిన సంపదనే ఉత్తమంగాను, పైతృక సంపదను మధ్యమంగాను సుభాషితాలు సైతం చెప్పాయి. మిగిలినవి పర ద్రవ్యాలు. వాటిని
ఆశించరాదు.
వరకట్నాలు, లంచాలు అన్నీ పరద్రవ్య వ్యామోహం కిందకు, దుష్ట సంపాదన
కిందకే వస్తాయి. ఎందుకంటే అవి కృషిరహిత ఆర్జనలు.
అక్షైర్మా దీవ్యః కృషిమత్ కృషస్వ - అని ఋగ్వేద వచనం.
'ద్యూతంతో, పాచికలతో ఆడకు. జీవనానికై కృషి చేయి' - ద్యూత సంపాదనను కూడా నీచార్జన కింద చెబుతుంది సనాతన మతం.
'సానో భూమిర్వర్ధయద్ వర్ధమానా' - కృషిచేత పృథ్వి అన్ని సంపదలను మనకు ప్రసాదిస్తుంది. వర్థిల్లుతుంది... అని వేదమాత పదేపదే పలుతావుల ప్రబోధిస్తోంది.
అలసత్వాన్నీ, సోమరితనాన్నీ మన సంస్కృతి ఎంత అసహ్యించుకుందో ఈ వాక్యాలు పట్టిచూపిస్తాయి.
'కృష్యైత్వా క్షేమాయత్వా రయ్యైత్వాపోషయత్వా'
కృషి - తద్వారా క్షేమం, సంపద, పోషణం... అని శుక్లయజుర్వేద బోధ. పాలకులు ప్రజలను కృషిచేసే వారిగా తీర్చిదిద్దాలని శ్రుతివాక్యాలు స్పష్టం చేశాయి. 'నో రాజాని కృషిం తనోతువంటి ఎన్నో వాక్యాలు దీనికి ఉదాహరణ. ప్రజలను తేలికగా
సుఖపడేలా మార్గాలను ప్రభుత్వాలు తెరవరాదు. అదృష్ట వ్యాపారాలను ప్రోత్సహించడం తగదు.
స్వధర్మ నిర్వహణ, స్వకర్మ పాలనలలో అలసత్వానికి అవకాశమీయరాదు.
ఇంద్రియాలు, బుద్ధి సరిగ్గా శ్రమించాలి. అది కూడా ధార్మికమైన రీతిలో ఉండాలి.
ధర్మనిర్వహణకు భగవంతుడిచ్చిన పరికరాల్లో మొదటిది శరీరం. 'శరీరమాద్యం ఖలు ధర్మసాధనమ్' అనే మాటకు ఇదే అర్థం.
పరిశ్రమించని వానికి సుఖపడే అర్హత లేదు. సులభ పద్ధతుల ద్వారా సేకరించుకున్న వాటికి స్థిరత్వమూ, దృఢత్వమూ ఉండవు.
మన చుట్టూ ఉన్న ప్రకృతిలో ఎన్నో సంపదలు దాగి ఉన్నాయి. కృషి ద్వారా వాటిని వెలికితీయాలి. ఆ పనిలో ప్రకృతికి సంబంధించిన శాశ్వత, దీర్ఘకాలిక ప్రయోజనాలు దెబ్బతినకుండా జాగ్రత్త పడాలి.
మానవ జీవనానికి సార్థక్యం కృషి మాత్రమే. 'కృషితో నాస్తి దుర్భిక్షమ్' అన్న ప్రాచీనుల పలుకులు వేదహృదయ స్పందనలే. ఈ సనాతన నాదాన్ని అమలు పరచుకున్న దేశాలు అద్భుతంగా అభివృద్ధిని సాధిస్తాయనడంలో సందేహం లేదు.
No comments:
Post a Comment