Tuesday, January 14, 2025

 కాఫీ కబుర్లు సంఖ్య 795 - జనవరి 14 - 2025) -- సంక్రాంతి వచ్చేసింది.. -- ఇంచుమించు దేశవ్యాప్తంగా జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి.  సూర్యునికి పోంగలి నివేదన, పుణ్యస్నానాలు, పతంగుల ఎగురవేత, మహిళలు పసుపు కుంకుమలు వాయనాలు ఇచ్చిపుచ్చు కోవడం.. వంటివి సంక్రాంతి ప్రత్యేకతలు.  మనదేశంలో వివిధ రాష్ట్రాలలో సంక్రాంతి పండుగ నేమంటారో, ఎలా జరుపుకుంటారో క్లుప్తంగా రాష్ట్రాలవారీగా చూద్దాం. ---- కర్ణాటకలో సుగ్గి అంటారు.  బెల్లంతో చేసిన మిఠాయిలు ఇచ్చిపుచ్చుకునే సంప్రదాయం ఉంది.  /  తమిళనాడులో పొంగల్ పేరుతో మూడురోజుల పండుగ జరుపుకుంటారు..  /  పశ్చిమ బెంగాల్ లో పౌష్ సంక్రాంతి అంటారు.  అందమైన ముగ్గులు వేసి, మామిడాకు తోరణాలు అలంకరించి లక్ష్మీదేవిని ఇళ్ళకు ఆహ్వానిస్తారు..  /  హిమాచల్ ప్రదేశ్ లో మాఘసాజి అంటారు.  మట్టి పాత్రలలో అన్నం వండడం,  గాలిపటాలు ఎగురవేయడం ఈ పండుగ ప్రత్యేకతలు..  /  గుజరాత్ లో ఉత్తరాయణ్ అంటారు.  రకరకాల గాలిపటాలు ఎంతో ఉత్సాహంగా ఎగురవేస్తారు..  /  అస్సాంలో భోగాలి బిహు అంటారు.  ఇక్కడ కూడా పంటల పండుగే.  మంటలు వేసి అగ్ని దేవుణ్ణి ప్రార్ధిస్తారు..  /  ఉత్తరప్రదేశ్ లో కిచిడీ పర్వ్ అంటారు.  ప్రయాగ త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరిస్తారు.  కిచిడీ వండి సూర్య భగవానునికి నైవేద్యం పెడతారు.  /  పంజాబ్ లో రైతాంగం లోహ్రి పేరుతో పెద్దగా జరుపుకుంటారు.  పంటకోత ముందు మంచి దిగుబడులు రావాలని దేవుని ప్రార్థిస్తారు.  గౌరవం రావాలి, పేదరికం పోవాలి  అని ఉచ్చరిస్తూ అగ్ని చుట్టూ తిరుగుతారు..  /  ఒరిస్సాలో మకర్ చౌలా అంటారు.  చక్కెర, అరటిపండు, కొబ్బరి, మిరియాలతో చేసిన తియ్యటి అన్నం నివేదిస్తారు.  ఈరోజు కొణార్క్ దేవాలయంలో జనసందోహం విపరీతంగా ఉంటుంది..  /  జమ్ము కాశ్మీర్ లో శిశుర్ సంక్రాంత్ అంటారు..  /  రాజస్థాన్-మధ్యప్రదేశ్ -ఢిల్లీ-హర్యానా లలో సక్రాత్ లేదా సుక్రాత్ అంటారు.  సూర్యునికి విశేష పూజలు చేసి నువ్వులతో చేసిన తీపి వంటకాలు నైవేద్యంగా సమర్పిస్తారు..  /  మహారాష్ట్ర గోవా లలో హల్దీ కుంకుమ్ అంటారు.  సంక్రాంతి వేడుకలు 15 రోజులపాటు నిర్వహిస్తారు.  పెళ్ళైన స్త్రీలు తమ సౌభాగ్యం కోసం ఒకరికొకరు పసుపు కుంకుమలు ఇచ్చిపుచ్చు కుంటారు..  /  ఇక మన తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ తెలంగాణా లలో ఈ పండుగను నాలుగు రోజులు ఎంతో ఉత్సాహంతో సంబరంగా జరుపుకుంటారు.  భోగీమంటలు వేయడం, చిన్నారులకు భోగీ పండ్లు పోయడం, పొంగలి నివేదన, గోదా కళ్యాణం, వాయనాలు ఇచ్చిపుచ్చుకోవడం, తెలంగాణా సికింద్రాబాద్ పేరేడ్ గ్రౌండ్ లో మూడురోజుల కైట్ & స్వీట్ ఫెస్టివల్, పశువుల అలంకరణ వంటి ప్రత్యేకతలు ఉంటాయి..  ---- మనందరికీ ఈ సంక్రాంతి మరింత శోభాయమానంగా ఉండాలని.. మన జీవితాల్లో మరింత కాంతిని నింపాలని కోరుకుంటూ..  ప్రతి ఒక్కరికీ సంక్రాంతి శుభాకాంక్షలు..  ------ గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని) సికింద్రాబాద్ ఫోన్ 99855 61852....

No comments:

Post a Comment